కదిరి: కదిరి ప్రభుత్వాసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ గూండాలను తక్షణం అరెస్ట్ చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌సీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బిఎస్ మక్బూల్ అహ్మద్ డిమాండ్ చేశారు. కదిరి ప్రభుత్వాసుపత్రిని సందర్శించి, దాడికి గురైన వైద్యులు, సిబ్బందిని ఆయన పరామర్శించారు. కొందరిని ఫోన్‌లో పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే... శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటగుళ్ల బెల్ట్‌షాప్ వద్ద టీడీపీకి చెందిన గుండాలు గలాటా సృష్టించి కొందరిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ ఉంటే, టీడీపీకి చెందిన వారు మద్యం సేవించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వీరంగం సృష్టించారు. తమ చేతుల్లో గాయపడిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై కూడా ఇష్టం వచ్చినట్ల దాడికి దిగి, భీభత్సం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసిన దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయి. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వ భ్రష్టు పట్టిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.