చెంచు జాతిని కాపాడాలి

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
 

అసెంబ్లీ: అడవుల్లో నివసిస్తున్న చెంచులకు అటవీ హక్కులు కల్పిస్తూ ..ఆ జాతిని కాడాల్సిన అవసరం ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో చెంచుల స్థితిగతులపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే  ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో చెంచులు చాలా మంది నివసిస్తున్నారు. చెంచులు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆదుకుంటామని గొప్పగా చెప్పాయి. జనాభా  ప్రతిపాదికన చూస్తే..చెంచు జాతీ రోజు రోజుకు అంతరించిపోతోంది. అటవీ ప్రాంతంలో జీవనం చేస్తున్న చెంచులు అటవీ ఉత్పత్తులైన కుంకుడు కాయలు, జిగురు, బంకను సేకరించి జీవనం పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో అటవీ అధికారులు చెంచులను ఇబ్బందులు పెడుతున్నారు. అడవుల్లోకి వెళ్లకుండా అటవీ  అధికారులు అడ్డుకుంటున్నారు. ఇటీవల శ్రీశైలం నియోజకవర్గానికి మంత్రి కూడా వచ్చారు. ఆయనకు కొన్ని చెంచు గూడెలు చూపించాం.అక్కడ వ్యవసాయానికి 200 ఎకరాలు పైగా ఉంటే..దాని పక్కనే సిద్దాపురం చెరువు ఉంది.ఈ చెరువు నుంచి వంద అడుగుల దూరంలో నీరు ఇవ్వడానికి కూడా అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. అలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. చెంచులను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే అటవీ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. చెంచులు జీవనం చేయాలంటే ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూలీనాలి చేసుకోవాల్సిన దుస్థితి చెంచులకు వచ్చింది. అటవీలో జీవించే వారికి అటవీ హక్కులు కల్పిస్తే చాలు. వ్యవసాయమే కాకుండా చెరువులను నీటితో నింపాలన్నా..చెరువుల వద్దకు వెళ్లాలన్నా అటవీ అధికారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు.  చెంచులకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం ఇచ్చింది కానీ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలు, హాస్టళ్లలో చెంచులు తక్కువగా ఉంటున్నారు. మిగతా కులాల వారు ఎక్కువగా చదువుతున్నారు. వాళ్ల జీవన స్థితిగతులు మారాలంటే చదువు ఎంతో అవసరం. అటవీ ప్రాంతంలో చిన్న రోడ్డు వేయాలన్నా..బోరు వేయాలన్నా అనుమతులు అవసరమవుతున్నాయి. ఏ పని చేయాలన్నా అటవీ అధికారులతో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చెంచు జాతిని కాపాడాలంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉంది. 
 

తాజా ఫోటోలు

Back to Top