నెల్లూరు: టీడీపీ బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా కావలి వెళ్తున్న కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై ఈ ఇద్దరూ తీవ్రంగా స్పందించారు. కావలిలో అడుగుపెట్టి తీరతాం: కాకాణి `రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కావలి బయల్దేరాం. కానీ, కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాం.. తలలు తీస్తాం అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ, టీడీపీ బుడ్డ బెదిరింపులకి భయపడేది లేదు. అక్రమాలపై పోరాడతాం. పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతను గాలికి వదిలేశారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ ప్రధాన ఎజెండాగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపోమాపో కావలిలో అడుగుపెట్టి తీరతాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అరాచకాలు అక్రమాలను బయటపెడతాం` అని కాకాణి అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది: ఎమ్మెల్సీ చంద్రశేఖర్ `నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది. మాపైనే దాడి చేసి.. తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టుతో ఈ పరంపర మొదలైంది. ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించారు. ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్తే.. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కావలి టోల్ ప్లాజా దాటితే తలలు నరుకుతామని టీడీపీ బెదిరిస్తోంది. ఇప్పుడు పోలీస్ శాఖ అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయిస్తోంది` అని చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు.