బాబు..ఎల్లో మీడియా రోజుకో కుట్ర

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి

చంద్రబాబుతోనే కాదు..ఎల్లోమీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం

ఎన్నికలు వస్తే పేదలు, బీసీలపై చంద్రబాబు ప్రేమ చూపిస్తారు

ఎన్ని లక్షలు ఖర్చైనా పేద విద్యార్థులను చదివిస్తాం

చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దు

పశ్చిమ గోదావరి: చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి రోజుకో పుకారుతో కుట్రలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు గ్రామాలకు మూటలు మూటలు డబ్బు పంపుతున్నారని, చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దని సూచించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ఆలోచన చేయాలని కోరారు.  చంద్రబాబు పాలనపై చర్చ జరగకుండా చూస్తున్నారు. ప్రతి రోజు పుకార్లు సృష్టిస్తున్నారు.. కట్టుకథలు అల్లుతున్నారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తున్నారు.  ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ కూళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. అప్పుడే రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత వస్తాయి. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి.  మనం యుధ్దం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఒక్కడితోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9లతో కూడా.  గత ఇరవై రోజులుగా చంద్రబాబు నాయుడు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఎల్లో మీడియా ఒక్క అబద్దం చెప్పి అది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  

‘నా సుదీర్ఘ పాదయాత్ర ఏలూరు గుండా కూడా సాగింది. ఆ సమయంలో మీరు చెప్పిన సమస్యలు నాకు గుర్తున్నాయి. ఏలూరు వన్‌ టౌన్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు 17 కోట్ల రూపాయలు కేటాయించారు. పనులు కూడా ప్రారంభించారు. పట్టణంలో ముంపు ప్రాంతాన్ని నివారించడానికి 30 కోట్ల రూపాయలతో సగం పనులను పూర్తిచేశారు. తీరా రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తరువాత ఆ పనులను ఎవరు పట్టించుకోలేదు. వర్షం పడితే ఈ ప్రాంతం మునిగిపోతుందని తెలిసినా కూడా.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెండింగ్‌ పనులను పూర్తిచేయలేదు. వైఎస్సార్‌ కేవలం ఈ నియోజకవర్గంలోనే 12 వేల ఇళ్లు కట్టించారు. కానీ ఈ రోజు పేదల కోసం ఇళ్లు కట్టాల్సింది పోయి.. వారికిచ్చే ఫ్లాట్లలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు.

మూడు లక్షల రూపాయలు కూడా విలువ చేయని ఫ్లాట్‌లను 6 లక్షల రూపాయలకు పేదవారికి అమ్ముతున్నారు. అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు.  లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా?. చంద్రబాబు ఇచ్చిన ఫ్లాటులను తీసుకున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3లక్షల రూపాయలను మాఫీ చేస్తాం.

 ఎన్నికలప్పుడు మాత్రమే బాబుకు బీసీలపై ప్రేమ
చంద్రబాబు పాలనలో ఎవరికి మేలు జరిగిందో ఆలోచన చేయండి. ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు పేదలపై, బీసీలపై ప్రేమ పుడుతుంది. నేడు రాష్ట్రంలో పిల్లలను అప్పు చేయకుండా చదివించే పరిస్థితి లేదు. చంద్రబాబు పాలనలో మోసాన్ని మాత్రమే చూస్తున్నాం. టీడీపీ 2014 ఎన్నికల మేనిఫేస్టోలో ఒక్కో కులానికి ఒక పేజీ కేటాయించారు. అధికారంలో వచ్చాక ప్రతి కులాన్ని మోసం చేశారు. టీడీపీ మేనిఫెస్టోలోని ఒక పేజీని మాత్రమే చదువుతున్నాను..

ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి..
ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. నాలుగు రోజులు ఓపిక పట్టమని చెప్పండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అమ్మ ఒడి కింద అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఎంత పెద్ద  చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. ఎంత పెద్ద చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 

జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. రాజన్న పాలనలో మాదిరి మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే అది జగనన్నతోనే సాధ్యం అని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని రైతన్నను అడగండి. రుణమాఫీ కనీసం వడ్డీలకైనా వచ్చిందా అని రైతన్నను అడగండి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. మీ మనువడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి. పింఛన్‌ మూడు వేలకు పెంచుకుంటూ పొతారని ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి. నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పిండి.  వరత్నాలతో ప్రతి పేదవారి ముఖంలో నవ్వు చూస్తారు. నవరత్నాలను ప్రతి ఇంటి వద్దకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నాన’ని తెలిపారు.  ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణా శ్రీనివాసరావు(ఆళ్ల నాని), ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌లను గెలిపించమని కోరారు.

 

 

Back to Top