పులివెందుల మెడికల్ కళాశాలను సందర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు 

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నిర్మించిన పులివెందుల మెడికల్ కళాశాలను  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సంద‌ర్శించారు. సోమ‌వారం వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామ సుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి తదితరులు మెడికల్ కళాశాల భవనాలను, ఆసుపత్రి భవనాలను, నర్సింగ్ కాలేజీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి స‌రిగ్గా లేక‌పోయినా ప్ర‌జ‌లకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాల‌నే త‌ప‌న‌, తాప‌త్ర‌యంతో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లాకో మెడిక‌ల్ కాలేజీని నిర్మించేందుకు శ్రీ‌కారం చుట్టార‌న్నారు. పులివెందుల‌లో దాదాపు 90 శాతం మెడికల్ కళాశాల పనులు పూర్తి చేశార‌ని చెప్పారు. రూ. 532 కోట్ల ప్రాజెక్టుతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టిన‌ట్లు తెలిపారు. ఇందులో కేవలం దాదాపు 120 కోట్ల రూపాయలు పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పనులు  కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేక చేతులెత్తేసింద‌ని విమ‌ర్శించారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలను సందర్శించి ఫేస్3, 4 నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఫోటోలు దిగి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదని అవాస్తవాలు ప్ర‌చారం చేయ‌డం సిగ్గుచేటు అన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్వయంగా పరిశీలించి పులివెందుల మెడికల్ కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు భ‌ర్తీ చేసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుమ‌తి ఇచ్చింద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు మంచి పేరు వ‌స్తుంద‌న్న అసూయ‌తో ఈ సీట్లు వ‌ద్దంటూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింద‌ని త‌ప్పుప‌ట్టారు. కేవలం ప్రైవేటు వ్యక్తులకు మెడిక‌ల్ కాలేజీలు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం కుట్ర‌లు చేస్తుంద‌ని, వీటిని ప్రైవేట్‌ప‌రం కాకుండా అడ్డుకుంటామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హెచ్చ‌రించారు.  

Back to Top