మరోసారి మోసం చేసేందుకే ‘జయహో బీసీ’

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

బీసీలకిచ్చిన 110 హామీల్లో ఎన్ని అమలు చేశారు?

బీసీలకు ప్రతి ఏడాది రూ.10 వేల కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తామన్నారు

50 శాతం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేదు

ఏ హామీ అమలు చేయకుండా బీసీలందరిని మోసం చేశారు

హైదరాబాద్‌: 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని మరోమారు మోసం చేసేందుకు రాజమండ్రిలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి రాజమండ్రి సమావేశంలో ఐదేళ్ల వరకు వివిధ కులాలకు కార్పొరేషన్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఆ రోజు ఇచ్చిన 110 హామీల్లో ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలు చేయని చంద్రబాబు.. ఈ రోజు ముందుకు వచ్చి మరొక్కమారు దగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఆ రోజు ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఐదేళ్లలో బీసీలకు రూ.14 వేలు మాత్రమే కేటాయింపులు జరిపారని, అది కూడా పూర్తిగా ఖర్చు చేయలేదన్నారు. వెనుకబడిన కులాలకు ఇచ్చిన ప్రధాన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాజమండ్రిలో పెద్ద మీటింగ్‌ పెట్టి ఉద్దరిస్తామని మోసపూరిత ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయంలో ఇలాంటి హామీలు ఇవ్వడం దగా చేయడమే అవుతుందన్నారు. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న చంద్రబాబు ఎక్కడా అమలు చేయలేదన్నారు. కొనుగోలుపై సబ్సిడీలు ఇస్తామని మాట ఇచ్చారన్నారు. హ్యాండ్‌లూమ్‌ విక్రయాలపై 30 శాతం రాయితీలు ఇస్తామన్న చంద్రబాబు గాలికి వదిలారన్నారు.

ఇలాంటి సమయంలో చంద్రబాబును ఎలా నమ్మాలో చెప్పాలని నిలదీశారు. మరొక్కసారి వెనుకబడిన కులాను చంద్రబాబు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. వేలాది కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోసాలకు గురవుతున్న వెనుకబడిన కులాలను మరొక్కమారు మోసం చేసేందుకు చంద్రబాబు జయహో బీసీ మీటింగ్‌ పెట్టారని మండిపడ్డారు. అందరూ చంద్రబాబు మోసాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top