అమరావతి:చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చే ఐదేళ్లకు కూడా పోలవరం పూర్తి కాదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి సవాలు విసిరారు. పోలవరంలో ఏ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు. పోలవరానికి అన్నీ అనుమతులు తెచ్చింది వైయస్‌ఆరే అని స్పష్టం చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరైనా టీడీపీ నేతలు ఉద్యమిస్తే చంద్రబాబే వారిని వద్దని హెచ్చరించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరాన్ని మొదలుపెట్టారన్నారు. అన్ని అనుమతులు వైయస్‌ఆర్ తీసుకువచ్చారన్నారు. 70 శాతం పనులు వైయస్‌ఆర్ హయాంలోనే కుడికాల్వ పనులు పూర్తి అయ్యాయన్నారు. 2014 నుంచి 2019 మధ్యనే పోలవరం సాకారం అని టీడీపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. 2004లో చంద్రబాబు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారన్నారు. స్పీల్‌వే అన్నది ప్రధానమైన విభాగం అ న్నారు. 2018 డిసెంబర్ ఆఖరివారంలో ఒక గేట్ గాలిలో పెట్టి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారన్నారు. ఒక్క గేటు మాత్రమే ఏర్పాటు చేశారని, మిగిలిన 47 గేట్లు ఎక్కడా పెట్టలేదన్నారు. కాంక్రీట్ లెవల్ చేయలేదన్నారు. ఐకానిక్ బ్రిడ్జి పనులు మొదలు కాలేదన్నారు. కొండను తొలగించాల్సి ఉందన్నారు. 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు అలాగు ఉన్నాయి. 55 వేల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీలో రాసుకో జగన్..2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చాలెంజ్ చేశారని గుర్తు చేశారు. 2018 నాటికి గ్రావిటీతో నీరివ్వకపోతే నేను ఓట్లు అడగనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా రూ.280 కోట్లతో కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారని విమర్శించారు. స్పీల్ చానల్ పనులు పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేస్తే గోదావరికి వరద వచ్చినప్పుడు ఎవరు బాధ్యులని కేంద్ర జలవనరుల శాఖ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. ఎడమ కాల్వకు ఈ ప్రభుత్వం నీరివడం అసంభవమన్నారు. కుడికాల్వ పనులు వైయస్‌ఆర్ 75 శాతం పూర్తి చేస్తే మిగతా 25 శాతం పనులు పూర్తి చేయలేదన్నారు. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులు జరగడం లేదని తెలిపారు. గ్రావిటేషన్‌పై వచ్చే నీళ్లతో మేం ఇచ్చామని వంచన చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టిందని ధ్వజమెత్తారు. అది కూడా అసంభవమని, 40.18 మీటర్లకు వరద వస్తే రెగ్యులేటర్ లేకపోతే కుడికాల్వ మొత్తం గండిపడుతుందన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.