కృష్ణా: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ నగరంలోని భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో కలిసి తమ గోడును చెప్పుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బాధితులకు అండగా ఉంటానని వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చర్యల కారణంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. బలవంతంగా 42 ఇళ్లు నేలమట్టం చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజినగర్‌లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసింది. రూపాయి రూపాయి కూడబెట్టుకొని, స్థలం కొని ఇళ్లు కట్టుకొన్న పేదల జీవితాలను రోడ్డు పాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మెనేజ్ చేశారు. చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్‌లో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదలను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు భాదితులు బహిరంగానే విమర్శిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం కోసమే! విజయవాడ నడిబొడ్డున జోజినగర్‌లో ఉన్న ఈ భూమి రూ.కోట్లు విలువ చేస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒకరికి అగ్రిమెంటు చేశారు. వారు స్పందించక పోవడంతో 1980 ప్రాంతంలో స్థల యజమాని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణ కోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురి చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే స్థలం తొలుత అగ్రిమెంటు చేసుకున్న వ్యక్తి నుంచి పొందిన కాగితాల సాయంతో పచ్చనేతలు దొడ్డిదారిన ఓ సొసైటీని ఏర్పాటు చేసి, వారికి అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రం తిప్పారు. కోర్టు ద్వారా స్థలాన్ని కాజేయడానికి తీవ్ర యత్నం చేసి సఫలీకృతులయ్యారు. బహుళ అంతస్తుల నిర్మాణానికి బెంగళూరుకు చెందిన బడా వ్యక్తులు, చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్‌లో బుల్డోజర్లతో కూల్చివేతలకు ఒడిగట్టారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఒకవేళ తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైనా, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలను వారు ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు బాధితులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కూల్చివేతలపై స్టే ఉందని, తాము ఖాళీ చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఉందని చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, శ్రీలక్ష్మి రామ కో–ఆపరేటివ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమ సమస్యను వివరిస్తే న్యాయం చేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఇళ్లను పరిశీలించిన వైయస్ఆర్‌సీపీ నేతలు విజయవాడ భవానిపురంలో కూల్చివేసిన 42 ప్లాట్స్ ను వైయస్ఆర్‌సీపీ నేతలు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రి, వెస్ట్ ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ,సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి బాధితులనను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఆవేదనను వైయస్ఆర్‌సీపీ నేతలు దృష్టికి తీసుకొచ్చారు.