న్యూఢిల్లీ: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయాన్ని వెంటనే ఆమోదించాలని వైయస్ఆర్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు. సవరించిన అంచనా వ్యయానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో పాటు రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదం తెలిపినా ఆ మేరకు నిధుల విడుదలకు ఆమోదం తెలపడంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని సవరించిన అంచనాలకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరారు. రాజ్యసభలో గురువారం ఆనకట్ట భద్రతా బిల్లు (డ్యామ్ సేఫ్టీ బిల్)పై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఆనకట్టల భద్రతపై జాతీయ విధానం ఉండాలని ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏనాడో గుర్తించారని, ఆనకట్టల భద్రతపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని కోరుతూ 2007లో అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కూడా ఆ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. భారీ ఆనకట్టల జాతీయ రిజిస్టర్ ప్రకారం దేశంలోని 5,745 పెద్ద ఆనకట్టల్లో 75 శాతం 20 ఏళ్లు పైబడినవేనని తెలిపారు. ఏపీలో 170 ఏళ్ల ధవళేశ్వరం బ్యారేజ్, 165 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్, 112 ఏళ్ల తోటపల్లి బ్యారేజ్, 101 ఏళ్ల సిద్దాపురం ట్యాంక్ ఉన్నాయని వివరించారు. ఇలాంటి పురాతనమైన ఆనకట్టల భద్రతను పటిష్టం చేయడం ఎంతైనా అవసరమన్నారు. ఇందుకోసం ప్రతి ఆనకట్ట వద్ద భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎగువ రాష్ట్రాల దౌర్జన్యాలు, జలచౌర్యం వంటి చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ వంటి దిగువ రాష్ట్రాల హక్కులకు తరచు తీవ్ర విఘాతం ఏర్పడుతోందని చెప్పారు. జలవివాదాల పరిష్కారానికి పటిష్టమైన, శక్తిమంతమైన పరిష్కార యంత్రాంగం లేకపోతే ఆంధ్రప్రదేశ్ వంటి దిగువ ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గుండ్లకమ్మ రిజర్వాయర్, పంపా, పాడేరు, గోదావరి బ్యారేజ్, మిడ్ పెన్నార్ (ఒకటో దశ), సోమశిల, శ్రీశైలం, వెలుగోడుతోపాటు మొత్తం 31 డ్యాంలను కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద చేపట్టి రూ.776 కోట్లతో అభివృద్ధి చేయాలని కోరారు. బిల్లుకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనాభా లెక్కల్లో బీసీల గణన చేపట్టాలి జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల గణన కూడా చేపట్టాలని వైయస్ఆర్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశంపై మాట్లాడారు. వెనుకబడిన కులాల సంక్షేమ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా రూపకల్పన చేయడానికి బీసీ కులాల వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. 1872 నుంచి 1931 వరకు దాదాపు ఆరు దశాబ్దాలపాటు దేశంలో నిర్వహించిన జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల ఆర్థిక, సామాజిక లెక్కలు కూడా ఉండేవని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం జనాభా లెక్కల సేకరణలో ఎస్సీ, ఎస్టీ కులాలకు తప్ప వెనుకబడిన కులాల లెక్కల సేకరణ జరపలేదన్నారు. దేశంలో భారీసంఖ్యలో ఉన్న వెనుకబడిన కులాల జనాభాకు సంబంధించిన కచ్చితమైన వివరాలేవీ అందుబాటులో లేవని చెప్పారు. ఫలితంగా అనేకమంది అనర్హులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నారని, దీనివల్ల బీసీల్లో అర్హులైన నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. 2021లో చేపట్టాల్సినన జనాభా లెక్కల సేకరణలో బీసీ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని తెలిపే కులగణనను చేర్చాలని కోరారు. బీసీ కులాల గణనను చేపట్టడం వలన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం విద్యాసంస్థలు, ప్రభుత్వరంగంలో వెనుకబడిన కులాలకు కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. జనాభా లెక్కల సేకరణతోపాటు బీసీ కులాల గణనను కూడా చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందని తెలిపారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల గణనను చేపడితే అందుకు అవసరమైన మానవనరులను సమకూర్చడంతోపాటు అన్ని విధాలా సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రసాద్ పథకంలో రూ.43.08 కోట్లతో శ్రీశైలం ఆలయ అభివృద్ధి తిరుపతిలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌కు రూ.10 కోట్లు, ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.97.49 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అభ్యర్థనను స్వీకరించిన తరువాత కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖలోని ప్రసాద్ పథకం కింద శ్రీశైలం ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును రూ.47.45 కోట్ల అంచనా వ్యయంతో 2017లో ఆమోదించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2021లో రూ.43.08 కోట్ల తుది నిర్వాహణ వ్యయంతో పూర్తయిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చెల్లింపులను విడుదల చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 7 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో 7 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు పనిచేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో 4, ఎన్జీవోల్లో 3 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు పనిచేస్తున్నట్లు చెప్పారు.