విశాఖపట్నం: ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు శవాలై తేలుతున్నాయన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన అసిఫియా అంజుమ్ అనే ఏడేళ్ల బాలిక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలేదాక పోలీసులు కనిపెట్టలేకపోయారని, ఫిర్యాదు అందినప్పుడే పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఈరోజు తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. అసిఫియా శరీరంపై గాయాలున్నాయని, పాపకు రక్తస్రావం జరిగిందని తల్లిదండ్రులు చెబుతుంటే, పోలీసులు మాత్రం ఏ దర్యాప్తు చేయకుండానే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. సీఎం సొంత జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగినా, మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల పాలిట చీకటి పాలన అన్న వరుదు కళ్యాణి, కూటమి నాలుగు నెలల పాలనంతా ఆడవారికి చీకటి రోజులేనని అభివర్ణించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే, క్షణాల్లో స్పందించిన సీఎం, ప్రత్యేక హెలికాప్టర్‌లో డీజీపీ, సీఐడీ చీఫ్, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీలను పంపించారని గుర్తు చేసిన ఎమ్మెల్సీ, ఆ మాత్రం తగలబడిన పేపర్లకున్న విలువ బాలిక ప్రాణాలకు లేదా అని నిలదీశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికను చంపేసి నదిలో పడేస్తే ఇంతవరకు పోలీసులు కనీసం మృతదేహాన్ని కూడా కనిపెట్ట లేకపోయారన్న ఆమె, ఇది ఆడవారిని అంతమొందించే ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలు, యువతుల రక్షణలో దిశ యాప్ ఒక కవచంలా పని చేసిందన్న వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, దిశ పోలీసులు కూడా అత్తుత్తమ సేవలందించారని చెప్పారు. హోం మంత్రి సొంత నియోజకవర్గంలో ఆమె అనుచరులు ఇద్దరు మహిళలను దారుణంగా హింసిస్తే, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టిన గొప్ప ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. యలమంచలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దర్శిని అనే మహిళను సురేష్ అనే యువకుడు చంపేసినా హోంమంత్రికి చీమకుట్టిన్నయినా లేదన్నారు. ఆ ప్రాంతానికి సన్మానానికి వెళ్లింది తప్ప, బాధితురాలి కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని తెలిపారు. గత వారం పుంగనూరులో బాలిక అదృశ్యమైనప్పుడు అక్కడే ఉన్న పవన్ కళ్యాన్.. ఆ ఘటనపై స్పందించి ఉంటే బాలిక ప్రాణాలు దక్కేవన్నారు. మంత్రి లోకేశ్ సొంత నియోజకవర్గంలో మూడు ఘటనలు, కోవెలకుంట్లలో మతి స్థిమితం లేని ఆడపిల్లపై అత్యాచారం, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటన.. ఇలా మహిళలపై రోజుకో దాడి జరుగుతూనే ఉంటే.. కాపాడమని చెప్పుకోవడానికి ఒక్క వ్యవస్థయినా రాష్ట్రంలో ఉందా అని ఎమ్మెల్సీ నిలదీశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకొంటున్నారు కానీ, ఆడపిల్లల ప్రాణాలకే గ్యారెంటీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కానేకాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందన్న వరుదు కళ్యాణి, ఈనెల 9న పుంగనూరులో బాధిత కుటుంబాన్ని వైయస్ జగన్‌గారు పరామర్శిస్తారని తెలిపారు.