‘జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌’ ఆవిష్కరించిన వైయస్‌ జగన్ 

 ప్రతి కార్యకర్తను పార్టీతో నేరుగా అనుసంధానించే డిజిటల్‌ వేదిక 

 కార్యకర్తల గొంతును ఎవరూ అణచలేరు.. పార్టీకి సొంత ప్లాట్‌ఫామ్‌గా ‘జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌’: వైయస్‌ జగన్ 

తాడేపల్లి: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ, సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ‘జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌’ను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, సోషల్‌ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్‌ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీకి సొంతంగా ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ‘జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌’ ద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలడని, ఎలాంటి బాహ్య జోక్యం లేకుండా పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామి కావచ్చని చెప్పారు.

పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపై అనుసంధానించే విధంగా ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు. నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి సమావేశం, ప్రెస్‌మీట్‌, ముఖ్యమైన కార్యక్రమం, పార్టీ ప్రకటనలను లైవ్‌ ఫీడ్‌ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసు వేధింపులు లేదా పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా ఈ యాప్‌ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. భవిష్యత్తులో యాప్‌ను మరింత విస్తృతంగా అభివృద్ధి చేసి, కార్యకర్తల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

పోలీసు వేధింపులు, రాజకీయ వేధింపులకు సంబంధించిన వివరాలను నమోదు చేయడానికి పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్‌ డైరీని కూడా ఈ సూపర్‌యాప్‌తో అనుసంధానిస్తున్నామని వైయస్‌ జగన్‌ వెల్లడించారు. దీంతో కార్యకర్తలు తమ సమస్యలను, ఫిర్యాదులను నేరుగా యాప్‌లో నమోదు చేయగలరని, వాటిపై పార్టీ వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో పార్టీపై జరుగుతున్న అనుచిత ప్రచారం, అసత్య పోస్టులు, వీడియోలపై చట్టబద్ధంగా స్పందించే చర్యలు కొనసాగుతూనే ఉంటాయని, అదే సమయంలో ఎవరూ అడ్డుకోలేని విధంగా వైయస్ఆర్‌సీపీకి సొంత డిజిటల్‌ వేదికగా ‘జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌’ పనిచేస్తుందని శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ప్రతి కార్యకర్త పార్టీ నాయకత్వంతో నిత్యం అనుసంధానమై ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనే అవకాశం కలుగుతుందని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
 

Back to Top