నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌: నెల్లూరుపై పదే పదే నోరు పారేసుకుంటే తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా, లోకయ్యా! అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేష్‌కు చుర‌క‌లంటించారు. నెల్లూరును రాష్ట్ర నేర రాజ‌ధానిగా నారా లోకేష్ అభివ‌ర్ణించ‌డాన్ని విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావించి నెల్లూరును ‘క్రైమ్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని పొరుగు జిల్లా చిత్తూరులో సగం కుటుంబ మూలాలున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ రెండోసారి ముద్రవేశాడు. కొద్ది నెలల క్రితం కూడా ఓ సంఘటన ఆధారంగా ఈ మాజీ సీఎం కుమారుడు నెల్లూరును ‘రాష్ట్ర నేర రాజధాని’ అని అభివర్ణించారు. ఇప్పుడు పాలకపక్షం సానుభూతిపరుడిపై అతను ఆరోపణ చేస్తూ, నెల్లూరుపై మరోసారి దూషణకు దిగడం జుగుప్సాకరం. మూడు రాజధానులకు తోడు నెల్లూరును ‘నేర రాజధానిగా చేసినట్టు ఉంది,’ అని లోకేష్‌ మొన్న వ్యాఖ్యానించడం అతని మూర్ఖత్వాన్ని వెల్లడిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన భౌగోళిక యూనిట్లేగాని ప్రత్యేక స్వభావం ఉన్న రాజ్యాలు కాదు. కొందరు వ్యక్తులను గాని, జనసమూహాలను గాని వారి జిల్లాల పేర్లు ప్రస్తావించి వాటికి విశేష గుణాలు ఆపాదించడం అనాగరికం. ఈపాటి లోకజ్ఞానం కూడా లేని ‘మాలోకం’ బాబును 2017లో శాసనమండలికి పంపించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. నెల తిరగకుండానే నాయన మంత్రివర్గంలో సభ్యుడైన ‘అబ్బాయి గారు’ సొంత ‘బరువు’ పెంచుకున్నారే గాని ప్రపంచజ్ఞానం వృద్ధి చేసుకోలేదు. ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభ సభ్యుడిగా ఉంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనల ఆధారంగా ప్రజలలో ఆయా జిల్లాలపై వ్యతిరేకం భావం ఏర్పడేలా మాట్లాడడం రాజకీయ నాయకుడు చేయాల్సిన పని కాదు. ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీ నేతకు, మాజీ ముఖ్యమంత్రికి కుటుంబ, రాజకీయ వారసుడిగా చెలామణి అవుతున్న ఈ మాజీ మంత్రికి సభ్యతగా మాట్లాడడం ఎవరైనా నేర్పితే బాగుండు. ఎందరెందరో రాజకీయ ఉద్ధండులను రాష్ట్రానికి, దేశానికి, మరెందరో మేధావులను ప్రపంచానికి అందించిన నెల్లూరును కేవలం ‘నేరాలకు కేంద్రంగా చూపించి’ మాట్లాడడం తెలుగువారికి అవమానకరం. అత్యంత ఆక్షేపణీయం. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2014, 2019) ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ చావు దెబ్బతిన్నంత మాత్రాన దాన్ని నేరమయ జిల్లాగా వర్ణిస్తే–  చంద్రబాబు గారి ఏకైక సంతానానికే నష్టం. నాయకులు వస్తారు, పోతారు. నెల్లూరు శాశ్వతం. ఈ సూత్రం అన్ని ఊళ్లకు, జిల్లాలకు వర్తిస్తుందయ్యా, లోకయ్యా! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top