ఆధారాలతో చర్చకు వచ్చే దమ్ముందా..?

లింగమనేని గెస్ట్‌హౌస్‌పై చంద్రబాబు, రమేష్‌కు ఆర్కే సవాల్‌

అక్రమ నివాసంలో ఉంటూ నీచ రాజకీయాలు

లింగమనేని రమేష్‌తో చంద్రబాబే లేఖ రాయించాడు

గెస్ట్‌హౌస్‌ ప్లాన్‌ ఏదీ.. ఫీజు ఎంత కట్టారు

ప్రభుత్వానికి ఇచ్చేశానని ఏ మొహం పెట్టుకొని లేఖ రాశావ్‌..?

రెయిన్‌ట్రీ పార్కుకు పైపులైన్‌ నిర్మాణ ఖర్చు ఎవరు భరించారు

నేషనల్‌ హైవేని ఆనుకొని దారి నిర్మించేందుకు భూమి కాజేశారు

చంద్రబాబు, లింగమనేనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్‌

తాడేపల్లి: అక్రమ నిర్మాణంలో ఉంటూ.. నోటీసులు ఇచ్చినా తప్పుకోకుండా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఆ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన లింగమనేని రమేష్‌ ఎందుకు ఐదు పేజీల లేఖ రాశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు ముమ్మాటికీ అక్రమ నిర్మాణమని, చంద్రబాబు, లింగమనేని రమేష్‌కు దమ్ముంటే చర్చకు రావాలని, ప్రజల సమక్షంలో అక్రమ నిర్మాణమని ఆధారాలతో సహా చూపిస్తానని ఆర్కే సవాలు విసిరారు. హైకోర్టు నోటీసులు ఇచ్చినా స్పందించని లింగమనేని రమేష్‌ ఇవాళ ఎందుకు ఐదు పేజీల లేఖ రాశారో చెప్పాలన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అప్పటి మంత్రి దేవినేని ఉమా బోటు వేసుకొని నదిలో తిరుగుతూ ఇవన్నీ అక్రమ నిర్మాణాలు, వీటన్నింటినీ తొలగిస్తామని చెప్పిన మాట మర్చిపోయారా లింగమనేని రమేష్‌. తాడేపల్లి తహసీల్దార్‌ అక్కడున్న గృహాలకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా.. తహసీల్దార్‌ నోటీసులకు స్పందించలేదు. సక్రమం అని చెప్పలేదు. దేవినేని ఉమ ఇవన్నీ అక్రమ నిర్మాణాలు తీసేస్తామంటే నోరు కూడా మెదపలేదు. ఈ రోజు ఎటువంటి అనుమతులు లేకున్నా కట్టబడిన ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పడం.. నా ఇంటిని కూల్చేస్తున్నారని ఇప్పుడు అనడం వెనుక అంతర్యం ఏమిటీ. చంద్రబాబు ఆటాడిస్తున్నాడు. చంద్రబాబు, నువ్వు కలిసి కుట్రలు పన్నుతున్నారు.

హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించినా తిరిగి కౌంటర్‌ దాఖలు చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు వల్ల ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి లేకపోతే ఎందుకు ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారు. ల్యాండ్‌ పూలింగ్‌ ఎక్కడైతే ఆగిపోయిందో.. ఆ రోడ్డును ఆనుకొని లింగమనేని ప్రాపర్టీస్‌ మొత్తం ఉన్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌లోకి ప్రాపర్టీస్‌ రాకూడదు. చంద్రబాబుకు నెలకు ఇంటి అద్దెకు రూ. లక్ష ఇస్తుంది. ప్రభుత్వం నుంచి ఐదేళ్లలో రూ. 60 లక్షలు వచ్చాయి. బర్రె ఎక్కడ ఉంటుందో.. దూడ కూడా అక్కడే ఉంటుంది కదా.. లోకేష్‌కు కూడా రూ. 60 లక్షలు వస్తుంది. రూ. 1.20 కోట్లు హెచ్‌ఆర్‌ఏ కింద డ్రా చేసిన ఇద్దరు ఆ డబ్బులు లింగమనేనికి ఇచ్చారా లేదా.. ఒకవేళ ఇచ్చి ఉంటే ఐటీ రిటర్న్‌స్‌లో చూపించారా లేదా..? లేదు ఫ్రీగా ఇచ్చానంటే అయ్యా కొడుకులు ఇద్దరూ రూ. 1.20 కోట్లు ఎలా డ్రా చేస్తారు.

రెయిన్‌ ట్రీ పార్కుకి సంబంధించి నేషనల్‌ హైవే నుంచి దారి ఎలా వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. రాబోయే రోజుల్లో మొత్తం బయటపెట్టిస్తా. నాకు తెలిసి నంబూరు గ్రామం, పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాలు అప్పనంగా కాజేశారు. మంగళగిరి నియోజకవర్గం ఖాజగ్రామంలో సుమారు 5 ఎకరాలు కాజేశారు. కాబట్టే రెయిన్‌ట్రీ పార్కుకి దారి వచ్చింది. రెయిన్‌ ట్రీ పార్కుకి మంచినీరు ఎక్కడి నుంచి వస్తుంది. పైపులైన్‌ నిర్మాణ ఖర్చు ఎవరు భరించారు. జిల్లా పరిషత్‌ నిధులు వాడుకున్నట్లుగా తెలిసింది.

నా మీద కక్షగట్టారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. కక్షకట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏ కోశాన ఉండదు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కక్షకడితే రెయిన్‌ట్రీ పార్కులోని విల్లాల్లో ప్రభుత్వ అధికారులు, కొన్ని ఆఫీసులు ఉన్నాయి. అంటే వాళ్లను ఖాళీ చేపించేవారిమేగా.. గత ఐదేళ్లుగా చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తి ఇవాళ బాబు ఆడిచినట్లుగా ఆడుతున్నారు. యజ్ఞాలు, యాగాల కోసం నదీ తీరాన ఇల్లు కట్టుకున్నట్లు లింగమనేని రమేష్‌ చెబుతున్నాడని, ఈ ఐదేళ్లు చంద్రబాబు, లోకేష్, లింగమనేని కలిసి చెక్కభజనలు చేశారా ఆ ఇంట్లో..? చట్టాలు, నిబంధనలను తుంగలో తొక్కి చంద్రబాబు వెనుక ఉన్నారనే ధీమాతో లింగమనేని ఇల్లు కట్టుకున్నాడు.

ఇల్లు నాది కాదని చెప్పిన లింగమనేని రమేష్‌ తిరిగి ఇవాళ ఐదు పేజీల లెటర్‌ రాశారంటే చంద్రబాబు రాయించారని ఖచ్చితంగా చెబుతా. కోర్టు నోటీసులు ఇచ్చినా స్పందించని వ్యక్తి ఐదు పేజీల లెటర్‌ రాశాడంటే ఎంత దారుణంగా లింగమనేనిపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చాడో అర్థం అవుతుంది. చట్టాలకు లోబడి ధర్మానికి, న్యాయానికి అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుంటే అక్రమ కట్టడాల గురించి సమాజానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధిలేని ఒక ముసలాయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను చంద్రబాబు అండగా తీసుకొచ్చుకున్నాడు. అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చేస్తుంటే దాన్ని హర్షించాల్సిందిపోయి చంద్రబాబును వెనకేసుకొస్తూ రాతలు రాస్తున్నాడు.

చంద్రబాబు, లింగమనేని రమేష్‌కు సవాలు విసురుతున్నా. ప్రజల సమక్షంలో కూర్చుందాం. ఆధారాలతో సహా చర్చిద్దాం. ఉండవల్లి గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చిందని లింగమనేని అంటున్నారు. వచ్చి పేపర్లు చూపించండి. ఇంత వరకు అనుమతులు ఇవ్వలేదు. సర్వే నంబర్‌ 271లో లింగమనేని ఇంటిని నిర్మించుకున్న భూమి ప్రభుత్వ స్థలం అని స్పష్టంగా చెప్పబడి ఉంది. సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఇచ్చిన లేఖలో సర్వే నంబర్‌ 254, 250 అని చెబుతున్నాడు. ఇంత దారుణంగా ఇంటికి ప్లాన్‌ పర్మిషన్‌కు అప్లయ్‌ చేయలేదు. ఫీజు కట్టలేదు. ఎటువంటి అనుమతులు పొందలేదు. వచ్చి కాగితాలు చూపించాలి.

ఒక ఓటును కొనడానికి రూ. 5 కోట్లు ఆఫర్‌ ఇచ్చి రూ. 50 లక్షలు అడ్వాన్స్‌ ఇస్తూ చంద్రబాబు పట్టుబడ్డాడు. ఇలా ఎంత మందిని ఎన్ని సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్నాడో. ఇదే లింగమనేని అధికారిని భయపెట్టి ఒక స్విమ్మింగ్‌ పూల్‌కు పర్మిషన్‌ తెచ్చుకున్నాడు. అగ్రికల్చర్‌ ల్యాండ్‌ను రెసిడెన్షియల్‌ ల్యాండ్‌కు కన్వర్షన్‌ చేయించారా..? గ్రామ పంచాయతీ రికార్డులు చూస్తే ఎక్కడా లింగమనేని రమేష్‌ పేరే లేదు. పన్ను కడుతున్నా అని చెప్పడం ఎంత వరకు సమంజసం. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఇంటి నుంచి తప్పుకోకుండా.. ఇప్పటికీ ఆ ఇంటిని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందాలని నీచ రాజకీయం చేస్తున్నాడు.

2011లో లింగమనేని ఒక దరఖాస్తులో పెట్టిన సంతకం, నిన్న రాసిన సంతకం సంబంధం లేకుండా ఉన్నాయి. అయితే వీటిలో ఏదో ఒకటి ఫోర్జరీ డాక్యుమెంట్‌. ఈ రెండు లేఖలు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాలి. లెక్కలు తీసి ప్రభుత్వ భూమిని ఎంత ఆక్రమించుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా కట్టారని లెక్కలు తీసి క్రిమినల్‌ కేసులు ఎందుకు పెట్టకూడదో ప్రభుత్వాన్ని కోరుతా.. ఐపీసీ 420, 468, 471 కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతానని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

Back to Top