పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ హైకోర్టు ఆదేశాలపై అత్యున్న‌త న్యాయ‌స్థానం స్టే  

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ కి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం స్టే విధించింది. ఇవాళ సుప్రీంకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కేసు విచారణ జ‌రిగింది. త‌న సొంత నియోజకవర్గం తాడిప‌త్రిలోకి  అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం  అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పెద్దారెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాదులు  సిద్ధార్థ దవే , పి .సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేష్  సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు అని సుప్రీంకోర్టు  ప్రశ్నించింది, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలంటూ స‌ల‌హా ఇచ్చింది. తాడిపత్రికి వెళ్ళేందుకు పెద్దారెడ్డికి పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ సంద‌ర్భంగా ఆదేశాలు జారీ చేసింది. పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీక‌రించారు. సుప్రీం కోర్టు తీర్పు ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Back to Top