బాపూజీ స్ఫూర్తి.. ప్రగతి దీప్తి

ఉద్యమంలా ఇంటి ముంగిటకే సంక్షేమం

మహాత్ముడి ఆలోచనలకు నిలువుటద్దంలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

గాంధీజీకి గొప్ప నివాళి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ 

స్ఫూర్తిదాయకంగా పని చేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులు

కరోనా కాలంలోనూ ఆగని వలంటీర్ల సేవలు

కేంద్రం నుంచి కితాబందుకొని ఆదర్శంగా నిలుస్తున్న వ్యవస్థ

గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు అంకురార్పణ చేసి నేటితో ఏడాది

భారతీయ ఆత్మ గ్రామాల్లోనే వుంది.. గ్రామస్వరాజ్యం.. దేశ సౌభాగ్యం అని మహాత్ముడు స్ఫూర్తి నింపాడు. ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో గట్టి ముందడుగు పడింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి గడప వద్దకే పాలన తెచ్చారు.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ‘‘పరిపాలన ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలనే తపన, ఆరాటంతో దేశంలోనే కాదు.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం’’ అని సరిగ్గా సంవత్సరం క్రితం తూర్పు గోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాలను ప్రారంభించే రోజు సీఎం వైయస్‌ జగన్‌ చెప్పిన మాటలివి.. అనుకున్నట్లుగానే ఆచరణలో పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి చూపించారు. కేంద్ర మంత్రుల నుంచి ప్రధాని దాకా ఈ వ్యవస్థను ప్రశంసిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయం అంటున్నారు. 

ఉద్యోగం కాదు ఉద్యమం. ఇంటి ముంగిటకే సంక్షేమం. గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు, గ్రామ సెక్రెటరీలు వందల సేవలు అందిస్తున్న ఏంజెల్స్‌. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో సువ్యవస్థ.. సీఎం వైయస్‌ జగన్‌ దార్శనికతకు చిరునామా. ఏడాది కాలం పూర్తి చేసుకున్న ‘ప్రజల వద్దకు పాలన’పై స్పెషల్‌ స్టోరీ..

కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా..  
తెల్లారక ముందే ఇంటి గడపకు చేరే పెన్షన్లు. అవ్వా, తాతలు, దివ్యాంగులు ఇలా లబ్ధిదారుల మొహాల్లో పూచే వెలుగు పూలు. ఇదంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కన్న కల. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వైయస్‌ జగన్‌ కులం, మతం వర్గం రాజకీయల పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు సులభంగా అందించే ఉద్దేశంతో వార్డు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిక అనుసంధానంగ వుండే వలంటీర్లు తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరింప చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

ఆ కష్టాన్ని ఇష్టంగా భుజానికెత్తుకున్నారు..
చరిత్రాత్మకమైన తన సుదీర్ఘ పాదయాత్రలో వైయస్‌ జగన్‌ గమనించిన ప్రజల కష్టాలకు పరిష్కారంగా సంజీవనిలాంటి వ్యవస్థ ఏర్పడింది. ఒక వ్యవస్థను సృష్టించడం ఎంత కష్టమో.. ఆ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసేలా చూడటం కూడా అంతే కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజానికెత్తుకున్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఉద్యోగంలా కాదు ఉద్యమంలా చేయండి అని ఆయన చెప్పిన మాటలను మనసారా ఒంటపట్టించుకున్న వలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిజంగా ఒక ఉద్యమంలానే పని చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

ప్రజా ప్రేమికుడికే సాధ్యమైన విషయమిది..
‘‘మీ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. సమర్థమైన పాలనకు మీ పని తీరే కొలబద్ద కావాలి. మీకు వచ్చింది ఉద్యోగం మాత్రమే కాదు...స్వంత గ్రామంలో, స్వంత ప్రాంతంలో ప్రజలకు సేవలందించే అదృష్టం కూడా...’’ 2019 అక్టోబర్‌ 2న గ్రామ వార్డు సచివాలయాలకు ఎంపికైవారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నమాటలివి. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్ల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ పార్టీ భేదాలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దాదాపు 4 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటయిన వ్యవస్థ ఇది. నిజం చెప్పాలంటే అనితర సాధ్యమైనది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా.. ప్రజల కోసం ముందడుగు వేసే సాహసికుడికే...ప్రజా ప్రేమికుడికే సాధ్యమైన విషయమిది. 

గుండెల నిండా జనం అజెండా
గుండెల నిండా జనం అజెండా పెట్టుకున్న సంక్షేమ సంతకం వైయస్‌ జగన్‌. గతంలో పడ్డ కష్టాలు లేవు. ఆపసోపాలు పడాల్సిన పని లేదు. కాళ్లరిగేలా తిరగాల్సిన అవస్థా లేదు. అర్హతలున్న అందరికీ పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఆరోగ్య సేవలు...ఇలా వందల సేవలు అందుతున్నాయి. గడప వద్దకే పాలన అన్న గట్టి మేలు పేద జనం గుండెకు పెద్ద భరోసానిస్తోంది. గొప్ప పనికి శ్రీకారం చుట్టిన ముహూర్త బలం మహాగట్టిది. కేవలం రోజుల వ్యవధిలో... గంటల వ్యవధిలో అర్హులైన వారికి రేషన్‌ కార్డులు అందుతున్న వాస్తవికాలను చూస్తున్నాం. 

నడిపించే నాయకుడు వెంటే ఉన్నాడన్న నమ్మకం..
మండుటెండా కాలంలోనూ....వాగులు వంకలు వదరలై పారుతున్న కాలంలోనూ వలంటీర్ల సేవలు కొనసాగుతూనేవున్నాయి. లబ్ధిదారులు ఎక్కడ వున్నా సరే ఠంచన్‌గా సేవలందిస్తున్నారు. కరోనా కాలంలోనూ ఆగని వలంటీర్ల సేవలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలు ఆ వ్యవస్థ గొప్పదనాన్ని చాటుతున్నాయి. నడిపించే నాయకుడు తమ వెంటే వున్నాడన్న నమ్మకం వారిని కదలిస్తోంది. ఆ అడుగులు అవ్వాతాతలకోసం దివ్యాంగుల కోసం...అర్హతలున్న అవసరార్ధలకోసం. ఇది కదా ప్రజల కోసం...ప్రజల చేత...ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలు చేయాల్సిన పని. 

అది కాదనలేని సత్యం..
గ్రామ వ్యవస్థలు పటిష్టమయ్యాయి. గ్రామీణ జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. సంక్షేమ పథకాలు ఇంటిముంగిటకే వస్తున్నాయి. అర్హులైన అవసరార్థులకు ఓ పెద్దన్నలా సీఎం తోడు నీడయిన వైనాలు ఎన్నెన్నో. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలల్లోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నది కాదనలేని సత్యం. 

ఆ ప్రజలకు ఓ భరోసాగా నిలబడడమే తన ధ్యేయం..
నాడు పాదయాత్రలో పల్లె పల్లెలోనూ అక్కలు, చెల్లెళ్లు అన్నలు, తమ్ముళ్లు అవ్వలూ, తాతలు ... ఎండా వానా చలి వున్న తేడా లేకుండా వైయస్‌ జగన్‌ను చూడటానికి ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్ల కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, అనుభూతులు, ఆప్యాయతలతో వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. ఆ ప్రజలకు ఓ భరోసాగా నిలబడడమే తన ధ్యేయం అనుకున్నారు ఆయన. ప్రజల నమ్మకానికి సాక్షిగా ఎన్నికల ఫలితాలొచ్చాయి. మరి వారి కోసం ...ఆ రుణం తీర్చుకోవడం కోసమే అస్తవ్యస్థమైన ఆర్ధిక పరిస్థితి వారసత్వం అందివచ్చినా... రాజీ పడకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ పోతున్నారు. 

పల్లెలిప్పుడు ఆశావహంగా ఉన్నాయి..
గాంధీజీ పుట్టిన రోజున ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిజంగా మహాత్ముడికి గొప్ప నివాళి. ఈ వ్యవస్థ ఏడాది కాలం పూర్తి చేసుకుంది. మొదటి సంవత్సరమే ఆ వ్యవస్థ గొప్పదనమేదో చాటింది. కోట్ల జనం ఎదురు చూపులకు ఎదురొచ్చిన జవాబులా పని చేస్తోంది. గ్రామ స్వరాజ్యం గాంధీజీ కల. అది సుసాధ్యం చేయాలన్నది జగనన్న ధ్యేయం. ఆ కార్యాచరణలో పట్ట మొదటి మెట్టు గ్రామ, వార్డు సచివాలయాలు. వీటితోపాటు రైతు సంక్షేమానికి మరెన్నో బృహత్తర పథకాలు. పల్లెలిప్పుడు ఆశావహంగా వున్నాయి. భవిష్యత్తు భరోసాతో ధీమాగా వున్నాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతున్న పాలనా కాలమిది. వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాలనా కాలమిది.  

Back to Top