చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయపోరాటం

శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ  

తాడేప‌ల్లి: చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయపోరాటం చేస్తామ‌ని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

ప్ర‌క‌ట‌న‌లో బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏమ‌న్నారంటే..
తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి  కేసులు మూసివేయిస్తున్నారు. ఆ కేసుల్లో  ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను బెదిరించి, భయపెట్టి వాటిని ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారు. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబునాయుడు అడ్డదారులు తొక్కుతున్నారు. తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయనాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబునాయుడుగారికి అలవాటే. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుగారిపై గవర్నర్‌గారు తక్షణం చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలి. 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య చంద్రబాబు  చేసిన అవినీతికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ఆ కేసులు నమోదయ్యాయి. స్కిల్‌ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు కూడా పంపింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు కూడా. ఇవికాక అసైన్డ్‌ ల్యాండ్‌ కేసు, అమరావతి రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ కేసు, ఉచిత ఇసుక పేరుతో దోపిడీచేసిన వ్యవహారంలో కేసు, ఫైబర్‌ నెట్‌లో వందలకోట్ల అవినీతికేసు సహా లిక్కర్‌ కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈకేసుల పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతి క్షణం వీటిని నిర్వీర్యంచేయడానికి ప్రయత్నించారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులు కొందరిని లేని స్కాంల్లో ఇరికించి, భయటపెట్టి, ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తే, మరికొందరితోకూడా అడ్డదారుల్లో ఫిర్యాదులను ఉపసంహరించుకునేలాచేస్తున్నారు. ఇంకోవైపు దర్యాప్తు సంస్థలు మౌనందాల్చి ఏకంగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఇటీవల అసైన్డ్‌ల్యాండ్స్‌ కేసును, ఇవాళ తాజాగా లిక్కర్‌ కేసును,  మూసివేశారు. మిగిలిన కేసులను కూడా అదే మూసివేత దారిలో నడిపిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబుగారు సాక్షులను, ఫిర్యాదుదారులును బెదిరించి కేసులను మూసివేయించడం అత్యంత దుర్మార్గం.  చట్టాన్ని అపహాస్యం చేయడమేకాకుండా, రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కతున్నారు. ఇంతటి అధికార దుర్వినియోగం దేశంలో ఎక్కడా చూడలేదు. చంద్రబాబుగారిని తక్షణమే నిలువరించాలని మేం గవర్నర్‌గారికి విజ్ఞప్తిచేస్తున్నాం. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టవేయాలని కోరుతున్నాం. చంద్రబాబుగారి అధికార దుర్వినియోగంపై న్యాయపోరాటం చేస్తాం.

Back to Top