అన్నమయ్య జిల్లా: వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన తనయుడు, ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగం రెడ్డి కిషోర్ దాస్ మండిపడ్డారు. ఎంపీ పీవీ మిథున్ రెడ్డిపై ప్రభుత్వం మోపిన అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తూ, రాజంపేట ఆర్ అండ్ బి కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు జంగం రెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ, "పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు రాజకీయాలకు కూటమి ప్రభుత్వం దిగజారింది. మిథున్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను సానుకూలగా వింటూ సహనంగా స్పందించే నాయకుడు. అలాంటి నేతను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే ధైర్యం లేక సంస్థలతో, విచారణల పేరుతో ప్రతిపక్షాలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈ విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలనే కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇది నికృష్టమైన నాటకంగా మిగిలిపోతుంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ, వ్యక్తిగత స్వార్థం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘లోకేష్ రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు తరలిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని రేపటి ప్రభుత్వాలు అనుసరిస్తే, ప్రజాస్వామ్యానికి అర్థం మిగలదు" అని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ జుబేర్ మాట్లాడుతూ.. "మిథున్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ అరెస్టు. ఇది పూర్తిగా అక్రమం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరెస్టులు నిలబడవు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరుతెన్నులు మార్చాలి. సమస్యల పరిష్కారానికి పాలకులు ముందుకు రావాలి" అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్, పట్టణ అధ్యక్షుడు బాలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు సునీల్ రెడ్డి, మండల ఇంచార్జ్ శివకుమార్ రాజు, యువజన విభాగ కార్యదర్శి భరత్ శింధా రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.