కర్నూలు జిల్లా: రాజధాని అంశంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఎమ్మెల్యే విరుపాక్షి. రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదని, అయితే చంద్రబాబు చెబుతున్నది ఒకటి , చేస్తున్నది మరొకటని విమర్శించారు. అమరావతి పేరిట కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుంటున్నారని, కానీ పనులు మాత్రం శూన్యంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే అభిప్రాయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలో ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిలో ఒక శాశ్వత భవనం అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసమే ప్రస్తుతం పరిపాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరే పనీ చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పేరు వింటే చంద్రబాబు వణికిపోతున్నారని విమర్శించిన విరుపాక్షి, రాజధాని బిల్లును అసెంబ్లీలో మాత్రమే ప్రవేశపెట్టి, శాసన మండలిలో ఎందుకు చర్చకు పెట్టలేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.