నెల్లూరు: మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు రాష్ట్రం లోని మహిళలు సిద్దంగా ఉన్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితలు స్పష్టం చేశారు. నెల్లూరులో కాకాణి పూజిత ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం జోనల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వరుదు కళ్యాణి, కాకాణి పూజితలు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. నిజమైన మహిళా సాధికారతను వైయస్ జగన్ ప్రభుత్వంలోనే మహిళలు చూశారని అన్నారు. ఇంకా వారేమన్నారంటే... మహిళలను దగా చేసిన ప్రభుత్వమిది : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 16 నెలలుగా మద్యాన్ని ఏరులై పారిస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారి, మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. నాడు మహిళలకు రక్షణగా నిలబడిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా అని ప్రతి మహిళలోనూ పశ్చాత్తాపం కనిపిస్తోంది. ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ కూడా ఒక్క పథకాన్ని అమలు చేసిన పాపానపోవడం లేదు. ఫ్రీ బస్, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలన్నీ బోగస్. తూతూమంత్రంగా అమలు చేసేసి అన్నీ ఇచ్చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. లిక్కర్ ఆదాయం ఎలా పెంచుకోవాలన్న ఆలోచన తప్ప మహిళల భద్రత గురించి ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి వాడకం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు అండగా నిలబడాలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మహిళలకు జరుగుతున్న మోసాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు గడిచిన ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో వైయస్ జగన్ మహిళలకు ఏవిధంగా అండగా నిలబడ్డారో ఇంటింటికీ వివరిస్తాం. దోచుకునే పనిలో మహిళా మంత్రులు బిజీ: రాష్ట్రంలో ఒక్క మహిళకైనా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నారు. 11 రకాల బస్సుల్లో మహిళలు టికెట్ చెల్లించ్సాల్సిందే. ఆడ బిడ్డ నిధి పథకం ఊసే ఎత్తడం లేదు. ఏ ఒక్క యువతికి ఉద్యోగం ఇచ్చింది లేదు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పుకుంటూనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, మంత్రి నారా లోకేష్‌లు మాత్రం స్పెషల్ ఫ్లైట్‌లు, హెలిక్యాప్టర్ లలో విహరిస్తున్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. నీటి అలల్లో తేలే రాజధానిని నిర్మిస్తూ కలల రాజధాని అని చెప్పుకు తిరుగుతున్నారు. వారానికి వారం అప్పులు తెస్తూ సంపద సృష్టిస్తున్నామని ఘోరంగా అబద్ధాలు చెబుతున్నారు. ఇది ఆడబిడ్డలను వేధిస్తున్న టీడీపీ కాలకేయుల ప్రభుత్వం అని ఏ మహిళని అడిగినా చెబుతుంది. సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్పలేని భాషలో తిడితేనే అతడి మీద చర్యలు తీసుకోలేదు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకుల మీద రాయలేని భాషలో, మార్ఫింగ్ ఫొటోలతో ట్రోలింగ్ చేస్తున్నారు. ఐటీడీపీ సైకోల కారణంగా గతంలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. రూ. 5 కోట్లు ఖర్చు చేసి తన తల్లిని టీడీపీ వారితో తిట్టించారని గతంలో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పాడు. మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి నాయకులు దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నారు. ముగ్గురు మహిళా మంత్రులుండి కూడా మహిళలకు మేలు జరగడం లేదు. రౌడీలకు పెరోల్ ఇప్పించి సొమ్ము చేసుకోవడంలో ఒక మంత్రి, కుట్టు మిషన్ పేరుతో దోచుకోవడంలో మరో మహిళా మంత్రి, వరలక్ష్మీ వ్రతం పేరుతో కానుకలు కొల్లగొట్టేయడంలో ఇంకో మహిళా మంత్రి బిజీగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూటమి (కే ట్యాక్స్) ట్యాక్స్ వసూలు చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తన వారికి కట్టబట్టేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలి: మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తామని హెచ్చరించే పవన్ కళ్యాణ్.. సుగాలి ప్రీతి కేసును రాజకీయాలకు వాడుకున్నాడు. ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం జరిగింది అంటే నాటి సీఎం వైయస్ జగన్ వల్లనే. ఆ కుటుంబానికి రూ. 8.25 లక్షల పరిహారం, ఇంటి స్థలం, బాధితురాలి తండ్రికి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకున్న ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించి న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాన్.. 16 నెలలుగా సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించలేదు. కనీసం సుగాలి ప్రీతి తల్లి పార్వతికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు. పవన్‌కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాలి. ఆగస్టు 2017లో చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ ఘటన జరిగితే సాక్ష్యాలను తారుమారు చేశారని వైయస్ఆర్‌సీపీ మీదకి నెపాన్ని నెట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఘటన జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన్ని నిందించకుండా అండగా నిలవడం దేనికి సంకేతమని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు : వైయస్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మహిళల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా ఎన్నికల్లో కూటమి నాయకులు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోవడం లేదు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ కరువైంది. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడినా తమకు ఏమీ కాదనే భరోసా నేరస్తులకు ఉంటోంది. పేరుకి మాత్రం ఆడవారి మీద చెయ్యేస్తే అదే ఆఖరి రోజు అవుతుందని మైకుల ముందు గొప్పగా ఊదరగొడుతున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే అండగా ఉండి ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాన్ పత్తా లేకుండా పోయాడు. ప్రశ్నించిన వారి మీద కక్షకట్టి అక్రమ కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. చంద్రబాబు ఈ ఏడాది పాలనలో వేధింపులకు ఏ కుటుంబం కూడా మినహాయింపు కాదు. వైయస్ జగన్‌ని సీఎం చేసేదాకా మహిళలమంతా ఈ ప్రభుత్వంపై పోరాడతామని కాకాణి పూజిత స్పష్టం చేశారు.