నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లో అమరావతి నిర్మాణాలకు మించి అవినీతి జరుగుతోందని, మొక్కుబడిగా మొక్కులు నాటి ఏకంగా రూ.60 కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నగరంలో మొక్కల నాటే కార్యక్రమం పేరుతో అమరావతిని మించిన భారీ దోపిడీకి మంత్రి నారాయణ వ్యూహ రచన చేశారని ఆయన తెలిపారు. నేరుగా ప్రజలకు ఉపయోగపడని పనులతో యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు కేవలం రూ.350 వాటర్‌బిల్లు చెల్లించకపోయినా, పేదల ఇళ్లకు వాటర్ పైపులు కట్ చేసి డమ్మీలు బిగించారని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..: నెల్లూరు నగరాన్ని దోచేస్తున్న నారాయణ ‘ఎన్’ టీమ్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరులో విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారాయణ ఏర్పాటు చేసుకున్న ‘ఎన్’ టీమ్ నెల్లూరు నగరాన్ని దోచుకు తింటోంది. అవినీతి అనేది ఆనవాయితీగా మార్చేశారు. ఉపయోగం లేని పనులతో ప్రజల సొమ్మును బిల్లులుగా దోచుకుంటున్నారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు, పెయింటింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, బయో టాయ్‌లెట్, చెత్తను తరలించే ట్రాక్టర్లు, సిల్ట్ క్లీనింగ్, దోమల నివారణ, ఎండ్ టు ఎండ్ రోడ్.. అన్నింటిలో వందల కోట్ల పనులు. అన్నీ నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్కులు. ఇలా ఏది చూసినా అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్, వీఆర్ కాలేజీ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. నాడు ఒక్కో మొక్కకు రూ.750. నేడు రూ.12 వేలు!: నెల్లూరులో 48 వేల మొక్కలు నాటడడంతో పాటు, వాటికి ట్రీగార్డులు, నీరు పోసే పేరుతో మంత్రి నారాయణ కోట్ల నిధులు దోచుకుంటున్నారు. అలా ఒక్కో మొక్కకు ఏకంగా రూ.12 వేలు ఖర్చు చేస్తున్నారు. అదే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో మొక్కకు చేసిన ఖర్చు కేవలం రూ.750 మాత్రమే. ఇప్పుడు తొలి విడతలో 14,741 మొక్కలకు సంబంధించి తన పార్టీకి చెందిన 25 మంది కాంట్రాక్టర్లకు అనుమతులిచ్చారు. మొదటి విడతలో నాటిన చెట్లకు రూ.8.03 కోట్లు చెల్లించారు. ఒక్కో మొక్క నాటి దానికి ట్రీగార్డు ఏర్పాటు చేసేందుకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.5,446. ఒక డివిజన్‌లో 1800 మొక్కకు నీళ్లు పోయడం కోసం రూ.1.24 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ లెక్కన ఒక్కో మొక్కకు నీరు పోసే వ్యయం రూ.6,888. అలా మొత్తం మీద మొక్కను నాటేందుకు రూ.5,500, దానికి నీరు పోయడానికి 7 వేలు. మొత్తం కలిపి రూ.12 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. 12 అడుగుల రోడ్డులో ఇరువైపులా మొక్కులేంటి?: నాడు వైయస్ఆర్‌సీపీ హయాంలో నాటిన చెట్లు ఏపుగా పెరిగి ఇప్పుడు నీడనిస్తున్నాయి. ఇప్పుడు మంత్రి నారాయణ నాటిస్తున్న మొక్కలకు రెండు నెలలే ఆకులు, పూలు ఉంటాయి. ఆక్సిజన్ ఇవ్వని, నీడ లేని ఇలాంటి చెట్ల వల్ల ఏం ప్రయోజనం? సిమెంట్ రోడ్డును కట్ చేసి మొక్కలు నాటుతున్నట్టు టెండర్లలో చెప్పుకుంటూ గ్రావెల్ రోడ్డులో నాటి సిమెంట్ రింగ్‌లు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇప్పటివరకు మొక్కలకు ట్రీగార్డులు కూడా ఏర్పాటు చేయలేదు. డబ్బుల కోసం 12 అడుగుల రోడ్డులో రెండు వైపులా మొక్కలు నాటి బిల్లులు కాజేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లలో కాకుండా ప్రైవేట్ ప్లేస్‌లో నాటిన మొక్కలకు మెష్ ఏర్పాటు చేసి బిల్లులు పెట్టుకున్నారు. కనీస బాధ్యత లేకుండా కరెంట్ తీగల కింద చెట్లను నాటారు. ఎవరైనా వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు మొక్కలు నాటుతారు. కానీ నారాయణ మాత్రం అవి బతికినా చచ్చినా ఫరవాలేదు. బిల్లులు వస్తే చాలు అన్నట్లు మండే ఎండల్లో నాటిస్తున్నాడు. మరోవైపు పన్నుల పేరుతో నగర వాసులను వేధిస్తున్నారు. టేబుల్‌పై కోడి గుడ్లు అమ్మకుంటున్న చిరు వ్యాపారిని టెంపరరీ ఎన్‌క్రోచ్మెంట్ పేరుతో పెనాల్టీ వేశారు. ఒక దగ్గర నేమ్ బోర్డు ఒక్క అడుగు ముందుకొస్తే పెనాల్టీ వేశారు. ఇంకా పేదలు నివసించే ఏరియాలో నీటి బిల్లు రూ.350 కట్టలేదని పైప్‌లైన్ కట్ చేసి డమ్మీలు పెట్టారని ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు.