తాడేపల్లి: రైతులకు అండగా నిలబడి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతుకి వెన్నుపోటు పొడుస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అడుగడుగునా రైతుకి అండగా నిలబడి ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసి రైతులకు దిక్కులేకుండా చేశారని ధ్వజమెత్తారు. ధాన్యం పండిస్తే కొనేవారు ఎవరూ లేరని, వరి అన్నం తింటే షుగర్ వస్తుందని సీఎం చంద్రబాబు ప్రచారం, యూరియా కృత్రిమ కొరత.. ఇలాంటివన్నీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రల్లో భాగమేనని వరికూటి అశోక్ బాబు వివరించారు. తాము పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని శాంపిల్స్ పట్టుకుని రైతులే మిల్లర్లను ప్రాధేయపడాల్సిన దుస్థితికి వ్యవసాయాన్ని దిగజార్చారని మండిపడ్డారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు తన వ్యవసాయ వ్యతిరేక విధానాలను విడనాడటం లేదని స్పష్టం చేశారు. గన్నీ బ్యాగుల కొరత, ధాన్యం రవాణాకి లారీల కొరత, మద్ధతు ధర లేకపోవడం, వరికోత యంత్రాలకు డిమాండ్.. ఇలా అడుగడుగునా కష్టాలు రైతులను వెక్కిరిస్తూ రైతులు ధాన్యం అమ్ముకునే దారి కనపడటం లేదని, దానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని స్పష్టం చేశారు. ఇకనైనా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని సీఎం చంద్రబాబుకి వరికూటి అశోక్ బాబు హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● పంట కొనాలని రైతులే ప్రాధేయపడాలి రైతులను కూటమి ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతోంది. ఒకపక్క తుపాన్ ప్రభావంతో తీవ్రంగా పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే, వారికి నష్టపరిహారం అందజేసి ఆదుకునే ఆలోచన చేయకుండా వ్యవసాయం దండగ అనే తన పాత నినాదానికే కట్టుబడి అన్నదాత వెన్ను విరిచేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండీ రైతుల పక్షాన నిలవకుండా వరి పండిస్తే కొనేవారే లేరని, వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని ప్రచారం చేసి వ్యవసాయం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాడు. వ్యవసాయం దండగ అని రైతులు కూడా అనుకునేలా తన పార్టీ నాయకుల ద్వారా యూరియా కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతను నిలువునా దోచుకున్నారు. ఈ స్థితిలో తీవ్ర ఇబ్బందులను అధిగమించి పంటలు పండిస్తే ప్రభుత్వం మద్ధతు ధరకు కొనుగోలు చేయడం లేదు. 75 కిలోల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,777 దక్కాల్సి ఉంటే.. రైతుకు సగటున రూ.1,200లు కూడా లభించడం లేదు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆఖరుకి రైతులకు గన్నీ బ్యాగులు కూడా దొరకడం లేదు. రైతులే తాము పండించిన ధాన్యం శాంపిల్స్ మిల్లర్ల వద్దకు తీసుకెళ్లి కొనుగోలు చేయమని ప్రాధేయ పడే దుస్థితికి ఏడాదిన్నర కూటమి పాలనలో వ్యవసాయం దిగజారిపోయింది. రైతులే మిల్లర్లతో ధరలు మాట్లాడుకోవాలి. వారు లారీలు లేవంటే సొంతంగా రైతులే రవాణా ఖర్చులు భరించి మిల్లర్లు చెప్పిన ప్రాంతానికి ధాన్యం తరలించాలి. తేమ 17% కంటే ఎక్కువ ఉంటే.. ఒక శాతానికి 2 కిలోల చొప్పున అదనంగా ధాన్యం సమర్పించుకోవాల్సిందే. అందుకు అంగీకరిస్తేనే ధాన్యం మిల్లుకు తరలే అవకాశం ఉంటోంది. వీటికితోడు మొంథా తుపాను దెబ్బకు కోత ఖర్చులు మూడు రెట్లు పెరిగాయి. సాధారణంగా ఎకరం గంటలో కోయొచ్చు. కానీ, తుపానుకు వరి పడిపోవడంతో ఎకరం కోతకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. దీంతో ఎకరం వరి కోతకు సుమారు రూ.10 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. పైగా ఒకేసారి పంట చేతికి రావడంతో వరి కోత మెషీన్లకు డిమాండ్ పెరిగి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎవరి దగ్గర పంట కొనాలి, ఎంతకి కొనాలో కూడా తెలుగుదేశం నాయకులే నిర్ణయిస్తున్నారు. 83 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందులో 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. కానీ వాస్తవం చూస్తే ఇప్పటికీ కేవలం 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. రైతులు పండించిన ధాన్యమంతా రోడ్లపైనే ఎండబెట్టుకుంటున్నారు. ఈ స్థితిలో మరోసారి తుపాన్ రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇవన్నీ తెలిసి కూడా ప్రభుత్వం రివ్యూ చేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం లేదు. వేమూరు నుంచి జంపన వస్తూ ఉంటే రోడ్ల మీద రైతులు వరి ధాన్యం పోసి ఎండబెట్టుకుంటున్నారు. ● వైయస్ఆర్‌సీపీ రైతులైతే తేమ శాతం 25 వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రతి పండించిన ప్రతి ధాన్యం గింజను ఆర్బీకే సెంటర్ల ద్వారా మద్ధతు ధరకి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు కావాల్సినన్ని గన్నీ బ్యాగులు ముందుగానే సరఫరా చేసింది. తేమ శాతం కారణం చూపించి రైతులను వేధించకుండా మద్ధతు ధరకే ఆర్బీకే సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించారు. రవాణాకి ఇబ్బంది లేకుండా లారీలను సిద్ధం చేయడం జరిగింది. కానీ నేడు రైతు సేవా కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చేరి రైతులను దోచుకుంటున్నారు. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులైతే తేమ శాతం ఎక్కువ చూపించి తక్కువ ధరకు ఇచ్చేయాలని అడుగుతున్నారు. తర్వాత ఆ రైతుల దగ్గర్నుంచి పొలం పేపర్లు తీసుకుని వాటి సాయంతో 15 తేమశాతానికి విక్రయించి మార్జిన్ సొమ్మును వారు కాజేస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులైతే తేమ శాతం 25 వచ్చినా 15 శాతమే చూపించి కొనుగోలు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల సాక్షిగా తెలుగుదేశం నాయకులు రైతుల్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇదంతా సీఎం చంద్రబాబుకి తెలిసే జరుగుతున్నా అరికట్టే ప్రయత్నం చేయడం లేదు. పెట్టుబడిసాయం కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు రెండేళ్లలో రూ.40 వేలకు గాను కేవలం రూ.10 వేలే ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. ఎకరం రూ.30 వేలకు పొలం తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ● అడుగడుగునా రైతును దోచుకునే ఆలోచనే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విత్తనం నాటిన వెంటనే ఆర్బీకే సెంటర్ నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ పొలంలోకి వెళ్లి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ కి నమోదు చేయడం జరిగేది. 84 లక్షల మంది రైతుల తరఫున పంటల బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లించింది. కానీ కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాని పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో పంట రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకే నష్టపరిహారం అందే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 65 లక్షల మంది రైతులు పంట నష్ట పరిహారం అందుకోలేకపోతున్నారు. గత వైయస్ఆర్‌సీపీ హయాంలో ఉచిత పంటల బీమా కారణంగా కంది పంట నష్టపోయిన రైతులు ఒక్క మర్రిపూడి మండలంలోనే రూ.36 కోట్లు పరిహారం అందుకున్నారు. పంట పండినా మాకు ఇన్ని డబ్బులు వచ్చేవి కాదని ఆరోజున రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రైతుల పక్షాన నిలిచే ఏ ఒక్క ప్రయత్నం చేయకపోగా సంక్షోభంలో ఎలా దోచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. కాలువ గట్లు, పంట కాలువలను కూడా సరిచేసే కార్యక్రమం చేయడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.