చిత్తూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా అన్నారు. నిండ్ర మండలం కేంద్రంలో మిట్ట కండ్రిక క్రాస్ సమీపంలో ` రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో` కార్యక్రమం నిర్వహించారు. కూటమి మ్యానిఫెస్టోను వివరిస్తూ ఏడాదిగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో క్యూ ఆర్ కోడ్ సాయంతో ప్రజలకు ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ..`మ్యానిఫెస్టో పేరుతో 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు వాస్తవానికి దూరం. ప్రతి సారి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబు నైజం. గతంలో రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అదే పాత డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వృద్ధులకు పెన్షన్ పెంపు, నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఉద్యోగం, మహిళలకి రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహం వంటి పలు హామీలన్నీ నెరవేర్చకుండా గతంలో మోసం చేశారు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. మోసం చేస్తున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి` అంటూ రోజా డిమాండ్ చేశారు.