విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. చందనోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300 టికెట్ కొనుక్కుని క్యూలో నిల్చున్న వారిపై గోడ కూలడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో దంపతులతో సహా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తాడేపల్లి నుంచి విశాఖ వచ్చిన వైయస్ జగన్, నేరుగా చంద్రంపాలెం చేరుకుని, అక్కడ ఉమామహేష్, శైలజ భౌతికకాయాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అక్కడే వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..: తెలిసి కూడా ఎందుకంత నిర్లక్ష్యం?: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చినవారు ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలి. ఈరోజు జరిగిన ఈ ఘటన. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట. ఏది చూసినా.. ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను. ఏరోజు చందనోత్సవం జరుగుతుంది?. ఏరోజు వైకుంఠ ఏకాదశి అనేది ప్రభుత్వానికి తెలియదా? ఆయా రోజుల్లో లక్షల మంది భక్తులు వస్తారని కూడా తెలుసు. అయినా నిర్లక్ష్యంతో పలువురి ప్రాణాలు బలిగొన్నారు. తిరుపతిలో ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు కుప్పం పర్యటనకు పంపారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారి దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులందరినీ ఒక పార్కులో ఉంచి, ఒకేసారి వదలడంతో తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. అడుగడుగునా నిర్లక్ష్యం. లేని ఏర్పాట్లు: ఈరోజు ఇక్కడ చందనోత్సవం రోజు లక్షల మంది భక్తులు వస్తారు. అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం వస్తారని తెలిసినా, ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయి. కనీసం తాత్కాలిక టాయిలెట్లు కూడా లేవు. చివరకు క్యూలైన్లలో మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. నాసిరకంగా గోడ నిర్మాణం: ఇక ఘటన జరిగిన స్థలం చూస్తే.. ఆరు రోజుల క్రితం గోడ కట్టడం మొదలు పెట్టారు. రెండు రోజుల క్రితం పనులు పూర్తి చేశారు. 20 మీటర్ల పొడవు గోడ. అంటే దాదాపు 70 అడుగుల గోడ. ఎత్తు 10 అడుగులు. నాలుగు రోజుల్లో గోడ కట్టారు. ఎక్కడా కాలమ్స్ లేవు. రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ గోడ కట్టాలి. దానికి టెండర్లు పిలవలేదు. మంత్రుల పర్యవేక్షణ అంటారు. 5గురు సభ్యుల కమిటీ పర్యవేక్షణ అంటారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా పని ఎలా ఇచ్చారు? నాలుగు రోజుల్లోనే అంతపెద్ద గోడ ఎలా కట్టారు?. టెండర్లు పిలవకుండానే గోడ నిర్మాణం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. చందనోత్సవం ఎప్పుడు జరిగేది మీకు తెలియదా? అది తెలిసినప్పుడు, ఈ గోడ నిర్మాణం ముందే ఎందుకు చేయలేదు? ఇదే చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నాను. కేవలం ఆరు రోజుల క్రితం గోడ పనులు మొదలుపెట్టి, రెండు రోజుల క్రితం పూర్తి చేశారు. అంత ముఖ్యమైన పనిని ఎందుకంత ఆలస్యం చేశారు? కనీసం టెండర్లు కూడా పిలవకుండా, ఇష్టం వచ్చినవారికి అప్పగించడం ధర్మమేనా?. 70 అడుగుల గోడ. 10 అడుగుల ఎత్తు. కనీసం కాలమ్స్ కూడా లేకుండా ఫ్లైయాష్ ఇటుకలతో కట్టడం ఎంత వరకు సబబు?. రీఇన్‌ఫోర్స్ కాంక్రీట్‌తో కట్టకపోతే, గోడ ఎలా నిలబడుతుంది?. రెండు రోజుల క్రితమే గోడ నిర్మాణం పూరై్తంది. అది తెలిసి కూడా, ఆ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు?. కొత్త గోడ అని తెలుసు. అయినా ఎలా భక్తులను గోడ పక్కన నిలబెట్టారు?. వరసగా దుర్ఘటనలు: తిరుపతిలో గతంలో ఎన్నడూ తొక్కిసలాట జరగలేదు. కానీ, గత జనవరిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. నిర్లక్ష్యానికి ప్రతీకగా ఇక్కడ ఏడుగురు చనిపోయారు. ఇటీవలే శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం చూశాం. టీటీడీ గోశాలలో ఏ విధంగా గోవులు చనిపోయాయో చూశాం. కడప జిల్లాలో కాశినాయన ఆశ్రమంలో కలెక్టర్ స్వయంగా బుల్డోజర్లతో కూల్చారో చూశాం. కేవలం ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు హయాంలో జరుగుతున్న ఘటనలు. వ్యవస్థలపై ఆయన చూపుతున్న అశ్రద్ధకు ఇవన్నీ నిదర్శనం. తూతూ మంత్రంగా విచారణలు: చంద్రబాబునాయుడుగారిది ప్రతిదీ పబ్లిసిటీ. ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్. గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో ఆయన పబ్లిసిటీ పిచ్చికి 29 మంది చనిపోయారు. ఏ ఘటన జరిగినా, ఆ తర్వాత వస్తాడు. ఎంక్వైరీ కమిషన్ అంటాడు, కానీ, ఎక్కడా ఏ చర్య ఉండదు. ఎందుకంటే వాటిలో ఆయనే దోషి కాబట్టి. తిరుపతి తొక్కిసలాట జరిగిన తర్వాత ఎంక్వైరీ అన్నాడు. ఏం చేశాడు? ఎస్పీని ట్రాన్సఫర్ చేసి, ఇంకా మంచి పోస్టింగ్ ఇచ్చాడు. సుబ్బారాయుడు అనే అధికారి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతారు. ఎక్కడైనా తప్పు జరిగితే, కఠిన చర్యలు ఉండాలి. అధికారుల యూనిఫామ్ విప్పించాలి. కానీ, చంద్రబాబు ఏం చేసినా, ప్రతిదీ డైవర్షనే. మంత్రుల బాధ్యతా రాహిత్య మాటలు: ఈ ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఇచ్చిన స్టేట్‌మెంటు చూస్తే.. ఈ గోడ ఎవరి హయాంలో కట్టారు? కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకుని, కఠిన చర్య తీసుకుంటాం అన్నారు. కానీ, ఈ గోడ కట్టింది వారి హయాంలోనే అని తెలిశాక, ఆ గోడ ఎలా కట్టారో? ఏ మెటేరియల్‌తో కట్టారో తమకేం తెలుసని మాట మార్చారు. అన్నీ తెలిసి కూడా కొత్త గోడ పక్కన భక్తులను ఎలా నిలబెట్టారు? అంటే ప్రతి చోటా నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది. కోటి చొప్పున ఇవ్వాలి: ఇక్కడికి నేను వస్తున్నానని తెలిసి, ఇక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌లో దుర్ఘటన జరిగితే, సీఎంగా ఉన్న నేను, చనిపోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున ఇచ్చాం. ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే, ప్రభుత్వం ఏం చేస్తోంది? వారికి తగిన పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?. అందుకే వారు (ఈ ప్రభుత్వం) ఇచ్చినా, ఇవ్వకపోయినా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, గుర్తు పెట్టుకుని, ఆ బ్యాలెన్స్ రూ.75 లక్షలు కచ్చితంగా ఇస్తాం. ఇదే నా మాట. గోడ కూలేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందట. 70 అడుగుల పొడవు. 10 అడుగుల ఎత్తు గోడ. నాసిరకం పనులు. వీటిపై అందరూ ఆలోచించాలి. సీఎం చంద్రబాబుగారు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇంకా మంత్రులు, అధికారులు, ఆలయాన్ని నడిపే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని వైయస్ జగన్ స్పష్టం చేశారు.