అసెంబ్లీ: గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాధనమంతా తెలుగుదేశం పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల జేబుల్లోకి వెళ్లిపోయాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ తెలిపారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా చేశారని, జన్మభూమి కమిటీల పేరుతో లూటీ చేశారని గుర్తుచేశారు. టీడీపీ నాయకుల కుటుంబాలకు అర్హత లేకున్నా పెన్షన్లు అందజేశారన్నారు. బెంగళూరులో 2లక్షల రూపాయల జీతం తీసుకునే కొడుకు, సొంత ఇల్లు, కారు అన్నీ ఉన్నప్పటికీ సామాజిక పెన్షన్ తీసుకున్న కుటుంబం ఉందన్నారు. వైయస్ఆర్ సీపీ హయాంలో అర్హత లేదని పెన్షన్ నిలిపివేసిందన్నారు. ``గత ప్రభుత్వంలో మాకు పెన్షన్ వచ్చిందని, ఇప్పుడు ఆపేసారంటూ టీడీపీ మహిళా కార్యకర్త నాతో వాదనకు దిగింది. వలంటీర్ ను పిలిచి కారణాలు విశ్లేషిస్తే అసలు విషయం బయటపడింది`` అని ఎమ్మెల్యే ధనలక్ష్మీ చెప్పారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్న కొడుకు, ఇల్లు, కారు అన్నీ ఉండటంతో నిబంధనల ప్రకారం సామాజిక పెన్షన్లకు అర్హులుకారని తేలిందన్నారు. టీడీపీ హయాంలో మేలు స్వజనులకే తప్ప సామాన్య ప్రజలకు, నిరుపేదలకు కాదని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే ధనలక్ష్మీ అసెంబ్లీలో వివరించారు. వైయస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పాలనలో కుల, మత, వర్గ, పార్టీ బేధాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుండటం గర్వంగా ఉందని ఆమె తెలిపారు.