సింగరాయకొండ : అధికారంలోకి వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు బకాయిలు చెల్లించకుండా... కూటమి ప్రభుత్వం విద్యార్ధుల పాలిట శాపంలా మారిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. సింగరాయకొండ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రూ.7800 కోట్లు ఫీజు బకాయిలు కొండలా పేరుకుపోయినా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ తీరుతో విద్యార్ధులు, విద్యా సంస్థల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆక్షేపించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ. 1778 కోట్లు బకాయిలను అధికారంలో రాగానే వైయస్.జగన్ ప్రభుత్వం లో చెల్లించిందని... దీనిపై మంత్రి లోకేష్ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. పిల్లలు ఫీజులే చెల్లించిన మంత్రి లోకేష్ మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు మాత్రం గడపదాటడం లేదని తేల్చి చెప్పారు. తక్షణమే విద్యార్ధుల బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో విద్యార్ధి సంఘాలతో కలిసి పోరాటం తధ్యమని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... కూటమి ప్రభుత్వం విద్యార్ధుల పాలిట శాపం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని భారీ డైలాగులు చెప్పింది. ఉచిత విద్యతో పాటు, ఉన్నత విద్యకు భరోసా కల్పిస్తూ పేద విద్యార్ధులకు అండగా ఉంటామని వాగ్దానాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్యార్ధుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, స్కాలర్ షిప్పులు చెల్లించకుండా విద్యార్ధులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పేద, మద్య తరగతి విద్యార్ధులు చదువులకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదని తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా నాశనం చేసింది. 8 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పుల బకాయిలు కొండలా పేరుకుపోవడంతో విద్యార్ధులు, కాలేజీ యాజమాన్యాల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రైవేటు యాజమాన్యాలు నాణ్యమైన విద్యను అందించాలని పెద్ద పెద్ద మాటలు చెబుతున్న విద్యాశాఖ మంత్రి లోకేష్... ఆర్దిక ఇబ్బందులు సృష్టించి విద్యార్ధులను చదువుకొమ్మని చెబితే ఏ రకంగా సాధ్యం? మరోవైపు కాలేజీల యాజమాన్యాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టడంతో వారు అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి కనీసం జీతాలు కూడా చెల్లించలేకపోవడంతో పాటు నాణ్యమైన విద్యను అందించలేక, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అప్ డేట్ చేసుకోలేని దుస్దితికి చేరారు. ఇంత దుస్థితిలో విద్యాశాఖను నెట్టిన మంత్రి లోకేష్ క్వాంటమ్ వ్యాలీ, ఐటీ పార్కు, ఐటీ హబ్, ఏఐ యూనివర్సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ... సెమినార్ లో పేరుతో ప్రవచనాలు చెబుతున్నాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019-24 మధ్య 99 శాతం విద్యాకమిటీలు వేసి, ప్రతి ఏటై పేరెంట్స్ టీచర్స్ కమిటీలు వేయడంతో పాటు రెండు విడతలలో రూ.14 వేల కోట్లతో నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను సమూలంగా మార్పు చేసింది. ప్రతి ప్రభుత్వ స్కూలుకు స్వయంప్రతిపత్తి కలిగించాం. ఇవాళ ఆ కార్యక్రమాలన్నీ నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వం.. పేద, మద్యతరగతి విద్యార్ధుల పాలిట శాపంగా మారింది. 8 త్రైమాసికాలుగా రూ.7800 కోట్లు బకాయిలు... ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున 8 త్రైమాసికాలకు సంబంధించి రూ. 5600 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టగా.. హాస్టళ్స్ లో విద్యార్దులుకు ఏడాదికి రూ.1100 కోట్లు చొప్పున రూ.2200 కోట్లు మొత్తం రూ.7,800 కోట్లు విద్యార్ధులకు బకాయి పడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టింది.. దానిపై నేను చర్చకు సిద్ధమని మంత్రి లోకేష్ చెబుతుంటాడు. 2014-19 టీడీపీ ప్రభుత్వం తన హయాంలో 16,00,073 మంది విద్యార్దులకు రూ.1778 కోట్లు బకాయిలు చెల్లించకుండా వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా ? ఈ బకాయిలును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్.జగన్ ప్రభుత్వం దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని పేద, మద్య తరగతి విద్యార్ధులకు ఇబ్బంది రాకుండా ఉండాలని ఆ బకాయిలు చెల్లించలేదా ? దీనికి మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి ? ప్రైవేటు రంగంలో ఉన్న విద్యాసంస్ధలన్నీ 70 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ మీద ఆధారపడి ఉన్నాయి.. సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోతే విద్యార్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అలాగే కాలేజీల యాజమన్యాలు కూడా వారికి సర్టిఫికేట్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో వారు ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరం అవుతున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వైయస్.జగన్ హయాంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి నాలుగు దఫాలుగా విద్యాదీవెన, వసతి దీవెన చెల్లించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ దేశ చరిత్రలో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించిన ఏకైక ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. మంత్రి లోకేష్ దీనిపై చర్చకు సిద్ధమా ? ఇదీ వైయస్.జగన్ ప్రభుత్వ నిబద్దత... వైయస్.జగన్ ఐదేళ్ల పాలనలో వసతి దీవెనను మూడు రకాలుగా విభజించింది. ఐటీఐ విద్యార్ధులకు ఏడాది కి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్ధులకు రూ.20వేలు వసతి దీవెన అందిస్తూ.. ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షల మంది విద్యార్ధులకు రూ.18663.44 కోట్లు అందించిన మాట వాస్తవం కాదా ? ఇదో నిబద్దత. పేద మద్యతరగతి విద్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్య అందించాలన్న తలంపుతో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైయస్.జగన్ విద్యాదీవెన, వసతి దీవెన రెండు కార్యక్రమాలను ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా సాగించారు. కానీ ఇవాళ ఈ ఫీజు రీయింబర్స్ మెంట్ అందక లక్షలాది మంది విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. వైయస్సార్, వైయస్.జగన్ హాయంలో వరంలా ఉండే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవాళ కూటమి పాలనలో విద్యార్దులకు శాపంలా మారింది. రూ.7800 కోట్ల బకాయిలు ఉంటే రూ.700 కోట్లు మాత్రమే చెల్లించారు. అది కూడా త్రైమాసికంలా కాకుండా ఆరు నెలలకొకమారు నేరుగా కాలేజీలకు చెల్లిస్తామని ప్రకటించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇవాళ మొహం చాటేశారు. పిల్లల ఫీజులు కోసం ఆస్తులను, పుస్తెలను సైతం తల్లిదండ్రులు అమ్ముకుంటున్న దుస్ధితి. రెడ్ బుక్ అమలు తప్ప- పాలన పట్టని లోకేష్... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యమీద దృష్టి పెట్టడం లేదు. నిరంతరం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేయాలి, వైయస్ఆర్‌సీపీ నేతల మీద ఎలా కేసులు పెట్టి జైల్లో వేయాలన్నదే ఆయన ఆలోచన. ఈ నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో వైయస్.జగన్ తీసుకొచ్చిన సంస్కరణలన్నింటికీ మంగళం పాడారు. నాడు నేడు నిలపివేశారు. విద్యార్ధి సంఘాలు సైతం లోకేష్ ని ప్రశ్నిస్తున్నా... సమాధానం కరవైంది. ఏడాదిన్నర కాలంలో పెట్టుబడులు పేరుతో విహారాలు చేయడానికి, క్రికెట్ మ్యాచ్ లు కోసం, హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లకు దుబారా ఖర్చు చేస్తున్న లోకేష్, విద్యార్దుల ఫీజురీయింబర్స్ మెంట్ కి మాత్రం డబ్బుల్లేవా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని.. ఇప్పటికే విద్యార్ధి సంఘాలు నిర్ణయించాయి.ప్రభుత్వం తక్షణమే విద్యార్ధులకు అన్ని బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో విద్యార్ధి సంఘాల ఆందోళనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. పిల్లలకు ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకం వరకు ప్రభుత్వం చేస్తున్న దగా కార్యక్రమాలకు ప్రజలు తగిన తీర్పు చెప్పడం ఖాయమని హెచ్చరించారు.