అద్దంకి: పొగాకు రైతులకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పోరుబాట కార్యక్రమం పోస్టర్ ను అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త పానెం చిన్న హనిమి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వారిపై పచ్చపాతం చూపుతోందని, మద్దతు ధర కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి వస్తున్నారని తెలిపారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. రైతులను ఓదార్చడం, ధైర్యం చెప్పడం, వారి భవిష్యత్ కోసం పోరాటానికి సిద్ధమవడం కోసం ఆయన వస్తున్నట్లు తెలిపారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి రైతులంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ కనీస సహాయం అందలేదన్నారు. అన్నదాతలు పండించిన కంది, వరి, మిరప పంటలకు సరైన ధర లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పొగాకు రైతుకు గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బ్యారన్, పొలం కౌలు, పెట్టుబడి బాగా పెరిగిందన్నారు. గతేడాది వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఈ ఏడాది రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు చూస్తే రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. ఎక్కడచూసినా పొగాకు బేళ్లు అమ్ముడుపోక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో వచ్చిన ధరలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు. రైతుల కోసం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి జగనన్న అండగా నిలిచారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి రైతులకు మేలు చేయాలని కోరారు. పొగాకు పంటకు మద్దతు ధర వచ్చేంత వరకు రైతులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ప్రతి గ్రామం నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి భాగస్వామ్యం కావాలని కోరారు.