విజయవంతంగా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీలు

జూలై 8, 9 తేదీల్లో బ్రహ్మాండంగా రాష్ట్రస్థాయి వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ

టెలీ కాన్ఫరెన్స్‌లో వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

అమరావతి: కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను విస్మరించకుండా సీఎం జగన్‌ కొనసాగిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు, జిల్లాస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లు, నియోజకవర్గస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో చేశారని తెలిపారు.

అయినా దీన్ని మనం చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు నుంచే ప్రజల్లో సీఎం జగన్‌ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం రెట్టింపయ్యాయని తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పారు. మరోపక్క జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలకు అందరూ నూతనోత్సాహంతో సమాయత్తమవుతున్న వాతావరణం సర్వత్రా నెలకొని ఉందన్నారు.  

వచ్చే నెలలో రాష్ట్రస్థాయి ప్లీనరీ
జూలై 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రస్థాయి ప్లీనరీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, నామినేటెడ్‌ పదవులు పొందిన వారు, పార్టీ గ్రామ, మండల, నగర, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో పని చేస్తున్న నాయకులందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించాలన్నది సీఎం జగన్‌ ఆలోచన, ఆదేశం అని చెప్పారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న వివిధ కమిటీల నాయకుల పేర్లు, నామినేటెడ్‌ పదవులు పొందిన వారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాబితాలను స్థానిక బాధ్యులకు పంపించడం జరిగిందన్నారు. ఆ జాబితాను పరిశీలించి, ఎవరైనా మృతి చెందిన లేదా పార్టీ నుంచి సస్పెండ్‌ అయినా లేక పార్టీ మారినా వారి పేర్లు తొలగించి, మార్పులు చేర్పులతో కూడిన జాబితాను వెంటనే వాట్సాప్‌ నంబర్‌ (93929–18001)కు గాని, మెయిల్‌ ద్వారా కానీ పంపాలని ఆయన చెప్పారు.

ప్రతి ఊరిలో రెండు అన్న క్యాంటీన్లు పెట్టి చేసిన పాపాలకు చంద్రబాబు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. హుద్‌హుద్‌ తుపాను తర్వాత ఒడిశాకు 10 వేల కరెంటు స్తంభాలు, వెయ్యి ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు పంపిస్తున్నట్టు బాబు జాతీయ నాయకుడి రేంజిలో చెప్పుకున్నారన్నారు. అవి తమకు అందనే లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దొంగ బిల్లులు రాసి పంచుకున్న దాంట్లో గంజాయి పాత్రుడే కింగ్‌పిన్‌ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

Back to Top