కొడుకు పప్పు.. తండ్రి గన్నేరు పప్పు

చంద్రబాబు లాంటి అసమర్థ ముఖ్యమంత్రి అవసరమా..?

నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి హోదాను తాకట్టుపెట్టాడు

టీడీపీ నేతల డబ్బుకు ఓట్లు అమ్ముకోకండి

జగనన్న ముఖ్యమంత్రి అయితే వ్యవసాయం పండగ అవుతుంది

రాజన్న పాలన మళ్లీ జగనన్నతోనే సాధ్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల

 

కృష్ణా జిల్లా: నాలుగు సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసి ప్రత్యేక హోదా కూడా సాధించలేని చంద్రబాబు లాంటి అసమర్థ ముఖ్యమంత్రి ఆంధ్రరాష్ట్రానికి అవసరమా..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. కొడుకు లోకేష్‌ పప్పు అయితే ఆయన తండ్రి చంద్రబాబు గన్నేరు పన్ను అని అన్నారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సర్కిల్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ప్రచార సభలో వైయస్‌ షర్మిల పాల్గొని మాట్లాడుతూ.. 

లోకేష్‌ను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు. పప్పుకు చాలా తెలివి తేటలు ఉన్నాయా అంటే జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదు. పప్పు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అనుభవం, ఏ అర్హత ఉందని చంద్రబాబు మూడు శాఖలకు మంత్రిని చేశారు. చంద్రబాబు కొడుకుకు మూడు ఉద్యోగాలు, మామూలు ప్రజలకు ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమైనది. ప్రత్యేక హోదా రాకపోతే పరిశ్రమలు రావు.. యువతకు ఉద్యోగాలు రావు.. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించలేదంటే ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం హోదా రాదు.. 

బై బై బాబు అని చెప్పండి. బై.. బై.. పప్పు కూడా.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు. మొన్నటి వరకు కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబు. హరికృష్ణ మృతదేహం పక్కన ఉందనే ఇంగితం లేకుండా వాళ్ల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాకు పొత్తు ఉందని చెబుతున్నారు. సూటిగా చెబుతున్నాం.. మాకు ఎవరితో పొత్తు లేదు. సింహం సింగిల్‌గా వస్తుంది.. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌ను, జనసేనను, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఫరూక్‌ అబ్దుల్లా, దేవగౌడ అంట.. చివరకు కేఏ పాల్‌ను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఇంత అసమర్థ నాయకుడు ఇంకొకరు ఉంటాడా.. 

టీడీపీ వాళ్లు మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతారు. మీరు ఏం సమాధానాలు చెప్పాలో తెలుసా.. చంద్రబాబు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని వాగ్దానం చేశారు. ఈ ఐదేళ్లలో పిల్లల చదువులకు తల్లిదండ్రులు కట్టిన ఫీజులు మొత్తం బాకీ. ముందు ఆ బాకీ తీర్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే.. రూ. 25 వేలు ఇస్తానన్నాడు.. ఆ లెక్కన ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు చంద్రబాబు రూ. 25 వేలు బాకీ ఉన్నాడు. టీడీపీ నేతలు ఇంటికి వస్తే ముందు ఆ బాకీ తీర్చమని చెప్పండి. మహిళలకు స్మార్ట్‌ఫోన్లు, విద్యార్థులకు ఐప్యాడ్‌లు ఇస్తానన్నాడు.. ఎన్నికలలోపే ఇచ్చేయమని చెప్పండి. 

ఇంటికో ఉద్యోగం అన్నాడు.. లేకపోతే నెలకు రూ. 2 వేల భృతి ఇస్తానన్నాడు. ఆ లెక్కన 60 నెలలకు అక్షరాల రూ. 1.20 లక్షలు బాకీ పడ్డాడు. ప్రతి ఇంటికి చంద్రబాబు పడిన బాకీ రూ. 1.20 లక్షలు ముందు అది తీర్చమని చెప్పండి. రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేతలకు రుణమాఫీ అన్నాడు. మీకున్న రుణమంతా తీర్చమని చెప్పండి. డబ్బులు ఇస్తాం అంటాడు.. మీ ఓటు కొనుగోలు చేస్తామంటారు.. అమ్ముడుపోతామా.. నిజానికి చంద్రబాబు ఎన్ని డబ్బులు ఇచ్చిన మీ బాకీ తీర్చలేరు. కొడుకు పప్పు అయితే తండ్రి గన్నేరు పన్ను అంట. చంద్రబాబు గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. హామీలు అమలు చేశానని చెప్పుకునే దమ్ము, ధైర్యం లేక వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడు. 

సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఒక పక్క. ఇంకో పక్క తండ్రి కోసం మరణించిన కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు అనే మాట కోసం సింగిల్‌గా కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఈ పోరాటం వెన్నుపోటు, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటం మంచికి చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో మీరు మంచి పక్కన నిలబడాలని కోరుతున్నాం.. 

రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రైతుకు అండగా నిలబడతాం. ప్రతి పేదవాడికి భరోసాగా నిలబడతాం. ప్రతి రైతుకు రాబోయే రాజన్న రాజ్యంలో మే నెలలోనే పెట్టుబడి సాయం కింద రూ. 12500 మే నెలలోనే ఇస్తాం. రైతన్న పండించిన పంటకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు కూడా ఇవన్నీ వర్తింపజేస్తాం. డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలన్నీ నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. మళ్లీ సున్నా వడ్డీకే కొత్త రుణాలు ఇప్పిస్తాం. 

విద్యార్థులు మీరు కోర్సు అయినా చదవొచ్చు. డాక్టర్‌ అయినా, ఇంజనీరింగ్‌ అయినా, ఎంబీఏ, ఎంసీఏ ఏ చదువు అయినా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది. విద్యార్థులకు ప్రతి సంవత్సరం హాస్టల్, మెస్‌ చార్జీల కింద రూ. 20 వేలు ఇస్తాం. యువతకు ఉద్యోగాల కోసం గవర్నమెంట్‌ కాంట్రాక్టుల్లో నిరుద్యోగులకే ప్రాధాన్యం ఇస్తాం. యువత ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకొస్తాం. పిల్లలు కూలీకి తీసుకెళ్లకుండా బడికి పంపించిన ప్రతి తల్లికి రూ. 15 వేలు అందజేస్తాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేలు అందజేస్తాం. ఆరోగ్యశ్రీలో రూ. వెయ్యి దాటితే మొత్తం ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్యం అందజేస్తాం. అంతేకాకుండా నెలకు రూ. 40 వేలు ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు తీసుకువచ్చి ఆరోగ్యశ్రీలో చేర్చుతాం. వృద్ధులకు పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకే కుదిస్తాం. వికలాంగులకు రూ. 3 వేలు ఇస్తాం.. అండగా ఉంటాం. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. పది నాలుకల రావణాసురుడు పోవాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి.. వ్యవసాయం పండుగ కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. 

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ ఇద్దరినీ గెలిపించాలని కోరుతున్నా.. ఫ్యాన్‌ గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేస్తున్నట్లు అని ఎవరూ మర్చిపోవద్దు. 

Back to Top