తాడేపల్లి: అక్కా చెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాధి, తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యంగా జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక వనరులు పెరగాలని అనేక పథకాలు తెచ్చామని సీఎం తెలిపారు. వ్యవసాయంతో పాటు పశువులపై వచ్చే ఆదాయం కూడా ముఖ్యమే అన్నారు. వైయస్ఆర్ చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ.5,400 కోట్లు అక్కా చెల్లెమ్మలకు అందిస్తున్నామని వైయస్ జగన్ పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ రోజు జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభిస్తున్నాం. ఈ పథకం కూడా అత్యంత సంతృప్తి ఇచ్చేకార్యక్రమం. వ్యవసాయంతో పాటు పశువులు, గొర్రెలు, కోళ్లను కూడా పెంచగలిగితే..కరువు, కాటకాలు వచ్చినా..రైతులను ఇవి ఆదుకుంటాయి. ఒక నికర ఆదాయం వస్తుంది. నికర ఆదాయం వస్తే వారి జీవితాలు బాగుపడుతాయి. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదు. చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆవులు, గేదెల పంపిణీ 4.69 లక్షల యూనిట్లు పంపిణీ కార్యక్రమానికి వారం క్రితం శ్రీకారం చుట్టాం. ఈ రోజు ప్రారంభిస్తున్నది అలాంటి కార్యక్రమమే. మేకలు, గొర్రెలు 2.49 లక్షల యూనిట్లు అంటే 14 ఆడ, ఒక మగ మేక, పొట్టేలు యూనిట్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే..గ్రామీణ ప్రాంతాల్లో మనం ఇచ్చే వైయస్ఆర్ చేయూత, ఆసరా పథకాల డబ్బులు ఉపయోగకరంగా ఉండేందుకు ఇలాంటి యూనిట్ల ద్వారా వ్యాపారం చూపించగలిగితే..అదే గ్రామాల్లో వారి కాళ్ల మీద వారు నిలబడే అవకాశం ఉంటుంది. డబ్బులు ఇవ్వడమే కాకుండా..ఆ డబ్బులు సరైన పద్ధతిలో ఉపయోగపడేలా చేస్తే..వారి ఆదాయం పెరుగుతుంది. అక్కా చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఒక కుటుంబ సభ్యుడిగా అడుగులు ముందుకు వేస్తున్నాను. ఈ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. దాదాపుగా రూ.1869 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేస్తున్నాం. గత వారంలో రూ.300 కోట్లు ఖర్చు చేశాం. ఆర్థికంగానూ, సామాజికంగానూ, రాజకీయంగా మహిళల్లో వెలుగులు తెచ్చేందుకు మన ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో అడుగులు వేస్తోంది. అమ్మ ఒడి, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, సున్నా వడ్డీ పథకం, సంపూర్ణ పోషణ పథకం, విద్యా దివేన, వసతి దీవెన, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తూ చట్టాలు కూడా చేశాం. దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నాం. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం, మహిళలకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. ఈ రోజు ప్రారంభించే కార్యక్రమం కూడా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని నమ్ముతున్నాను. మళ్లీ విడతల వారీగా ఆవులు, గేదెలు, మేకలు,గొర్రెలు పంపిణీ చేస్తాం. ఈ రకంగా 4.69 లక్ష యూనిట్లు పంపిణీ చేస్తాం. మొదటి విడత 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడత 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడత 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99,000 యూనిట్లు.. మొత్తం మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఇవన్నీ కూడా చేయూత డబ్బులు ఇచ్చాం, ఈ డబ్బులతో వారితో పెట్టుబడి పెట్టించి రిలయన్స్, ఐటీసీ, అమూల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. మార్కెటింగ్‌లో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అక్కా చెల్లెమ్మలకు ఎక్కడా కూడా నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మేకలు, గొర్రెలు కావాలనే వారికి ఈ రోజు పంపిణీ చేస్తున్నాం. ఆప్షన్ ఇచ్చిన వారు తమకు నచ్చిన ప్రాంతం నుంచి కొనుగోలు చేసేలా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాం. మండల స్థాయి కొనుగోలు కమిటీలు లబ్ధిదారులకు అండగా ఉంటాయి. ఇద్దరూ పశువైద్యులు, సెర్ఫ్ అధికారులు పరిశీలించి, మంచి పశువులను పంపిణీ చేయిస్తారు. మేకలు, గొర్రెలు ఎక్కడ ఉన్నాయో కూడా ఈ కమిటీలు తోడుగా ఉంటాయి. ఆర్‌బీకే పరిధిలోని రైతులకు వ్యవసాయరంగంతో పాటు పశువుల పెంపకంలో కూడా తోడుగా ఉంటాయి. ఆర్‌బీకేల పరిధిలోనే నట్టల నివారణ, వ్యాధి నివారణ టీకాలు, బాహ్య పరాన్న జీవులు వంటివన్నీ కూడా ఉంటాయి. వైయస్ఆర్ సన్న జీవుల నష్ట పరిహారం పథకాలు, ఇన్సూరెన్స్ కూడా ఆర్‌బీకే పరిధిలోకి తెస్తున్నాం. పశు కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కూడా ఈ ఆర్‌బీకే పరిధలోనే ఉంటాయి. గొర్రెల, మేకలు, ఆవుల పెంపకందారులకు పశు పోషణపై ఆర్‌బీకేలో శిక్షణ ఇస్తారు. కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకందారులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఇవీ కూడా త్వరలోనే ర్రారంభమవుతాయి. ఆర్‌బీకేలు పశువుల విషయంలో ఎలాంటి నష్టం రాకుండా తోడుగా ఉంటాయి. అక్కాచెల్లెమ్మలకు పెంచిగ గొర్రెలు, మేకలు అమ్ముకునేలా మార్కెంటింగ్ సౌకర్యం తెస్తున్నాం. అలానా ఫుడ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వారికే అమ్ముకోవాలనే నిబంధన కూడా లేదు. మీకు నచ్చిన వారికి అమ్ముకోవచ్చు. అలానా ఫుడ్ సంస్థ ఈస్ట్ గోదావరి, కర్నూలు జిల్లాలో మాంసం షాపులు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయానికి, పాడి రైతుకు, పశువుల పెంపకందారులకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. రైతు, రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇళ్లు, ఇళ్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. అన్ని రకాలుగా అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూసేందుకు మన ప్రభుత్వం అహర్నశలు కృషి చేస్తుందని మరొక్కసారి అక్కాచెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందని మరొక్కసారి భరోసా ఇస్తుందని, ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.