తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్అధ్యక్షుడు ఎం మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపు కేసుల్లో భాగంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాకాణి గోవర్థన్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోనే మైనింగ్ అధికారి బాలాజీనాయక్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించి, కేసు పెట్టించారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టవిరుద్దమైన అన్ని పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద అక్రమ మైనింగ్ అంటూ ఓ తప్పుడు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనివెనుక కారణం ఏంటని చూస్తే పొదలకూరు దగ్గర క్వార్ట్జ్ మైనింగ్‌కి రుస్తుం మైకా అనే కంపెనీ లీజు హోల్డర్లు. వారికి 2009 నుంచి 2023 ఏప్రిల్ 1 వరకు లీజు గడువు ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వ పాలసీ మారిన తర్వాత తిరిగి ఎవరికీ లీజుకివ్వలేదు. అయితే అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధర్నాలు చేసి ఫిర్యాదులు చేస్తే, అప్పట్లోనే మైనింగ్ అధికారులు విచారణ చేసి ఎటువంటి అక్రమ మైనింగ్ జరగలేదని నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే అంశంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తాజాగా ఫిర్యాదు చేయించి కేసు పెట్టడం రాజకీయ కక్షసాధింపు కాదా? కుట్రపూరితంగానే అక్రమ మైనింగ్ కేసు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేయడం మొదలైంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 14, 2025లో మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ అనే వ్యక్తితో అక్రమ మైనింగ్ చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో ముద్దాయిలుగా ముగ్గుర్ని చేరిస్తే వారందరికీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు అయ్యింది. ఇందులో కాకాణి గోవర్థన్‌రెడ్డి పేరు ఎక్కడా లేదు. ఎఫ్ఐఆర్‌లో అదర్స్ ప్లేస్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరును చేర్చారు. కొంతమందిని అరెస్ట్ చేసి వాంగ్మూలం తీసుకున్నారు. మైనింగ్ చేసుకోండి, మీ వెనుక నేనున్నాను అని కాకాణి అభయం ఇచ్చినట్టుగా ఏ6 అరవిందకుమార్‌రెడ్డి అనే వ్యక్తిని బెదిరించి, కొట్టి ఆయనతో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత జూలై 2025న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో ఫిర్యాదు చేయించారు. కాకాణికి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో సెక్షన్లు మార్చి నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ తప్పుడు కేసులోనే ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులోనూ జరిగింది ఇదే. మొదట ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టయిన తర్వాత పీసీఐ యాక్ట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. పల్నాడు జంట హత్యలతో పిన్నెల్లి సోదరులకు ఏం సంబంధం? మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకులు బైకుపై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి చంపారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఈ దాడి జరిగిందని, దాడి చేసిన వారు కూడా టీడీపీ వారేనని ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇదే విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. కానీ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేకపోయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మీద అక్రమ కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వారిపై తప్పుడు కేసు నమోదు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారుపై కూడా జేబీఆర్ (జూలకంటి బ్రహ్మారెడ్డి) పేరు కూడా ఉంది. హత్యను కళ్ళారా చూసిన మృతుడి బంధువు తోట ఆంజనేయులు సైతం టీడీపీ వారే చంపారని పోలీసులతో చెప్పారు. దీనికి సంబంధించి వారు మాట్లాడిన వీడియోలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఇది అక్రమ కేసేనని రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెబుతారు. కల్తీ లిక్కర్ మరణాలను మద్యం కేసుకి లింక్ చేస్తున్నారు గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలతో కొందరు చనిపోయారని టీడీపీ నాయకులు అసెంబ్లీలో ఆరోపిస్తే ఇదంతా అవాస్తవమని దానిపై నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమాధానం ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ అంశాన్ని తీసుకొచ్చి కొత్తగా కేసులు నమోదు చేస్తున్నారు. కల్తీ మద్యం తాగి చనిపోయారని కుటుంబసభ్యులే స్టేట్‌మెంట్ ఇచ్చినా, ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం వల్లే ఆ మరణాలు సంభవించినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 25 మంది చనిపోయినట్టు కొత్త కథలు రచించి భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల్లో విషం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై నాటి సీఎం జగన్ మాట్లాడుతూ సహజ మరణాలను కూడా కల్తీ లిక్కర్ మరణాలుగా మార్చి ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు. లిక్కర్ లో విషపూరిత అవశేషాలనున్నట్టు తప్పుడు ప్రచారం ఏపీలోని మద్యం శాంపిళ్లను పరీక్షించిన ఎస్‌జీఎస్ లేబొరేటరీ అందులో విషపూరిత అవశేషాలున్నట్టుగా తేల్చిందని టీడీపీ నాయకులు విష ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన నాటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని బేవరేజెస్ కార్పొరేషన్ తరఫున నేరుగా లేబొరేటరీకి లేఖ రాసింది. దీనిపై ఎస్‌జీయస్ లేబొరేటరీ స్పందించి తాము అలాంటి నివేదికే ఇవ్వలేదని లిఖితపూర్వకంగా చెప్పినా ఇంకా అసత్యాలనే టీడీపీ ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అబద్ధాల ఫ్యాక్టరీగా మారిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని తమకు గిట్టని వారి మీద అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. నడిరోడ్డుపై పోలీసుల అరాచకం రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడి రోడ్డు మీదనే దళిత యువకులను పోలీసులు దారుణంగా కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై మానవహక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తాం. కూటమి నాయకులు ఏది చెబితే అది చేయడానికి పోలీసులు వెనుకాడటం లేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ప్రజాస్వామ్య వాదులు మేథావులు ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.