తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల మాదిరిగా రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో స్వీప్ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టారని, అదే ఒరవడి మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతోందన్నారు. మెజారిటీ ఏకగ్రీవాలు వైయస్ఆర్‌సీపీ సొంతం చేసుకుందని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఇల్లు ఎక్కి అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవన్నారు. మున్సిపోల్స్ లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై మరోసారి ప్రజలు విశ్వాసం చూపారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ ఏకగ్రీవాలు వైయస్ఆర్ సీపీ సొంతం చేసుకుందన్నారు. - ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైయస్ఆర్ సీపీదే విజయం అని నిరూపణ అయ్యిందని స్పష్టం చేశారు. మొన్నటివరకూ ఎస్ఈసీని కీర్తించిందీ టీడీపీ వారేనని రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఈరోజు వాళ్లే విమర్శిస్తున్నారని తెలిపారు. ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చూస్తే చివరికి ఏమైందని ప్రశ్నించారు. నామినేషన్లకు ఎస్ఈసీ మరో అవకాశం ఇచ్చినా.. టీడీపీపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చెప్పారు. నామినేషన్లు వేయడానికే టీడీపీకి మనుషులు దొరకటం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో శిబిరాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో హామీలు నెరవేర్చావా బాబూ? 2014 టీడీపీ మున్సిపల్ మేనిఫెస్టోలో పెట్టినట్టు రూ.2కే 20 లీటర్ల త్రాగునీరు, ఇంటికో ఉద్యోగం ఇచ్చారా..? అని చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. 2014 జనరల్ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన 600 వాగ్దానాలకే దిక్కు లేదన్నారు. అమలుకాని వాగ్దానాలను టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసం చేయడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. పన్నులు పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 20 నెలలుగా సంక్షేమ పరిపాలన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచారని, ఇలాంటి ముఖ్యమంత్రి పన్నులు పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా..? అని సజ్జల ప్రశ్నించారు. పన్నులు బాదేస్తున్నారని చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎప్పుడైతే అడ్రస్ గల్లంతైందో.. ఇక టీడీపీ పనైపోయినట్టేనని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.