కూటమి ప్రభుత్వంలో సంక్షోభంలో వ్యవసాయం

మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు.

ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం

ఎక్కడా, ఏ మాత్రం లేని చేయూత. అందని సహాయం

తుపాన్‌ దూసుకొస్తున్నా, లేని కనీస ముందు జాగ్రత్తలు

ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యం. వ్యవసాయం, రైతుల పాలిట శాపం

తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు

కళ్ళాల్లోనే ధాన్యం. రైతుల స్థితిగతి అత్యంత దయనీయం

ధాన్యం సేకరణ లేక, ఎక్కడికక్కడ రైతులకు కడగండ్లు 

ఏ పంటకూ కనీస మద్దతు ధర లేక కుదేలవుతున్న రైతులు

ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఒకవైపు వరసగా ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహాయం అందక రైతులు విలవిల్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు వెల్లడించారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 83 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా కాగా, దాంట్లో 51లక్షల టన్నుల ధాన్యం కొనడానికి సిద్దంగా ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ నెల రోజుల నుంచి చెబుతున్నా, ఎక్కడా అది కనీసం కార్యరూపం దాల్చడం లేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మరో తుపాన్‌ దూసుకొస్తున్నా, కనీస ముందుజాగ్రత్త చర్యలు లేవని, చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు ఆరా తీసి, వాటిని ప్రస్తావిస్తే, తమను, తమ పార్టీని దారుణంగా నిందిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆక్షేపించారు. 
ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఏం మాట్లాడారంటే..:

ధాన్యం కొనుగోళ్లు లేవు:
    1318 నెంబర్‌ ధాన్యం అసలు కొనుగోలు చేయట్లేదు. ఆ బ్రీడ్‌ను మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి  ప్రభుత్వమే సరఫరా చేసింది. అయినా సరే, కొనమంటే కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు పండించే పంట అంతా విత్తనాలకే తప్ప తినడానికి పనికి రావని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు మాూట్లాడుతున్నారు. అవి ప్రభుత్వం సరఫరా చేసినవే. వాస్తవానికి బీపీటీలు, 2716 రకం ధాన్యం అంతా కూడా తినడానికి పనికి వచ్చేవే.
    ఇటు వరసగా ప్రకృతి వైపరీత్యాలు, అటు దారుణంగా పడిపోయిన కనీస మద్దతు«ధలు, మరోవైపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందక రైతులు విలవిల్లాడుతున్నారని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకు పోయింది. మా కృష్ణా జిల్లాలో 160 రైస్‌ మిల్లులు ఉన్నాయి. వాటిలో 72 రైస్‌ మిల్లులకే డ్రయర్స్‌ ఉన్నాయి. తుఫాన్లు వచ్చినప్పుడు, అత్యవసర కోతలప్పుడు డ్రయర్‌ ఉన్న మిల్లుకే ధాన్యం తరలిస్తారు. అదే గోదావరి జిల్లాలో ప్రతి మిల్లుకు బాయిలర్లు ఉన్నాయి. వాటి కెపాసిటీ ఎక్కువ. కాబట్టి అక్కడి వారితో మాట్లాడి, «మిల్లర్లతో కూర్చొని ధాన్యం కొనమంటే రైతులకు ఈ బాధ వచ్చేది కాదు.
    ఇటీవలి తుపాన్‌లో ఎంత నష్టం జరిగిందన్న దానిపై లెక్కలు సరిగ్గా లేవు. పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్‌ 51 లక్షల టన్నుల ధాన్యం కొంటామని, నాడు ప్రకటించినా, అది ఏ మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ఒక పక్క అమెరికాను తలదన్నే టెక్నాలజీ ఉంది, తుఫాన్‌ను కూడా కంట్రోల్‌ చేస్తామని కబుర్లు చెబుతున్నారు. కానీ, ధాన్యం తడిచిపోతోంది, రైతులను ఎలా ఆదుకోవాలనే ఆలోచనే చేయని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.

దారుణంగా పతనమైన ధర:
    గత ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది బీపీటీలు 75 కేజీల బస్తాను రూ.2200కు కొన్నారు. ఇవాళ వాటినే రూ.1250 వరకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి రైతాంగాన్ని గట్టెక్కించాలి. కానీ, అందుకు భిన్నంగా రైతుల పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. గోనె సంచులు లేవని సాకు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, మిల్లర్లు, దళారులదే రాజ్యమైంది. దీంతో కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి, వాస్తవాలు గుర్తించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌నాయుడు కోరారు.

Back to Top