సీఈసీ, ఎస్‌ఈసీ నియామక విధానాల్లో సంస్కరణలు రావాలి

మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌

సీజేఐ, ప్రతిపక్ష నేత, ప్రధాని భాగస్వామ్యంతో సీఈసీ ఎంపిక జరగాలి 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకంలోనూ ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి పలకాలి

తాడేపల్లి: కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల నియామక విధానాల్లో సమూల మార్పులు రావాలని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఈసీ నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి భాగస్వాములుగా ఉండాలని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎంపికలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆదివారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాత విధానాలు అవసరమని పేర్కొన్నారు.

2024 ఎన్నికల ఫలితాలపై తాను గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేశానని, వ్యవస్థల్లో మార్పులు రాకపోతే సమస్యలకు పరిష్కారం లభించదని జగన్‌ అన్నారు. ఎన్నికల సంఘాల నియామకాలను ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదని, గతంలో ఈ విధానాన్ని సమర్థించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నామని తెలిపారు. విద్యార్థులే తమ పరీక్షకుడిని నియమించుకున్నట్లుగా ఈ విధానం ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ నియామకంపైనా జగన్‌ విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునేఠ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆయన నియామకం, విధుల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పునేఠ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సంఘాలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేసేలా నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని జగన్‌ కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, స్వతంత్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. 

Back to Top