మందా సాల్మన్ కుటుంబానికి వైయస్‌ జగన్ భరోసా

తాడేపల్లి: ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్‌ టీడీపీ గూండాల చేతిలో కిరాతకంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాల్మన్‌ కుమారులు మరియదాసు, భిక్షం (ప్రవీణ్‌), కుమార్తె రాహేలు, అలాగే పిన్నెల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడును వెల్లగక్కారు.

సాల్మన్‌ కుమారులు, కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైయస్‌ జగన్‌కు వివరించారు. తమ తండ్రి మరణంతో కుటుంబం రోడ్డున పడిందని, జీవనాధారం కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యారు. పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు, వారి అండతో పోలీసులు తమను ఎలా బెదిరించారో, అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించారో కూడా వారు వివరించారు.

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ స్పందిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ క్యాడర్‌లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయ సహాయం పూర్తిగా అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్థలను దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ గూండాగిరి, రాజకీయ ప్రతీకార చర్యలను ప్రజల ముందు బట్టబయలు చేస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌ రెడ్డి, స్థానిక నాయకులు, పార్టీ లీగల్ సెల్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Back to Top