ఖబడ్దార్‌  చంద్రబాబు… నీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం 

 మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ హెచ్చరిక  

అనంతపురంలో రోడ్డెక్కిన అరటి రైతులు 

 గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ 

అనంతపురం: అరటి రైతులకు మద్దతుగా వైయస్సార్‌ సీపీ నేత, మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ అనంతపురం కలెక్టరేట్ వద్ద  సోమవారం పార్టీ శ్రేణులు, రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. జేఎన్టీయూ నుంచి కలెక్టరేట్ వరకూ  అరటి గెల్లలతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గిట్టుబాటు ధర ఇవ్వకపోతే అనంతపురం జిల్లాలోని నలుమూలలను మొత్తం దిగ్భంధం చేస్తామని  హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని శైలజానాథ్‌ విమర్శించారు. రైతులు పండించిన అరటి పంటను వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేసి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అరటి పండ్లను కేజీ  రెండు రూపాయలకు వస్తోందని.. రైతుల కడుపు కేకలు చంద్రబాబుకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుది చేతుల ప్రభుత్వం కాదు… మాటల ప్రభుత్వం మాత్రమే అని  విమర్శించారు. రైతుల పక్షాన ఆలోచించే బుర్ర  చంద్రబాబుకు లేదని శైలజానాథ్‌ అన్నారు. 
‘వ్యవసాయం దండగ’ అని మాట్లాడిన చంద్రబాబు రైతుల సమస్యల్ని పట్టించుకోరని,అబద్ధాలతో చంద్రబాబు పరిపాలన సాగుతోంది… ఇక ఇలా సాగనివ్వమని రైతుల పక్షాన ఆయన హెచ్చరించారు.  “దాదాపు 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అందులో కనీసం రూ.10,000 కోట్లు రైతులకు ఇవ్వండి  అని డిమాండ్‌ చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎలా న్యాయం చేశారో ఆయనను చూసి నేర్చుకోండని  హితవు పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్ ఓ. ఆనంద్‌కు రైతుల గిట్టుబాటు ధరలు పెంచాలని వినతిపత్రం అందజేశారు.

Back to Top