ఎంపీ మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారు

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి

తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి మాన‌సికంగా ధైర్యంగా ఉన్నార‌ని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కలిశారు. అనంతరం, భూమన మీడియాతో మాట్లాడుతూ.. `ఏపీ పోలీసులు 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు  కాపాడాలనే లక్ష్యాన్ని మరిచిపోయారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లేని లిక్కర్‌ స్కాంను సృష్టించి.. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న ఏదో ఒక నెపంతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను కేసులతో వేధిస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైయ‌స్‌ జగన్ నైతికతను దెబ్బతీయ వచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైయ‌స్ఆర్‌సీపీ నేతలను, అధికారులను అరెస్టు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రశ్నించడంలో ఏమాత్రం వెనకడుగు వేయం. మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలందరినీ జైల్లో పెట్టినా ఏమాత్రం భయపడేది లేదు. ఎన్ని రోజులు జైల్లో పెట్టిన మా మనో నిబ్బరాన్ని దెబ్బ తీయలేరు’ అని అన్నారు.

మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జైలు పాలు చేస్తోంది. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు పంపించింది. మిథున్ రెడ్డి కూడా ధైర్యంగా ఉన్నారు. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు’ అని తెలిపారు. 

Back to Top