తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఉద్యోగులపై కూటమి ఎమ్మెల్యేలు, నేతలు దాడులకు దిగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు సైతం పోలీసులపై బూతుపురాణంతో విరుచుకుపడటం దిగ్బ్రాంతిని కలిగిస్తోందని అన్నారు. అత్యున్నతమైన పదవుల్లో ఉండి కూడా ఇలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఉద్యోగుల విషయంలో తన నోరు అదుపులో పెట్టుకోవాలిన హితవు పలికారు. ఇంకా ఆయనేమన్నారంటే... స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు ఈ నెల 21వ తేదీన అనకాపల్లి జిల్లా దొండపూడి అనే గ్రామంలో జరిగిన జాతరకు కొందరు అనుయాయులతో కలిసి వెళ్ళారు. అక్కడికి రాగానే పోలీసులు తనకు కనిపించలేదని ఆగ్రహిస్తూ అని చిందులు వేశారు. నానారకాలుగా పోలీసులను దుర్భాషలాడుతూ, చెప్పలేని భాషతో విరుచుకుపడ్డారు. ఆయన అనుయాయులు కూడా అదే విధంగా రచ్చ చేశారు. దీనిని గమనించిన పోలీసులు అక్కడికి వచ్చి మేం అందుబాటులోనే ఉన్నామని చెప్పినా వినకుండా మీ సీఐ ఎక్కడా? ఎస్ఐ ఎక్కడా అంటూ అయ్యన్నపాత్రుడు అసభ్యపదజాలతో దూషణలకు దిగారు. ఇదంతా సోషల్ మీడియాలో చూసిన ప్రజలు అవాక్కయ్యారు. పవిత్రమైన అసెంబ్లీకి స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు సహనం లేకుండా ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు మాట్లాడటం దారుణం. సీనియర్ రాజకీయ నాయకుడు, అసెంబ్లీకి అత్యున్నతమైన స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు హుందాతనంను కోల్పోయి, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై బహిరంగ దూషణలకు దిగడాన్ని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరుఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు చెబుతున్నాం. దుర్మార్గంగా, అకారణంగా మాట్లాడటం మంచిది. రాబోయే రోజుల్లో అయినా ఆయన కంట్రోల్‌గా ఉండాలి. పోలీసులను పట్టుకుని, వారి పై అధికారుల గురించి ఇష్టారీతిగా మాట్లాడటం సమంజసమా? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది. సెల్యూట్ చేయలేదని హోంగార్డ్ను కొడతారా..? కూటమి పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై చెలరేగిపోతున్నారు. ఉద్యోగుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరం. అధికారంలోకి రాకముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మేం ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటామని చెప్పిన మాట వాస్తవం కాదా? మచిలీపట్నంలో ఒక హోంగార్డ్ రాత్రి డ్యూటీ చేస్తూ ఉంటే జనసేనకు చెందిన కర్రి మహేష్ తనకు సెల్యూట్ చేయలేదని అతడిని దుర్భాషలాడటంతో పాటు దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన సదరు హోంగార్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోంగార్డ్స్, పోలీసులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదా? ఈ ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ వ్యవస్థను తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటోంది. అయినా కూడా వారిని హీనంగా చూడటం, వారిపై ఏకంగా దాడికి పాల్పడటం సమంజసమా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ చర్యలను సమర్థిస్తున్నారా? శ్రీశైలంలో అటవీశాఖ అధికారులను టీడీపీ ఎమ్మెల్యే మద్యం మత్తులో వారిని కొట్టి, కిడ్నాప్ చేసి అరాచకం సృష్టించారు. ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారు? శ్రీకాకుళంలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక ఒంటరి దళిత మహిళ అయిన ఉద్యోగికి వీడియో కాల్స్ చేసి, ఏరకంగా వేధించారో ప్రజలంతా చూశారు. ఉద్యోగులకు కల్పిస్తున్న రక్షణ, మర్యాద ఇదేనా? అధికారులు, ఉద్యోగులపై కూటమి నేతలు చేస్తున్న దుర్మార్గాలపై తక్షణం సీఎం చంద్రబాబు స్పందించాలి. ఈ ఘటనల్లో బాధితులకు న్యాయం చేయాలి. దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.