విశాఖలో అధికార పార్టీ భూ దోపిడీ

రూ.10 వేల కోట్ల భూమి దోపిడీ చేసిన గీతం సంస్థ 

కుటుంబ సభ్యులకు, అనుచరులకు కట్టబెడుతున్న చంద్రబాబు 

54.79 ఎకరాలను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు సిద్ధం

ప్రజల ఆస్తులు గీతం యూనివర్సిటీకి ఎలా ఇస్తారు?

ప్రభుత్వాన్ని నిలదీసిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

విశాఖ భూదోపిడీపై పెద్ద ఎత్తున పోరాటం

కౌన్సిల్ లో గీతం భూముల క్రమబద్ధీకరణను అడ్డుకుంటాం

30వ తేదీన గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపడతాం

రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలసి పోరాటం

స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ

గీతం భూదోపిడీపై కూటమి భాగస్వామ్య పార్టీలు స్పందించాలి

విశాఖ భూదోపిడీ పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా?

ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందా?

కూటమి పార్టీలను నిలదీసిన బొత్స సత్యనారాయణ

లోకేష్ తోడల్లుడికి విశాఖలో  భూసంతర్పణ

రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమని కబ్జా చేసిన గీతం సంస్థ

గతంలోనూ గీతంకు 72 ఎకరాల భూమి క్రమబద్దీకరణ 

గీతం కబ్జా విలువ సుమారు రూ.10 వేల కోట్లు

విశాఖలో అధికార పార్టీ దోపిడీకి ఇదే నిదర్శనం

భూముల పరిరక్షణకై  ఢిల్లీ వరకు పోరాటం 

తేల్చి చెప్పిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్

గీతంకు భూ కేటాయింపు పై సీబీఐ విచారణ జరిపించాలి.

ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కేసు నమోదు చేయాలి

జీవీఎంసీలో గీతం సంస్ధలకు ప్రభుత్వ భూమి క్రమభద్దీకరణను వ్యతిరేకిస్తాం

కూటమి పాలనలో విశాఖలోనే  రూ. 25- రూ30 వేల కోట్ల భూదోపిడీ

దీనిపై ప్రజలు, ప్రజా సంఘాలతో కలసి పోరాటం

స్పష్టం చేసిన గుడివాడ అమర్నాధ్

గీతం యూనివర్సిటీ రూ. 5 వేల కోట్లు భూదోపిడీ 

లోకేష్ సలహాతో జీవీఎంసీ కౌన్సిల్ లో ఆమోదానికి సిద్ధం 

ప్రజల ఆస్తిని ఎంపీ కుటుంబానికి ఏ విధంగా ఇస్తారు?

ఆగ్రహం వ్యక్తం చేసిన కేకే రాజు

విశాఖపట్నంలో హోటల్ మేఘాలయలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు.

పత్రికా సమావేశంలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి  గుడివాడ అమర్నాధ్, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కే కే రాజు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్, తైనాల విజయ్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు.

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూదోపిడీకి పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వ భూదోపిడీపై ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.  గీతం భూదోపిడీపై కూటమి భాగస్వామ్య పార్టీలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ అవినీతిలో మీక్కూడా భాగస్వామ్యం ఉందా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. మరోవైపు లోకేష్ తోడల్లుడికి విశాఖలో  55ఎకరాల భూసంతర్పణ చేయడం.. అధికార పార్టీ దోపిడీకి నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తేల్చి చెప్పారు. ఎంపీ భరత్ భూకబ్జాపై ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గీతం భూ కబ్జా, ప్రభుత్వ అడ్డగోలు కేటాయింపులపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు, ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్ చేశారు.  
ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఇంకా ఏమన్నారంటే... 

● కే కే రాజు, వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సలహాలు, సూచనలతో ఆయన తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ కి చెందిన గీతం యూనివర్సిటీకి రూ.5వేల కోట్ల విలువైన భూములను బదలాయింపు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న జరగబోయే గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ సమావేశంలో అజెండా అంశంగా భూముల అప్పగింత అంశాన్ని అజెండాగా చేర్చారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయిల విలువైన భూమిని అప్పనంగా అధికార పార్టీ నేతలకు దోచిపెడుతున్న వైనంపై ఉత్తరాంధ్రా వాసులుతో పాటు రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారన్ని ప్రజాప్రయోజనాలకోసం కాకుండా కుటుంబసభ్యులకు దోచిపెట్టడానికి తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నమ్మి అధికారమిచ్చిన ప్రజల నమ్మకాలను వమ్ము చేసిన కూటమి ప్రభుత్వం విశాఖలో వేలాది కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ భూములను రూపాయి, రూ.99 పైసలకే అడ్డగోలుగా పప్పుబెల్లాల్లా పంచిపెడుతోంది.  దాన్ని అడ్డుకోవాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు... ఆ పనిచేయకపోగా తామే స్వయంగా అదే తరహా దోపిడీకి పాల్పడ్డం అన్యాయం. ఈ నేపధ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించిన వైయ‌స్ఆర్‌సీపీ.. కౌన్సిల్ లో ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా  తీర్మానం చేయనున్నాం. అదే విధంగా కౌన్సిల్ బయట కూడా ఇతర రాజకీయ పక్షాలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించాం.

● గుడివాడ అమర్నాధ్, వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు

స్థానిక ప్రజాప్రతినిధి, విశాఖ పార్లమెంటు సభ్యుడికి చెందిన గీతం సంస్థ ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని వారి పేరు మీద రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 30 న జరిగే విశాఖ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా పెట్టి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించి తద్వారా ఆ భూములను రెగ్యులరైజ్ చేయాలన్న కుట్ర జరుగుతుంది. దాన్ని వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 54 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలే తప్ప ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరికిస్తున్నాం. గతంలో ఇప్పటికే 72 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్న గీతం సంస్థ.. ఇప్పుడు మరో 54 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం దుర్మార్గం. స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి... 54 ఎకరాల ప్రభుత్వ భూమి మా ఆధీనంలో ఉంది.. దాన్ని రెగ్యులరైజ్ చేస్తే తప్పేంటని మాట్లాడ్డం అత్యంత విచారకరం. ఎంపీ భరత్ కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రూ.5 వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించే భారీ స్కామ్ ఇది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో వారి అనుయాయులకు అప్పనంగా కేటాయించిన భూమి విలువ దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల కోట్లు ఉంటుందని అంచనా . వీటన్నినంటినీ కేవలం ఎకరా రూ.1 నుంచి రూ.1లక్ష వరకు అప్పనంగా కేటాయిస్తూ.. ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వం కంచె చేను మేసిందన్న తరహాలో వ్యవహరించింది. బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. పక్కనే ఉన్న రుషికొండలో పాత టూరిజం భవనాలు  తొలగించి వాటి స్ధానంలో నూతనంగా ప్రభుత్వ భవనాలు కడితే గగ్గోలు పెట్టిన కూటమి పార్టీలు.. ఆ భవనాలకు ఎదురుగానే రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసే కార్యక్రమం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? స్ధానికి టీడీపీ ఎంపీ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జీవీఎంసీ కౌన్సిల్ లో ఈ భూముల రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తాం. 

● కురసాల కన్నబాబు, మాజీ మంత్రి.

- రూ.10 వేల కోట్ల భూమి దోపిడీ చేసిన గీతం సంస్థ..

శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ విశాఖలో జరుగుతున్న భూదోపిడీపై ఒక సమావేశం నిర్వహించారు. విశాఖ ఎంపీ, సీఎం చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ తోడల్లుడు, ఎంపీ భరత్ కి చెందిన గీతం సంస్థకు 54 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టడాని కౌన్సిల్ లో తీర్మానం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ 54 ఎకరాల భూమి విలువ రూ.5వేల కోట్లు. కానీ గీతం సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు కుటుంబం ఇప్పటివరకు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి విలువ  రూ.10 వేల కోట్లు పైనా ఉంటుందనేది మా అంచనా. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  ఎకరా రూ.18వేలు చొప్పున 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆ రోజు కలెక్టర్లు దానికి అంగీకరించకపోతే వారిని బదిలీ చేసి మరీ తమ పని కానిచ్చుకున్నారు. గీతం సంస్థ ఇప్పటివరకూ దాదాపు 130-150 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఇంకా ఎంత ఉందో సర్వే చేస్తే తప్ప తెలియదు. దీని విలువ రూ.10 వేల కోట్లు ఉంటుంది. చేసేవన్నీ కబ్జాలు బయటకు వచ్చి ప్రజలకు మాత్రం చంద్రబాబు ప్రవచనాలు చెబుతారు. ఆవన్నీ వెంటే చంద్రబాబు రాష్ట్రానికి  అతిపెద్ద కస్టోడియన్ అనుకుంటారు, కానీ ప్రభుత్వ భూములను కొట్టేసేది ఆ కుటుంబమే. విశాఖలో ఒక్క గీతం విద్యాసంస్థ పేరిట రూ.10 వేలు కోట్ల భూమిని కొట్టేస్తే అడిగే నాధుడు లేడన్నది వారి ఉద్దేశం. ఈ నేపధ్యంలో గీతం సంస్థకు 54 ఎకరాల ప్రభుత్వభూమిని రెగ్యులరైజ్ చేయాలని విశాఖ మున్సిపల్ కౌన్సిల్  అజెండాలో పెట్టడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో పాటు ఈ నెల 30 వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ కార్యాలయం ముందు భారీగా నిరసన దీక్షకు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునిచ్చింది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కారుచౌకగా భూములు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని వైయ‌స్ఆర్‌సీపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. 
ఇటీవల విశాఖపట్నంలో  రోడ్డు పక్కన చిన్న, చిన్న షాపులు పెట్టుకునే స్ట్రీట్ వెండర్స్  దుకాణాలను ఆక్రమణల పేరుతో తొలగించిన ప్రభుత్వం... అధికారంలో ఉన్నవాళ్లు యధేచ్చగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేయడం బాధాకరం. పైగా 2005 నుంచి ఈ ప్రభుత్వ భూమి మా ఆధీనంలో ఉందని చెబుతున్న ఎంపీ భరత్ మాటలు తీవ్ర అభ్యంతరకరం. అప్పటి నుంచి ప్రభుత్వ భూమి ఆక్రమించినందుకు వీరిపైనా, అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. గీతం ఆక్రమణలో ఉంటే ఆ భూమి గీతం సంస్థలకు చెందుతుందా? 

తాను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు భూముల దోపిడీకే ప్రధమ ప్రాధాన్యతనివ్వడం పరిపాటి. ఉర్సా అనే సంస్థకి కేవలం ఒక అపార్ట్ మెంట్ లో కార్యాలయం ఉంటుంది. ఆ సంస్థ కరెంటు బిల్లు మన ఇంటికి వచ్చేంత కూడా లేదు,  అలాంటి సంస్థకు ఎకరా 99 పైసలు చొప్పున 60 ఎకరాలు కట్టబెట్టారు. లులూ లాంటిసంస్ధలు ఇతర రాష్ట్రాల్లో వందల కోట్లతో భూములు కొంటే.. మన రాష్ట్రంలో మాత్రం ఉచితంగా కట్టబెట్టాడు. పైగా ఇదేంటని పాత్రికేయులు మంత్రి లోకేష్ ని ప్రశ్నిస్తే...  99 పైసలకు కాదు మొత్తం ఇచ్చేస్తానని చెబుతున్నాడు. ఇది మీ కుటుంబ ఆస్తా? మీరు కేవలం ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్ లు మాత్రమే అన్న విషయం గుర్తుంచుకొండి. కబ్జాలు, దగుల్భాజీ పనులన్నీ వీళ్లే చేసి అవి ఇతరులకి అంటగడ్డడం వీరికి అలవాటుగా మారింది. వీరి కబ్జాలను నిరసిస్తూ.. తొలుత జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 54 ఎకరాల రెగ్యులరైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ తీర్మానం చేయడంతో పాటు గీతం సంస్థ చైర్మన్ ఉన్న విశాఖ పార్లమెంటు సభ్యుడి వైఖరిపై నిరసనగా పార్లమెంటు వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ భూములు పరిరక్షణ కోసం ఢిల్లీ స్థాయి వరకు వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమాన్ని చేపడుతుంది. ఇలాగే ఉపేక్షిస్తే చంద్రబాబు తన కుటుంబానికి, అనుయాయులకు మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేస్తాడు. 
ఈ భూ కబ్జాపై ఎంపీ భరత్ సరికొత్త వాదనను తీసుకొచ్చాడు. అమరావతిలో ఎస్ ఆర్ఎం వంటి విద్యాసంస్థలకు భూములివ్వలేదా అని అడుగుతున్నాడు. ఆయా సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తే.. మీ గీతం సంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది. రెండింటికీ చాలా స్పష్టమైన తేడా ఉంది. 
మీ ఆధీనంలో ఉంటే మీకు రెగ్యులరైజ్ చేయాలా? మీ కోసం కొత్త చట్టం ఉంటుందా? ఇప్పటికైనా మీరు హుందాగా మీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని వెనక్కి తిరిగి ఇవ్వాలి. లేని పక్షంలో విశాఖతో పాటు ఉత్తరాంధ్రాలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన కార్యక్రమం ఉద్యమరూపంలో తీసుకువస్తుంది. 

● బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత.

విశాఖపట్నంలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు, అనుయాయులు ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రజలు అధికారం ఇచ్చారని భరితెగించి.. ఏం చేసినా చెల్లుతుందని సుమారు 54.79 ఎకరాల భూమిని విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి.. జీవీఎంసీ కౌన్సిల్ లో  రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, భూదోపిడీపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఇదేనా పరిపాలనా విధానం? రూ.5వేల కోట్ల భూములు రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. పేదవాడు ఓ సెంటు ప్రభుత్వ స్థలంలో చిన్న ఇళ్లు కట్టుకున్నా.. ఇంటి పక్కన ఖాలీ స్థలం వాడుకుంటే ఇలా చేయడానికి వీల్లేదని గగ్గోలు పెడతాం. అలాంటికి ఏకంగా 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే దాన్ని ఎలా రెగ్యులరైజ్ చేస్తారు? అందుకే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ప్రజలతో కలిసి ఉద్యమించాలని వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయించింది. ముందుగా కౌన్సిల్ లో ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించాం. 54 ఎకరాలను రెగ్యులరైజ్ చేసే తీర్మానమే కౌన్సిల్ లో పెట్టడానికి వీల్లేదని, దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ  రేపు జీవీఎంసీ కమిషనర్ ని కలిసి విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రభుత్వం తానేం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలో ఉంది, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 
ఆనంతరం 29 వ తేదీన గీతం విద్యాసంస్థలు కబ్జా చేసి, తన ఆధీనంలో ఉంచుకున్న 54 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి వెళ్లి పరిశీలిస్తాం. ఆ తర్వాత 30 వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశానికి హాజరై... 54 ఎకరాల రెగ్యులరైజ్ చేసే అంశాన్ని వ్యతిరేకిస్తూ.. దాన్ని విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తాం. అదే రోజు... చంద్రబాబు కుటుంబం చేస్తున్న భూదోపిడీని  విశాఖ ప్రజలతో కలిసి  పూజ్య బాపూజీ విగ్రహం వద్ద  దీక్ష చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. రెండో దశ పోరాటంలో భాగంగా ఈ అంశంపై మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ తో మా పార్టీ కార్పొరేటర్లతో పాటు పార్టీ నేతలు అందరం కూర్చుని చర్చిస్తాం. 

ఇది చాలా అన్యాయమైన దోపిడీ. ఆ రోజు రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే నానా యాగీ చేశారు. వైయస్.జగన్ భవనాలంటూ నోటికొచ్చినట్లు అబద్దాలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నోవాటెల్ కు అప్పగించడానికి ప్రయత్నాలు చేశారు. స్థానికంగా వ్యతిరేకత రావడంతో ఆగిపోయారు.. లేదంటే అది కూడా కబ్జా చేసేవాళ్లు. ఇవాళ గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అరాచకానికి పరాకాష్ట. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ తోడల్లుడు తన ఆధీనంలో ఉన్న 54 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయమనడం అత్యంత దారుణం. కూటిమి ప్రభుత్వంలో భాగ స్వామ్యులగా ఉన్న భారతీయ జనతాపార్టీ నేతలు ఈ కబ్జాను సమర్ధిస్తున్నారా? ఈ అవినీతిలో మీరు భాగస్వామ్యులా? మీ విధానం ఏంటి? కచ్చితంగా విరవనివ్వాలి. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం అప్పనంగా దోచుకుంటుంటే దీన్ని మీరు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? దీనికి మీరు కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఇది రాజకీయ సమస్య కాదు. ప్రజల ఆస్తికి సంబంధించిన అంశం. బాధ్యత గల పౌరుడిగా, రాజకీయ పార్టీగా మీ పార్టీ వివరణ అవసరం ఉంది. 
ఉద్యోగాలు తీసుకొస్తాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తామని పెద్ద మాటలు చెబుతారు. గీతం కాలేజీలో ఒక ఇంజనీరింగ్ సీటుకానీ, మెడికల్ సీటు కానీ, ఎంబీయే సీటు కానీ ఉచితంగా ఇస్తారా? ఆంధ్రా యూనివర్సిటీ సమావేశంలో మా సంస్ధలో డబ్బులుంటేనే సీటు, ఆంధ్రా యూనివర్సిటీలో పేదవాడు కూడా చదువుకోగలడని మీరే చెప్పారు. మీరు డబ్బులిచ్చి ప్రభుత్వ భూమి కొనలేరా? దీనిపై కూటమి భాగస్వామి పార్టీలు సమాధానం చెప్పి తీరాలి. మీ సమాధానం మీద ఆధారపడే పార్టీ భవిష్యత్ కార్యాచరణ పోరాటం ఆధారపడి ఉంటుంది. మీరు ఉదయం లేస్తే చెప్పే ప్రవచనాలకి, మీ చేతలకీ సంబంధం లేదు. ఇదేరకమైన దోపిడీ? ఇందుకేనా మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు? ఇంత మోసమా ? ప్రజలందరూ ఈ విషయాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దోపిడీపై ఆలోచన చేయాలి. 
దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను అందరినీ కలిసి వారితో సంప్రదించి మాతో కలిసి వచ్చే వారితో కార్యాచరణ రూపొందించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు కుటుంబం చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజల ముందు ఉంచుంతాం. అదే విధంగా వ్యవస్థ, ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలని మీడియా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.  ప్రభుత్వాలు గతంలోనే గీతం సంస్థకు భూమి కేటాయించింది. ఇంకా ఈ రకమైన దోపిడీ చేయడమేంటి? 

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...

విద్యాసంస్థలకు ప్రభుత్వం భూమి కేటాయించడం పరిపాటి, కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. ఆ తర్వాత మాకు రెగ్యులరైజ్ చేయమనడం ఏ రకంగా సమర్థనీయం.  స్ధానిక సంస్ధల నుంచి ఎన్నికై, శాసనమండలి విపక్ష నేతగా ఉన్న తనకు కౌన్సిల్ సమావేశాలకు ఆహ్వానం లేకపోవడం దారుణం. అధికార పార్టీ చట్టాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గం. 

అధికార పార్టీ ఎంపీ అవినీతి బాగోతాన్ని ప్రజల మధ్యన ఉంచుతాం. దానిపై ప్రజా పోరాటాన్ని నిర్మించి.. వీరి అవినీతి బాగోతాన్ని ప్రజల మందు బట్టలిప్పి నిలబెడతామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Back to Top