నంద్యాల జిల్లా: రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన, రావణకాష్టంలా హింసాకాండ కొనసాగుతోందని.. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు దారుణంగా కొనసాగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. హత్య కేసుల్లో హంతకులను మాత్రమే కాకుండా, అది చేయించిన వారినీ ముద్దాయిలుగా చేర్చి, జైలుకు పంపిస్తేనే పరిస్థితి మారుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా వాటికి మద్దతు ఇస్తున్న నారాలోకేష్, చంద్రబాబును కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రతకదని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..: రెండు నెలలుగా మారణహోమం: రాష్ట్రంలో గత రెండు నెలలుగా పాలన ఎలా ఉందంటే.. ప్రజలకు మంచి చేయాలని, ఎన్నికల వేళ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేస్తూ, అలా ప్రజల మనసులో స్థానం కల్పించుకోవాలన్న ఆలోచన లేని ప్రభుత్వం కనిపిస్తోంది. రెండు నెలలుగా అరాచకం కొనసాగుతోంది. మారణహోమం సృష్టిస్తున్నారు. ప్రశ్నిసారన్న భయం: చంద్రబాబుగారు ఎన్నికల వేళ ఎన్నో మాటలు చెప్పారు. ప్రజలకు మోసం చేస్తూ, ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రజలంతా ప్రశ్నిస్తారన్న భయంతో, వారు ప్రశ్నించకూడదన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రవ్యాప్తంగా సృష్టిస్తున్నారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబుగారు, ఆయన పార్టీ వారంతా ఒకటే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వారేం చెప్పిన మాటలు.. పిల్లలు కనిపిస్తే చాలు.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని చెప్పి ప్రలోభాలకు గురి చేయడం, ఇలాంటి అక్కచెల్లెమ్మలు కనిపిస్తే నీకు రూ. 18 వేలు, అవ్వాతాతలు కనిపిస్తే రూ.4 వేల పెన్షన్, ఇలా నిరుద్యోగి కనిపిస్తే నీకు నెలకు రూ.3 వేల భృతి.. ఇంకా రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అంటూ ప్రచారం చేశారు. అందరికీ మోసం: అదే ఎన్నికలు అయిపోయిన తరవాత అందరినీ మోసం చేశాడు. అదే వైయస్ జగన్ అన్న ఉండి ఉంటే, అమ్మ ఒడి కింద ప్రతి తల్లికి రూ.15 వేలు వచ్చి ఉండేవి. అది పోయింది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలకు మోసం చేసి, తల్లికి పంగనామం పెట్టారు. వ్యవసాయం పనులు మొదలయ్యాయి. జగనే ఉండి ఉంటే, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అంది ఉండేది. అవి పోయే. చంద్రబాబు ఇస్తానన్న రూ.20 వేలు కూడా పోయాయి. అలా రైతులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 చొప్పున ఏటా, రూ.18 వేలు ఇస్తామని చెప్పి, వారిని కూడా మోసం చేశారు. రెడ్‌బుక్ పాలన: అందరినీ మోసం చేసిన చంద్రబాబు, దాన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచి, కక్ష సాధింపు చర్యలు వాళ్లు చేస్తుంటే.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామస్థాయిలో గ్రామ నాయకులు ఎవరికి వారు, రెడ్‌బుక్ తెరిచి.. ఊళ్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారో చూస్తున్నాం. హత్యా రాజకీయాలు: పోలీసులను నిస్తేజం చేస్తూ, వారి సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేస్తున్న పరిస్థితిని.. ఈ గ్రామంలో సీతారామాపురంలో సుబ్బారాయుడు అన్న కుటుంబానికి జరిగిని అన్యాయాన్ని ఒకసారి గమనిస్తే, ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం.. సుబ్బారాయుడు కుటుంబం గ్రామంలో పోలింగ్ రోజు బూత్‌ల్లో ఏజెంట్లుగా కూర్చున్నారని చెప్పి.. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను, ఇంకా గ్రామానికి చెందిన మా పార్టీ నాయకులందరినీ చంపాలని దారుణంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రామంలో పరిస్థితి చూస్తుంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. టీడీపీ మూకల స్వైర విహారం: గ్రామంలోని స్థానికులు, బయటి నుంచి వచ్చిన వారు, అందరినీ ఏకం చేసి, దాదాపు 35, 40 మంది ఒకేచోట ఏకమై, రాడ్లు పట్టుకుని.. తుపాకులు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూపారు. రాడ్లు, రాళ్లు, కర్రలు, కత్తులు పట్టుకుని గ్రామంలో స్వైరవిహారం చేయడానికి ఏకం అవుతుంటే.. గ్రామంలో ఉన్న నారపురెడ్డి రాత్రి దాదాపు 9.30కి మహానంది ఎస్‌కు ఫోన్ చేశారు. గ్రామంలోని పరిస్థితిని ఎస్‌కి వివరించి, పోలీసు బలగాలు రావాలని కోరారు. రాత్రి 9.30 గం.కి ఫోన్ చేస్తే.. కాసేపటికి ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి గ్రామంలోకి వచ్చారు. ఇక్కడి పరిస్థితి చూసిన ఎస్‌ఐ వెంటనే విషయాన్ని పై అధికారులకు విషయం చెప్పారు. సీఐ, డీఎస్పీకి ఎస్‌ఐ ఫోన్ చేయడం గ్రామంలో అందరికీ కనిపించింది. కానీ, బలగాలు మాత్రం రాలేదు. ఆయుధాలతో మనుషులు కనిపిస్తున్నా, ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. చేతిలో రాడ్లు, రాళ్లు ఉన్నాయి. కత్తులు కనిపిస్తున్నాయి. మనుషులు తిరుగుతున్నారు. ఏదో జరగబోతోంది అని అర్ధమవుతోంది. అయినా కూడా ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రేక్షకపాత్ర పోషించారు. ఇంత జరుగుతున్నా పోలీసుల అదనపు బలగాలు రాలేదు. అత్యంత చేరువలోనే ఉన్నా..: ఈ సీతారామాపురం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 10 కి.మీ దూరంలోనే ఉంది. జిల్లా కేంద్రంలో ఎస్పీ ఉంటారు. అక్కడే బలగాలు ఉంటాయి. ఇక్కడి నుంచి డీఎస్పీ ఆఫీస్ కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. 10 కి.మీ దూరంలో నంద్యాలలో ఎస్పీ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో గ్రామానికి బలగాలు పంపించి ఉంటే, ఆ ఘటన జరిగి ఉండేది కాదు. పోలీసుల సమక్షంలోనే..: సాక్షాత్తూ ఎస్‌ఐ, పోలీసులు చూస్తుండగానే, గ్రామంలో ఇదే స్పాట్‌లో, మా పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిని దారుణంగా చంపారు. పోలీసులు ఎవ్వరూ ఇక్కడికి రాకుండా చూసి, సుబ్బారాయుడిని పొడిచి, రాడ్లు, రాళ్లతో కొట్టి చంపారు. ఆయన భార్యపై కత్తితో దాడి చేశారు. ఇంత జరిగినా, అదనపు బలగాలు రాలేదు. రాత్రి 12.20 గం.కు సుబ్బారాయుడి హత్య జరిగింది. రాత్రి 9.30కి గ్రామానికి వచ్చిన ఎస్‌ఐ, మా పార్టీ నాయకులు జయనారపురెడ్డిని మహానంది పోలీస్ స్టేషన్‌కు పంపించేశారు. ఆ తర్వాత సుబ్బారాయుడిని చంపిన టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి, ఆయన ముఖ్య అనుచరులు.. తాపీగా గ్రామం విడిచి వెళ్లారు. అయినా పట్టుకునే ప్రయత్నం జరగలేదు. అర్థరాత్రి ఎన్ని ఫోన్లు చేసినా..: మహానంది పోలీస్ స్టేషన్‌లో ఉన్న నారపురెడ్డికి ఈ హత్య గురించి తెలియగానే.. రాత్రి 12.59కి, ఆ తర్వాత రాత్రి 1.08 కి నారపురెడ్డి జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. ఆ తరవాత మరోసారి ఎస్పీకి ఫోన్ చేసి, తాము ఎస్పీ ఆఫీస్‌కు వస్తున్నామని చెప్పారు. అనంతరం రాత్రి 3.18కి ఎస్పీకి ఫోన్ చేసిన నారపురెడ్డి, హంతకు ముఠాలో ఒకరైన రమణను పట్టుకున్నామని, అతణ్ని మీకు అప్పగించడానికి వచ్చామని, బయటకు రావాలని ఎస్పీకి చెప్పారు. చివరకు రాత్రి 3.20కి నారపురెడ్డికి ఫోన్ చేసిన ఎస్పీ, మీరు పట్టుకున్న వ్యక్తిని నంద్యాల 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని సూచించారు. అందుకు నారపురెడ్డి ఒప్పుకోకపోవడంతో, చివరకు ఎస్పీ ఆఫీస్ నుంచి పోలీసులు వచ్చి, ఆ వ్యక్తిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఇవే నా సూటి ప్రశ్నలు: – గ్రామంలో అవాంఛనీయ ఘటన జరగబోతోందని పోలీసులకు ఫోన్ చేస్తే, ఎస్‌ఐ వచ్చాడు. ఇక్కడి పరిస్థితిని ఎస్‌ఐ స్వయంగా చూసిన తర్వాత కూడా గ్రామానికి అదనపు బలగాలు రాలేదు?. – ఎస్‌ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ, కత్తులతో మనిషిని నరికి చంపి, ఇంకొందరిపై దాడి చేసిన దుండగులు, తాపీగా గ్రామం విడిచి వెళ్లిపోయే వరకు కూడా, వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు రాలేదు?. –దీని వెనక ఎవరి ప్రోద్భలం ఉంది. ఎవరు పోలీసులను ఆడిస్తున్నారు?. – ఎస్పీ, డిఎస్పీ, సీఐ ఎవ్వరూ సకాలంలో ఎందుకు స్పందించలేదు?. అదనపు బలగాలు పంపలేదు?. ఇది నిదర్శనం కాదా?: పకడ్బందీగా మనిషిని చంపి, తాపీగా ఊరు విడిచిపోయే పరిస్థితి సృష్టించి, అప్పటికీ పోలీసులు రాలేదంటే.. ఏ స్థాయిలో కుట్ర జరుగుతోంది? ఏ స్థాయిలో పోలీసులు, నాయకులు కూడబలుక్కుని పని చేస్తున్నారని, ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం కాదా? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని అడుగుతున్నాను. ప్రతి సంఘటన ఇలాగే..: రాష్ట్రంలో కేవలం ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు. రాష్ట్రంలో ప్రతి ఘటన ఇలాగే ఉంది. మొన్న వినుకొండ వెళ్లాను. అక్కడ రషీద్ అనే యువకుణ్ని నడిరోడ్డు మీద నరికి పంచారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి. 30కి పైగా హత్యలు జరిగాయి. ఇదే శ్రీశైలం నియోజకవర్గంలో దాసు అనే వ్యక్తిని దారుణంగా చంపారు. ఆయన కొడుకు వచ్చి, తన బాధ చెప్పుకున్నాడు. జూన్ 26న, పట్టపగలు తన తండ్రిని చంపారంటూ.. ఫోటోలు కూడా చూపాడు. ఆ బాబు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. దాంతోనే ఘటనలు ఆగిపోవు: ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. చంపేస్తారు. భయానక వాతావరణం సృష్టిస్తారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వస్తే, చిన్న చిన్న మనుషుల దగ్గరే ఆ కేసు ఆపేస్తున్నారు. అలా చేస్తే, ఇలాంటి ఘటనలు ఆగిపోతాయా?. హత్య చేసింది ఎవ్వరు? చేయించింది ఎవరు?. ఆ ఎమ్మెల్యేల పేర్లు కేసుల్లోకి ఎందుకు రావడం లేదు?. వారిని ముద్దాయిలుగా చేర్చడం లేదు?. ఎప్పుడైతే వారిని కూడా చేర్చడం మొదలుపెడుతామో.. ఇలాంటి ఘటనలు తగ్గుతాయి. హైకోర్టును ఆశ్రయిస్తాం: ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి, కాల్ రికార్డ్ చూస్తే.. హత్యకు ముందు, ఆ తర్వాత ఎవరెవరికి ఫోన్ చేశాడో చూసి, వారిని బొక్కలో పెడితే, అన్నీ చక్కబడతాయి కదా?. కానీ ఎందుకు పెట్టలేకపోతున్నారు? కేసులు వారి దాకా ఎందుకు పోనివ్వడం లేదు? రాష్ట్రంలో అంతటా ఇదే పరిస్థితి. వినుకొండలోనూ జరిగింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. నేను ఒకటే చెబుతున్నా. ఈ ఘటనను కచ్చితంగా హైకోర్టులో వేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. గ్రామంలో ఏజెంట్లుగా కూర్చున్న వారందరికీ పోలీసులతో భద్రత కల్పించడం కోసం కోర్టుల ద్వారా ప్రయత్నిస్తాం. ఉత్తర్వులు వచ్చేలా చూస్తాం. ఇదే మా డిమాండ్: ఆ ఉత్తర్వులు వస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది. అంతే కాకుండా, హత్య చేసిన వారిపైనే కాదు.. హత్య చేయించిన వారిపైనా కేసులు పెట్టాలి. ముద్దాయిలుగా చేర్చాలి. జైల్లో పెట్టాలి. ఇదే మా డిమాండ్. ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో అరాచకాలు ఆగిపోతాయి. సభలో ఈ ఎమ్మెల్యే ఏమన్నాడు!: ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆత్మకూరులో విజయోత్సవ సభలో ఏం మాట్లాడారో వినండి అంటూ.. ఆ వీడియో ప్రదర్శించారు. ఒక్కసారి ఎమ్మెల్యే ఏమన్నారో వినండి. నేను అడుగుతున్నా. ఇది వైరల్ అవుతోంది. ఆ ఎమ్మెల్యే ఏమంటున్నాడో విన్నారా? ‘మీరు దాడులు చేయండి. చంపండి. మండలానికి కనీసం ఇద్దరిని చంపండి. పోలీసులను, కేసులను నేను చూసుకుంటాను అంటున్నారు’. కేసు ఎందుకు పెట్టరు?: నేను అడుగుతున్నా. ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగ్‌ల్లోనే మాట్లాడుతుంటే, కేసులు ఎందుకు పెట్టడం లేదు? దీన్ని పోలీసులను అడుగుతున్నాను. అందుకే చంపిన వారే కాకుండా, చంపించిన వారి మీద కూడా కేసులు పెట్టి, వారిని కూడా జైలుకే పంపిస్తేనే, రాష్ట్రంలో పరిస్థితి మెరుగు పడుతుంది. అప్పుడే లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ఇప్పటికైనా మేలుకోండి: నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేతులు దాటి పోయే పరిస్థితి రాకముందే మేలుకోండి. అందుకే ఎడ్యుకేట్ చేయాలి. అవేర్‌నెస్ పెంచాలి. అలాగే దీన్ని ఆపాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించమని కోరుతున్నాను. జరుగుతున్న ఈ అన్యాయం మీద అందరం కలిసి పోరాడుదాం. ప్రతి మీడియా ఛానల్‌ను నేను కోరుతున్నాను. ఇవన్నీ ప్లే చేయండి. చంపిన వారినే కాదు. చంపించిన వారిని కూడా హైలైట్ చేయండి. అప్పుడు కానీ..: ఇంకా.. చంపించిన వారికి మద్దతు ఇస్తున్న నారా లోకేష్, చంద్రబాబునాయుడిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రతకదు.