విజయవాడ: భవానీపురం జోజినగర్ లో ఇళ్ల కూల్చివేతపై వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం వేకువజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో 200 మందికిపైగా పోలీసులు జేసీబీ లతో వెళ్లి ఇళ్లల్లో ఉన్న వారిని బెదిరించి బయటకు పంపించివేశారు. సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను నేలమట్టం చేశారు. డిసెంబర్ 31 వరకు ఇళ్లు కూల్చివేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని బాధితులు కోర్టు ఆర్డర్ చూపిస్తున్నా లెక్కచేయకుండా ఆ కుటుంబాలను రోడ్డున పడేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తగు న్యాయం చేయాలని కోరుతూ ఇప్పటికే బాధితులు పలుమార్లు మంత్రి నారా లోకేష్ ని కలిసి విన్నవించారు. జనసేన పార్టీ కార్యాలయంలో చెప్పుకున్నారు. ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యేను సైతం వేడుకున్నారు. అయినా వారెవరూ కనీసం స్పందించలేదు. చివరికి ఇళ్లను కూల్చివేయడంతో జోజినగర్ బాధితులంతా శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిసి తమ కష్టాన్ని చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన వైయస్ జగన్ గారు.. బాధితులకు అండగా నిలబడి పోరాటం చేయాలని ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులను ఆదేశించారు. వైయస్ జగన్ గారి ఆదేశాలతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి తదితరులు జోజినగర్ వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులను ఓదార్చి వైయస్ఆర్‌సీపీ అండగా ఉండి పోరాడుతుందని భరోసా కల్పించారు. అనంతరం వారు అక్కడే మీడియాతో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఆదేశాలతోనే, ప్రభుత్వానికి తెలిసే ఇళ్ల కూల్చివేత జరిగిందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టే ఇంత అమానుషంగా ఇళ్లను కూల్చివేసినా పరామర్శించడానికి వారు రాలేదన్నారు. ఇళ్ల కూల్చివేత వ్యవహారం మొత్తం ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలిసే జరిగిందని, కాబట్టే బాధితులు గతంలో ఎన్నోసార్లు ఈ సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినా, జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని చెప్పారు. న్యాయపరంగా కొన్ని వివాదాలున్న వేల కోట్ల విలువైన ఈ భూమిపై కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంపీ కేశినేని చిన్ని కన్నేశాడని ఆరోపించారు. నాలుగు నెలల క్రితం ఒకసారి కూల్చివేతలు చేయబోతే మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు అడ్డుకున్న విషయాన్ని నాయకులు గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి ఈ సమస్య గురించి వివరించామని, ఆయన ఆదేశాలతోనే జోజినగర్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు వైయస్ఆర్‌సీపీ నాయకులు మీడియాకు వివరించారు. బాధితులకు న్యాయ జరిగే వరకు వారి పక్షాన వైయస్ఆర్‌సీపీ నిలబడి పోరాడుతుందని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై తక్షణం సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలిసే కూల్చివేతలు - మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ జోజినగర్ లోని 42 ఫ్లాట్స్‌ని కూల్చివేయడం దుర్మార్గం. డిసెంబర్ 31 వరకు ఇళ్లజోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పక్కనపెట్టి బుధవారం తెల్లవారుజామున పోలీసులు, వందల సంఖ్యలో రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్‌ని వెంటేసుకొచ్చి ఇళ్ల కూల్చివేత తంతు కొనసాగించారు. సామాన్లు సర్దుకుని ఇంటి నుంచి బయటకొచ్చే టైం కూడా ఇవ్వకుండా అత్యంత అమానవీయంగా కూల్చివేతలు సాగించి 42 కుటుంబాలను రోడ్డున పడేశారు. తమ ఇళ్లను కూల్చకుండా అడ్డుకోవాలని కోరుతూ బాధితులు ఇప్పటికే నారా లోకేష్ సహా స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిసినా వారి మొర ఆలకించలేదు. ఇళ్లు కూల్చివేత బాధితులంతా 20 ఏళ్లుగా విజయవాడ కార్పొరేషన్‌కి ఇంటి పన్ను, నీటి పన్ను కడుతున్నారు. కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. నెలనెలా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఈ ప్లాట్లు తమవేనని చెప్పడానికి అన్ని ఆధారాలు చూపిస్తున్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఇదంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలిసే జరిగింది. కాబట్టే వారు ఇంతవరకు కనీసం పరామర్శకు కూడా రావడంల లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ చూపించినా వినలేదంటే కోర్టులంటే కూడా ప్రభుత్వానికి గౌరవం ఉండటం లేదు. బాధితులను ఇళ్లు ఖాళీ చేయించే సందర్భంలో కొంతమంది రౌడీలు మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. ఇళ్ల కూల్చివేత ఘటనపై తక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం స్పందించకుంటే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. బాధితుల పక్షాన నిలబడి పోరాడుతుంది. త్వరలోనే బాధితులను వెంటబెట్టుకుని వెళ్లి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలిపిస్తాం. వందల కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కూటమి నాయకులు చేస్తున్న కుట్రే ఇది. దీన్ని న్యాయస్థానంలో బాధితుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాడి అడ్డుకుని తీరుతుందని హెచ్చరిస్తున్నాం. ● ఈ స్థలంపై ఎంపీ కేశినేని చిన్ని కన్నేశాడు - ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్ కూటమి ప్రభుత్వం రావడంతోనే వందల కోట్ల విలువైన ఈ స్థలంపై ఎంపీ కేశినేని చిన్ని కన్నుపడింది. దాన్ని కాజేసేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయడంలేదు. గత అక్టోబర్‌లోనే ఈ కూల్చివేతలకు పథక రచన చేస్తే మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ గారు, వైయస్ఆర్‌సీపీ నాయకులు అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అందుకే ఈసారి అందరూ నిద్రపోతున్న సందర్భంలో వేకువజామున వందల మంది పోలీసులతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారు. నారా లోకేష్ ని కలిసినా, జనసేన పార్టీ ఆఫీసులో చెప్పుకున్నా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఎంపీ, ఎమ్మెల్యేల ఆదేశాలతోనే కూల్చివేతలు జరిగినట్టు స్పష్టమైపోయింది. బాధితుల సమస్యను ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి వివరించడం జరిగింది. పార్టీ తరఫున బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు. ● భూకబ్జాదారులకు ప్రభుత్వం అండగా ఉంది - మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జోజి నగర్ ఇళ్ల కూల్చివేత ఘటనతో ఈ ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. ఇళ్లను నిర్మించడం చేతకాని ప్రభుత్వం రెక్కల కష్టం మీద నిర్మించుకున్న ఇళ్లను దుర్మార్గంగా కూల్చివేస్తోంది. సొంతంగా ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుని 20 ఏళ్లుగా నివసిస్తున్న వారిని ఒక్కసారిగా ఉన్నట్టుండి బయటకు వెళ్లమనడం దుర్మార్గం. ఇది బుల్డోజర్ ప్రభుత్వం. న్యాయపరమైన చిక్కులుంటే వాటిని ప్రభుత్వం పరిష్కరించాల్సిందిపోయి దుర్మార్గంగా 42 కుటుంబాలను రోడ్డున పడేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విలువైన భూములపై కన్నేసి దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భూకబ్జాదారులకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి జోజినగర్ ఘటనే నిదర్శనం. రెడ్ బుక్ రాజ్యాంగంతో బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణంపై ప్రభుత్వం కలగజేసుకోవాలి. కలెక్టర్, రెవెన్యూ శాఖ మంత్రి పేదల పక్షాన నిలబడి బాధితులను ఆదుకోవాలి. ● విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కోర్టు పరిధిలో ఉన్న స్థలం జోలికి ప్రభుత్వం వెళ్లడమే కాకుండా ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం. ఒక్కో కుటుంబం లక్షలు ఖర్చు చేసి ఇంటిని నిర్మించుకుంది. 20 ఏళ్లుగా ఈఎంఐలు కడుతున్నారు. చాలా ఇళ్లకు ఇప్పటికీ అప్పులు తీరలేదు. ఇలాంటి స్థితిలో ఒక్క గంటలో కూల్చివేసి 42 కుటుంబాలను రోడ్డున పడేశారు. వారంతా ఇప్పుడు ఎక్కడికి పోవాలి. న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే ఇంత నిర్దయగా వ్యవహరిస్తే సామాన్యులు బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఆఖరుకి సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఇళ్లను కూల్చివేశారంటే ఈ ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సీఎం చంద్రబాబు బాధితులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాలి. ఈ 42 కుటుంబాల ఉసురు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి తగులుతుందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి హెచ్చరించారు.