ఎన్టీఆర్ జిల్లా: పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తానని, మీరు చదవండి, మీ ఫీజులు ఎంతైనా నేను కడతానని భరోసాను ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు. చదువు ఒక్కటే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని సీఎం వైయస్ జగన్ గట్టిగా నమ్మారు కాబట్టే విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. చదువుకునే పిల్లలకు జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా తోడుగా నిలుస్తున్నారన్నారు. పిల్లలు చదువుకుంటేనే ఆ కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు మెరుగుపడతాయని సీఎం వైయస్ జగన్ నమ్మారన్నారు. విద్యారంగంపైనే కాకుండా.. ఆరోగ్య, ఆర్థిక, రాజకీయ పరంగా పేదలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసేందుకు తిరువూరుకు విచ్చేసిన సీఎం వైయస్ జగన్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే రక్షణ నిధి కృతజ్ఞతలు తెలిపారు. తిరువూరు నియోజకవర్గం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. విద్యా దీవెన నిధులు విడుదల బహిరంగ సభలో ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొని మాట్లాడారు.
‘‘2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, హింసించింది. గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాను. జన్మభూమి కమిటీలు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ప్రోటోకాల్ లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం అని చెప్పి.. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
రెండు సీట్లు గెలిచి ఏదో పొడిచేస్తామని ప్రతిపక్షం మాట్లాడుతోంది. సర్పంచ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా పరిషత్, స్థానిక సంస్థలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్ సీపీ జెండా ఎగురుతూనే ఉంది. ఏదో ఒకటి రెండు చోట్లు గెలిచి దాన్ని చూసి మురిసిపోవద్దు. తిరువూరు నుంచే సమరశంఖం మోగిస్తున్నాం. 175 నియోజకవర్గాలకు 175 గెలిచి తీరుతాం.
కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పెన్షన్ ఇస్తానని తిరువూరు నుంచే వైయస్ జగన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఆచరణలో చూపించారు. ఏ. కొండూరు మండలంలో కిడ్నీ బాధితుల కోసం రూ.3 కోట్లతో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1450 కోట్లు సీఎం వైయస్ జగన్ మూడున్నర సంవత్సరాల్లో అందించారు’ అని ఎమ్మెల్యే రక్షణనిధి చెప్పారు.