తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఉసురుపోసుకుంటోందని వైయస్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బందెల కిరణ్ రాజ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌లను తొలగించాలనే కుట్రలో భాగంగా రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లలో కోత పెట్టిన ప్రభుత్వం, రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో మిగిలిన పెన్షన్లను కూడా తొలగించేందుకు సిద్దమైందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ చేసుకుంటేనే దివ్యాంగులకు పింఛన్లు కొనసాగిస్తామని చెప్పి అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 4.5 లక్షల మంది దివ్యాంగులకు రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో సుమారు లక్ష మందిని అనర్హులుగా ప్రకటించి వారి కడుపు కొట్టారు. దివ్యాంగులకు అండగా ఉంటామని తీయని మాటలు చెప్పిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఎన్నికలకు ముందు దివ్యాంగులుగా ఉన్న వారు ఎన్నికలయ్యాక ఎలా కాకుండా పోతారో వారే సమాధానం చెప్పాలి. సదరం క్యాంపుల వద్ద కనీస వసతులు లేవు రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్న సదరం క్యాంపుల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వేధిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, కనీస వసతులు లేక దివ్యాంగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు వారాల క్రితం చింతలపూడి నియోజకవర్గం రేచర్ల గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి సుధాకర్ అలియాస్ యేసు సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ కోసం రేచర్ల గ్రామం నుంచి ఏలూరు జనరల్ ఆస్పత్రికి వచ్చి కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో మరో దివ్యాంగుడు కూడా ఇలాగే సదరం క్యాంపుకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం ఇప్పటికైనా రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధించడం ఆపాలి. మానసిక వైకల్యం కలిగిన వారిని రెండు మూడు అంతస్థులపైన ఉన్న వెరిఫికేషన్ కేంద్రాలకి తీసుకెళ్లలేక వారి కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను దోచుకునే ప్రక్రియ యథేచ్ఛగా జరుగుతోంది. వెరిఫికేషన్ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలి. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలి వైయస్ జగన్ సీఎంగా ఉండగా దివ్యాంగులకు పెళ్లి కానుక అందజేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆపేసింది. దివ్యాంగులకు బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీని కూడా నిలిపివేశారు. దివ్యాంగులు, వృద్ధుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని నాడు వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేసే రేషన్ పంపిణీ విధానాన్ని దుర్మార్గంగా ఆపేశారు. దివ్యాంగులకు ఐదు రోజులు ముందుగానే రేషన్ సరుకులు ఇంటికే పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చినా క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు. కూటమి ప్రభుత్వంలో 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయడం లేదు. జనసేన జనవాణి కార్యక్రమాల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దివ్యాంగులను ఉన్నత స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చి బాధలు చెప్పుకుందామని వెళితే కనీసం ఇప్పుడు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి ఏడాది గడిచినా దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదు. దివ్యాంగుల హక్కుల సాధనకు అండగా నిలబడి వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది.