గుంటూరు: ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఏడాదిన్నరలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు.. రూ. 7వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించలేరా అని వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఈ ప్రభుత్వానికి తెలిసుంటే రూ. 7 వేల కోట్లు బకాయిలు పెట్టేది కాదని విమర్శించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను ములాఖత్ లో పరామర్శించిన అనంతరం జైలు బయట వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు నగర వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికానికి నిధులు విడుదల చేస్తూ విద్యార్థుల చదువులకు అండగా నిలిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల చదువులను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తున్న కూటమి ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయే రోజులు త్వరలోనే రాబోతున్నాయని, చరిత్రలో విద్యార్థి శక్తి ముందు ఏ ప్రభుత్వం నిలబడలేదనే వాస్తవాన్ని గుర్తెరిగి తక్షణమే ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచాలని చూడటం అవివేకమన్నారు. విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్య అక్రమ అరెస్టును వైయస్ఆర్‌సీపీ తరఫున తీవ్రంగా ఖండించారు. హిట్లర్ తరహాలో నియంత పాలన సాగిస్తున్న చంద్రబాబు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వైయస్ఆర్‌సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, నూరి ఫాతిమా హెచ్చరించారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ● పేద విద్యార్థుల ఇబ్బందులు కనపడటం లేదా? - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అక్రమ అరెస్టును వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థుల తరఫున ప్రశ్నించిన పాపానికి ఈ ప్రభుత్వం ఆయన్ను అక్రమంగా జైలుకు పంపింది. దేశంలో గతంలో ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసుండరు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు ఓర్వలేకపోతున్నారు. వైయస్ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో మాదిరిగా ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసి పేద విద్యార్థులకు అండగా నిలబడాలని నినదించడం నేరమా? ఫీజులు కట్టలేక చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థుల కోసం గొంతెత్తడం తప్పా? కళాశాలల ఫీజు వేధింపులకు ఎంతోమంది విద్యార్థులు బలవుతున్నా మొద్దు నిద్ర వీడని ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడం తప్పా? ఫీజులు కట్టలేదని విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఈ ప్రభుత్వానికి కనిపించకపోవడం దుర్మార్గం. వైయస్ఆర్‌సీపీ హయంలో ప్రతి త్రైమాసికానికి క్రమం తప్పకుండా విద్యాదీవెన (ఫీజురీయింబర్స్‌మెంట్), వసతి దీవెన నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా చూశారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన చివరి త్రైమాసికం తప్ప ఎప్పటికప్పుడు నిధులు జమయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాదీవెన (ఫీజురీయింబర్స్‌మెంట్), వసతి దీవెన కలిపి రెండేళ్లలో ఏకంగా రూ.7వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఈ కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏడాదిన్నరలో తెచ్చిన రూ.2.66 లక్షల కోట్ల అప్పుల్లో రూ. 7వేల కోట్లు విడుదల చేయలేకపోవడం చూస్తే విద్యా వ్యవస్థపై ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తామని నమ్మబలికన చంద్రబాబు, ఆ హామీని మొదటి నెలతోనే సరిపెట్టాడు. పదో తేదీ వస్తున్నా చాలా డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులకు జీతాలు జమ కాలేదు. ఫీజు బకాయిలు ఇవ్వక, జీతాలివ్వక, మెడికల్ కాలేజీలు నిర్మించకుండా... తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నట్టు? ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేయడం కొంతకాలం చాలించి క్షేత్రస్థాయిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం తెలుసుకోవాలి. నియంత పాలన ఎల్లకాలం సాగదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వైయస్ జగన్ గారి మీదనో, వైయస్ఆర్‌సీపీ మీదనో ఉన్న కోపాన్ని విద్యార్థుల మీద చూపించడం చాలా తప్పు. తక్షణమే పానుగంటి చైతన్యను విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తుంది. ● హిట్లర్ తరహాలో చంద్రబాబు నియంత పాలన - గుంటూరు నగర వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హిట్లర్ తరహాలో పాలన సాగిస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి ఆగడాలపై గొంతెత్తడమే పాపం అన్నట్టు పాలన తయారైంది. అధికారంలోకి వచ్చింది మొదలు వైయస్ఆర్‌సీపీ నాయకులను అక్రమ అరెస్టులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించిన వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయని కారణంగా విద్యార్థులు చదువులకు దూరమవుతున్న దుస్థితిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపాలనే కుట్రలు చేస్తున్నారు. బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులున్నా అక్రమంగా జైలుకు పంపి వేధిస్తున్నారు.