రైతులను ముంచేసిన కూటమి సర్కార్ 

ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
 

 విజయవాడ:  కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు.  న‌గ‌రంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో బుధవారం.. ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  జగ్గయ్యపేట ఇంఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయి. రైతుల కోసం బడ్జెట్‌లో ప్రస్తావించకుండా కూటమి సర్కార్‌ మోసం చేసింది. సూపర్ సిక్స్‌లో చెప్పిన పెట్టుబడి సాయం గురించి కూటమి నేతలు మాట్లాడటం లేదు.  కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కకుండా చేస్తున్నార‌ని అవినాష్‌ నిలదీశారు.

దయనీయ స్థితిలో రైతులు
తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు కనీసం గోనె సంచులు కూడా అందించడం లేదని మండిపడ్డారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ ఉన్న వాహనాలు ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్ పట్టాలిచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. రైతులు దయనీయమైన స్థితిలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది’’ అని మండిపడ్డారు.

రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు
విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కళ్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం రంగుమారిపోతున్నా కొనడం లేదు. రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతులను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని ఆమె ధ్వజమెత్తారు.

Back to Top