వైయస్‌ జగన్‌ది జన బలం..బాబుది ధన బలం 

వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి

చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు

సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు

ప్రతి నియోజకవర్గంలో 20 వేల ఓట్ల వరకు తొలగింపు

ఆర్టీజీఎస్‌ వ్యవస్థను టీడీపీకి లింక్‌ చేస్తున్నదెవరు?

ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి

ఈడీ, ఐటీ, సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు భయం

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌కు జన బలం ఉందని, చంద్రబాబుకు ధన బలం ఉందని అభివర్ణించారు. ప్రభుత్వానికి చెందిన ఆర్టీజీఎస్‌ వ్యవస్థను టీడీపీకి లింక్‌ చేసి టీడీపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబుకు వాస్తవాలను ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లో తన ఓటమిని ముందుగానే అంగీకరిస్తుంటారన్నారు. ఈవీఎంలపై ఇప్పటికే ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించారన్నారు. భారతీయ ఎన్నికల కమిషన్‌ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తామంటుంటే..పాత విధానం కావాలని, బ్యాలెట్‌ పత్రాలు కావాలని చంద్రబాబు డిమాండు చేస్తున్నారన్నారు.

రాబోయే ఓటమిని ఈవీఎంలపై నెట్టాలనే ప్రచారాన్ని ఇప్పటి నుంచే చంద్రబాబు ప్రారంభించారన్నారు. ప్రజలు తప్పు చేశారని, ఈవీఎంలపై నెపం నెట్టడం, ఎన్నికలు నిర్వహించే అధికారులు తప్పు చేశారని నెపం నెట్టడం ఇది కొత్త కాదని చెప్పారు. ఇవాళ సర్వే సంస్థ ఇచ్చిన ఫలితాలను ఆధారం చేసుకొని చంద్రబాబు ప్రకటనలు ఇచ్చారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ డబ్బున్న వారికే టికెట్లు ఇస్తుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇవాళ అధికారంలోకి ఉండేది ఎవరని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరుతో అవినీతికి పాల్పడి లక్షలాది రూపాయలు దోచుకున్నది ఎవరని నిలదీశారు. దాదాపు రూ.6 లక్షల కోట్ల ప్రజా«ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఒక్కశాతం నిధులు ఖర్చు చేసినా దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుందన్నారు. ధనబలమంటూ వైయస్‌ఆర్‌సీపీ పేరును చంద్రబాబు పొరపాటున అని ఉంటారన్నారు.

చంద్రబాబు వద్ద ధన బలం ఉంటే,,వైయస్‌ జగన్‌ వద్ద జనబలం ఉందన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ఆ జనబలం వెల్లడైందన్నారు. వైయస్‌ జగన్‌పై ప్రజలు విశ్వసనీయతను వ్యక్తం చేశారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో దాదాపు రూ.200 కోట్ల ధనాన్ని వెచ్చించి గెలిచారన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లెక్కల్లో తప్పులు ఉండవచ్చు కానీ, వాస్తవం వేరే ఉందని ప్రజలకు తెలుసు అన్నారు. ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి, ఓట్లు ఎలా తొలగించాలన్న విషయాల పట్ల చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ప్రత్యేకంగా ట్రైనింగ్‌ క్లాస్‌లు పెట్టిన విషయం అందరికి తెలుసు అన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా మారిపోయిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులు ఓటర్‌ జాబితాలోనే ఉండకూడదన్న దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారన్నారు. సర్వేల పేరుతో చేసే దగా ఇవాళే చూశామన్నారు. విజయనగరం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కొంత మంది కొన్ని సర్వే సంస్థలను లోబరుచుకొని లోకేష్‌ నేతృత్వంలో తెలుగు యువత నాయకులకు పనులు అప్పగించి, సర్వేల పేరుతో ట్యాబ్‌లు ఇచ్చి ఆయా ప్రాంతాల్లో ఓటర్‌ లీస్టులు దగ్గరపెట్టుకొని మీరు ఏ పార్టీకి చెందిన వారు. మీకు పథకాలు అందాయా లేదా? చంద్రబాబు అందంగా ఉన్నారా? వైయస్‌ జగన్‌ అందంగా ఉన్నారా అని ప్రశ్నలు వేస్తున్నారన్నారు.

పొరపాటున ఎవరైనా వైయస్‌ జగన అందంగా ఉన్నారంటే వారి ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారన్నారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సర్వే సంస్థలు చేసే కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. ట్యాబ్‌లకు, ఆర్టీజీఎస్‌తో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీజీఎస్‌ వ్యవస్థను టీడీపీ కార్యాలయానికి లింక్‌ చేసింది ఎవరని నిలదీశారు. సర్వేల ద్వారా ట్యాబ్‌ల్లో గుర్తించిన ఓటర్లను తెలగిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని టీడీపీ నిర్వీర్యం చేస్తోందన్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండు చేశారు. వ్యవస్థలో లోపాలను బయటపడకుండా కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగాలని కోరారు.

విజయనగరం జిల్లా జామీ పోలీసులు వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో అరెస్టు చేశారో చెప్పాలని పట్టుబట్టారు. ఏ సెక్షన్‌ కింద అరెస్టు చేశారో అది కూడా చెప్పడం లేదన్నారు. ఇటీవల జన్మభూమి సభలో వెంకటగిరి ప్రాంతంలో ఓ రైతు మా ప్రాంతానికి సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు సాగు చేయడం లేదని అధికారులను నిలదీస్తే ఆ వ్యక్తిని అరెస్టు చేశారన్నారు. సాయంత్రం విడుదల చేసి..మళ్లీ రాత్రి అరెస్టు చేశారన్నారు. ఎందుకు అరెస్టు చేశారని అడిగితే ఆర్టీజీఎస్‌ నుంచి సమాచారం మేరకు ఎస్పీ ఆదేశాలతో అరెస్టు చేశామని చెప్పారన్నారు. ఆర్టీజీఎస్‌ వ్యవస్థతో టీడీపీకి లింక్‌ చేశారన్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ఇప్పటికే నియోజకవర్గాల్లో ధనాన్ని స్టోర్‌ చేశారని పేర్కొన్నారు.

ఇవాళ ఐటీ అధికారులను చూస్తే చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. పన్ను ఎగవేతదారులు వెళ్తే చంద్రబాబుకు ఎందుకు భయమని నిలదీశారు. సీబీఐ, ఈడీ అంటే చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను వైయస్‌ఆర్‌సీపీ నుంచి చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు. ముగ్గురు ఎంపీలను అనైతికంగా టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబుపరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే..రేపు జరిగే ఎన్నికల్లో నా పరిపాలన మీద రెఫరెండం తీసుకుంటామని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అని సవాలు చేశారు. ఇలాంటి సవాలు చేసిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే అన్నారు. అలాంటి సవాలును చంద్రబాబు స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు. 
 

Back to Top