టీడీపీ నేతల ఆదిపత్య పోరుతోనే రొంపిచర్లలో కాల్పుల ఘటన

వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందలు

మా పార్టీవారికి సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

పల్నాడు: టీడీపీ నేతల అంతర్గత విభేదాలతోనే రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల ఘటన జరిగిందని, పమ్మి వెంకటేశ్వరరెడ్డి అనే టీడీపీ నాయకుడు, బాలకోటిరెడ్డి అనే మరో టీడీపీ నేతపై కాల్పులు జరిపించారని నరసరావుపేట నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆ గ్రామంలోని ఇద్దరు టీడీపీ నేతల ఆదిపత్యపోరు ఈ ఘటనకు కారణమని చెప్పారు. పమ్మి వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన వ్యక్తిగా కొన్ని మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. వెంకటేశ్వరరెడ్డి టీడీపీ నాయకుడదిగానే ఉన్నారని, గతంలో బాలకోటిరెడ్డిపై హత్యా ప్రయత్నం చేసి పోలీసులకు లొంగిపోయాడని చెప్పారు. 

రొంపిచర్ల మండలం అలవాలలో తుపాకీ కాల్పుల ఘటనపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఆ ఘటనతో వైయస్‌ఆర్‌ సీపీకి ఎటువంటి సంబంధం లేదని, టీడీపీ నేతల చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు టీడీపీ నేతల మధ్య ఆదిపత్య పోరు నడుస్తున్నప్పుడు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా అధ్యక్షుడు, పార్టీ హైకమాండ్‌ ఏం చేస్తుందని ప్రశ్నించారు. వారిద్దరినీ కూర్చోబెట్టి సయోధ్య కుదుర్చడం చేతగాక వైయస్‌ఆర్‌ సీపీపై నిందలు వేస్తోందని ఫైరయ్యారు. 

బాలకోటిరెడ్డిపై కాల్పులకు పాల్పడిన నలుగురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కాల్‌ డేటా తీయండి. ఈ ఘటనతో వైయస్‌ఆర్‌ సీపీకి ఎలాంటి సంబంధం లేదు.. ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. టీడీపీ నేతల చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైయస్‌ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Back to Top