టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్

వైయస్ జగన్‌ను విమర్శించడానికే మహానాడు పరిమితం

ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేకపోయారు

రాయలసీమ గురించి మాట్లాడే అర్హతే చంద్రబాబుకు లేదు

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయలసీమ ప్రాజెక్ట్‌లకు చంద్రబాబు హయాంలో గ్రహణం

వైయస్ఆర్‌, వైయస్ జగన్ పాలనలోనే ప్రాజెక్ట్‌లకు మోక్షం

ఎన్నికల హామీలను అమలు చేయలేని అసమర్థ పాలన చంద్రబాబుది

చెప్పినవన్నీ ఆచరణలో చూపిన ఘనత వైయస్ జగన్‌ది

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి:  కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైయస్ జగన్‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైయస్ జగన్‌దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకు, వైయస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్లుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజలకు కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండ మూడు రోజులు గడిపేశారు. కేవలం వైయస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. 

ప్రజలను నమ్మించి మోసం చేశారు 

మహానాడులో మాట్లాడిన నేతలంతా వైయస్ జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని అర్థమవుతోంది. వైయస్ జగన్‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్, చేయూత, ఆసరా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైయస్ జగన్ గారి ఏడాది పాలనలో ఆఖరి మూడు నెలలు కరోనా ఉంది. అంతకు ముందు రెండు నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన ఏడు నెలల్లో జగన్ గారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మహిళలకు డ్వాక్రారుణమాఫీ, పెన్షన్లు పెంచారు, చేయూత, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏం చేశారని వారిని గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. 

వైయస్ జగన్ పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి 

వైయస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే లక్షా నలబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాడు-నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనలు బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తియినా డీఎస్సీనీ పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమయ్యింది? ప్రతిసారీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారే తప్ప, ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. గాలేరీ-నగరీ, హంద్రీనీవాకు చంద్రబాబు ఏం చేశారు? ఆనాడు ఎన్డీఆర్ పునాది వేస్తే, చంద్రబాబు హయాంలో కేవలం అయిదు టీఎంసీలకే వాటిని పరిమితం చేశారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైయస్ఆర్, వైయస్ జగన్ హయాంలోనే వచ్చాయి. కర్నూలు రాజధానిని వదులుకున్నందుకు ఈ ప్రాంతానికి హైకోర్ట్ వస్తుందని భావిస్తే, దానికి కూడా ఆటంకాలు కల్పించారు. సత్యవేడు, శ్రీసిటీ, కొపర్తి పారిశ్రామికవాడలను తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. 

రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబే

తాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్‌లో కనీసం 13 క్యూసెక్కుల నీటిని నిల్వ చేయలేకపోయారు. వైయస్ఆర్‌ దానిని నిర్మిస్తే, చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అదే గండికోట రిజర్వాయర్‌లో వైయస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న చర్యల కారణంగా 27 టీఎంసీలను నిలబెట్టారు. సీమలోని అనేక ప్రాజెక్ట్‌ల్లో నీటి నిల్వలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటి నుంచో నంద్యాల, తిరుపతి జిల్లా కావాలని ప్రజలు పోరాటాలు చేస్తే, వైయస్ జగన్ ఎటువంటి పోరాటాలు లేకుండానే కొత్తగా సీమకు నాలుగు కొత్త జిల్లాలను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రీసెర్చ్ సెంటర్, శుద్ది చేసిన జలాలను తీసుకువచ్చారు. కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా? చంద్రబాబు హయాంలోనే సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగింది. వైయస్ఆర్ హయాంలో ఫ్యాక్షన్ తో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేసుకుని సీట్లు ఇచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. నేడు వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఫీజురీయింబర్స్‌మెంట్. వైయస్ఆర్ పేరు చెబితే 108, 104 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం చేయకుండానే, తనకున్న ఎల్లో మీడియా బలంతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడం తెలియని వైయస్ జగన్ మాత్రం ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు

పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కరలేదని చంద్రబాబు మోకాలడ్డారు. పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచన చేయాలి. చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణం దండుగ అని రాసుకున్నారు. అటువంటి చంద్రబాబు పోలవరంను నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చేపడతానంటూ, పోలవరంను నాశనం చేశారు. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్ట్‌లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయకక్షలను పెంచిపోషించారు. పల్నాడులో పట్టపగలు హత్యలు, తెనాలిలో దళత, మైనార్టీ యువకులపై పోలీసుల దాష్టీకం ఇవ్వనీ ప్రజాస్వామిక స్పూర్తితోనే చేస్తున్నారా? కేవలం తెలుగుదేశం వారికే పథకాలు అందించాలి, పని చేయాలంటూ ఒక సీఎంగా ఉండి ఎలా పిలుపునిచ్చారు? దీనినే పరిపాలన అంటారా? గతంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు పథకాల సొమ్మును చేరువ చేశాం. దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలో వైయస్ఆర్‌సీపీ వారికి ఎటువంటి పథకాలు అందకూడదని మాట్లాడటంను ఎలా చూడాలి. నరేంద్రమోదీ గురించి గత అయిదేళ్ళ కిందట ఎంత దారుణంగా మాట్లాడాడో చంద్రబాబు మరిచిపోయారు. ఈరోజు మహానాడులో ఎన్డీఆర్ పేరును జపిస్తున్న చంద్రబాబు అధికారం కోసం ఆయన జీవించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రజలు మరిచిపోలేదు. బ్రాహ్మిణీ స్టీల్‌ను నిర్మించాలని వైయస్ఆర్ అనుకుంటే, చంద్రబాబు దానిని దారుణంగా అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. 

గొప్పలు చెప్పుకోవడంలో ఘనుడు చంద్రబాబు

హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. మహానాడు మొదలయ్యే రోజున వైయస్ఆర్‌జిల్లా పేరును మార్పిస్తూ జీఓ తెప్పించుకున్నారు. మీలాగా మేం ఏనాడు ఆలోచించలేదు. ఎన్డీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీకి స్వతాహాగా ఒక డాక్టర్, సీఎంగా వైద్య, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైయస్ఆర్‌ పేరు పెడితే సహించలేకపోయారు. ఈ రోజు కడపలో వైయస్ఆర్‌ విగ్రహాలను అవమానించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల ముసుగులో కమీషన్లు దండుకుంటున్నారు. రివర్స్‌ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైయస్ జగన్ భావిస్తే, దానిని కూడా తొలగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు. వైయస్ జగన్ ఒక్క సమావేశం పెడితే, మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు.

Back to Top