టీడీపీ.. జూమ్, ట్విట్టర్‌ పార్టీగా మిగిలిపోయింది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

తాడేపల్లి: పేద, బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడుతున్నారని, సంవత్సరకాలంలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. రానున్న రోజుల్లో ఏ తేదీన.. ఏ కార్యక్రమం అమలు చేయబోతున్నామని క్యాలెండర్‌ విడుదల చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ఆధారంగా చేసుకొని ఏదైనా సంక్షేమ పథకం అమలుకు నాలుగు రోజుల ముందే ఎల్లో మీడియాలో వరుసగా కథనాలు రాయించి, ట్వీట్లు వేసి తమ వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయిస్తుందని చంద్రబాబు, ఎల్లో మీడియా గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 

ఈనెల 24వ తేదీన కాపు నేస్తం పథకం ప్రారంభోత్సవం ఉందని, దానిపై కూడా ఎల్లో మీడియాతో కథనాలు రాయడం మొదలుపెడతారేమోనని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే నెల 8వ తేదీన దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా 30 లక్షల ఇళ్ల పట్టాలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పంపిణీ చేయనున్నారని, దానికి సంబంధించి నిన్నటి నుంచి చంద్రబాబు, టీడీపీ నేతలు ట్వీట్లు వేయడం మొదలుపెట్టారన్నారు. చంద్రబాబుపై ఉన్న గురుభక్తిని చాటుకునేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 తహతహలాడుతున్నాయన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఏస్థాయికి దిగజారిపోయిందో ఆ పార్టీలోని నాయకులు, స్వయం ప్రకటిత మేధావులు గమనించాలని, తెలుగుదేశం పార్టీ జూమ్, ట్విట్టర్‌ పార్టీగా మిగిలిపోయిందన్నారు.

Back to Top