అశ్వియ‌ కుటుంబ స‌భ్యుల‌కు పెద్దిరెడ్డి పరామ‌ర్శ‌

చిత్తూరు: పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అశ్వియ‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ ఇంత దారుణం జరగలేదన్న ఆయన, రెండో తరగతి చదువుతున్న చిన్న పాపను దారుణంగా హత్య చేయడం దారుణమని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అశ్వియ కుటుంబానికి అండగా ఉంటుందని, వైయస్‌ జగన్‌ ఈ నెల 9న పుంగనూరు వచ్చి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు చెప్పారు. చిన్నారి హత్య విషయంలో పోలీసులు మాత్రం కాలయాపన చేస్తున్నారన్న ఆయన, ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయ స్ధితిలో ఉండటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అదే మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌ అగ్నిప్రమాద ఘటనలో ఏం జరగకపోయినా స్వయానా డీజీపీని, సీఐడీ అడిషనల్‌ డీజీని, మరో అడిషనల్‌ డీజీని సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్‌ ఇచ్చిపంపారని, మరి ఇలాంటి విషయాల్లో ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు. చిన్నారి హత్య కేసులో దోషులను వెంటనే పట్టుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Back to Top