తాడేపల్లి: అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్స్ చెల్లించని కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యార్థి విభాగం ప్రెసిడెంట్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, రవిచంద్రలు.. తక్షణమే ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.5,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్ధులతో కలిసి దశలవారీ ఆందోళన చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నుంచి, సీఎం సహా మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఫీజులు చెల్లించకపోవడంతో పిల్లలు విద్యకు దూరమవుతున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. ఇద్దరూ విద్యారంగ ద్రోహులని వారు మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..: కూటమి పాలనలో అయోమయంలో విద్యార్ధులు :పానుగంటి చైతన్య. వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. – కూటమి పాలనలో విద్యార్ధుల భవిష్యత్తు అయోమయంగా మారింది. కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటడం లేదు. సీఎం చంద్రబాబు మాయమాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి యువత రోడ్లు మీదకు రావాల్సి వచ్చింది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగా మిగిలాయి. గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన, వసతిదీవెన కింద రూ.18,663 కోట్లు ఖర్చు చేసి, 55 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది చేకూర్చితే.. 2014–19 మధ్య చంద్రబాబు కేవలం 16 లక్షల మందికి మాత్రమే ఫీజు రీయింబర్స్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 8 త్రైమాసికాలకు గానూ రూ.5,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ ఖర్చుల కింద ఏటా రూ.1100 కోట్ల చొప్పున మరో రూ.2,200 కోట్లు.. వెరసి మొత్తం రూ.7,800 కోట్లు ప్రభుత్వం పిల్లలకు బకాయి పడింది. ఫీజుల కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీలు నడపలేక యాజమాన్యాలు నానా అగచాట్లు పడుతున్నారు. పిల్లలకు కాలేజీలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో, వారు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రతి నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ శ్రేణుల ఆందోళన బాట పట్టడం తథ్యం. ఈ పోరుబాటలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే మంత్రుల కార్యాలయలను, ఆ తర్వాత సీఎం కార్యాలయాన్ని ముట్టడించడం ఖాయం. కూటమి పాలనలో కుదేలైన విద్యావ్యవస్థ :రవిచంద్ర. వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. – రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా కుదేలైంది. విద్యార్ధులు, విద్యాసంస్థలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు తమ చదువులను ముందుకు తీసుకెళ్లలేని దయనీయ స్థితి నెలకొంది. వైయస్.జగన్ ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన కింద హాస్టల్‌ఖర్చు ఎప్పుడిస్తారో ముందే చెపి, తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లిస్తామని చెప్పినా, అది కూడా అమలు చేయడం లేదు. ఏకంగా 18 నెలలుగా, 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి పెట్టారు. పిల్లలు ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ పరీక్షలకు హాల్ టిక్కెట్లు ఇవ్వడం లేదు. దీని వల్ల విద్యార్థులు నష్టపోతున్నా, ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. ఇది ముమ్మూటీకీ దుర్మార్గమైన చర్య. ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమని, విద్యా రంగాన్ని మంత్రి నారా లోకేష్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని రవిచంద్ర ఆక్షేపించారు.